garib rath express
-
గరీభ్‌రథ్ రైలులో పాము.. ప్రయాణీకులు పరుగు..
సాక్షి, ముంబై: ప్రయాణంలో రైలులో పాము ప్రత్యక్షం కావడం ప్రయాణీకులకు భయాందోళనకు గురిచేసింది. గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పాము కనిపించడంతో ప్రయాణీకులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్(12187) రైలు ముంబైకి బయలుదేరింది. రైలు నడుస్తుండగానే మార్గ మద్యంలో కాసర రైల్వే స్టేషన్ వద్ద ఏసీ కోచ్ జీ-17లో పాము కనిపించింది. రైలు కోచ్‌లో అప్పర్ బెర్త్ హ్యాండిల్‌కు చుట్టుకొని కాసేపు అలాగే ఉంది. ఒక్కసారిగా పామును చూసి భయపడిన ప్రయాణీకులు వేరే కోచ్‌లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో కోచ్ డోర్లు మూసివేశారు.కాసర రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే.. ప్రయాణీకులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం, స్నేక్ క్యాచర్స్ టీమ్ వచ్చి పామును పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Snake in train! Snake in AC G17 coach of 12187 Jabalpur-Mumbai Garib Rath Express train. Passengers sent to another coach and G17 locked. pic.twitter.com/VYrtDNgIIY— Rajendra B. Aklekar (@rajtoday) September 22, 2024 ఇది కూడా చదవండి: పని ఒత్తిడితో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య! -
గరీబ్ రథ్ ఇక సూపర్ ఫాస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆకుపచ్చ రంగు బోగీలతో పరుగులు తీసే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు సరికొత్తగా ఎరుపు రంగు బోగీలతో పట్టాలెక్కడంతో పాటు శరవేగంగా పరుగులు తీయనుంది. గరీబ్ రథ్ రైళ్లకు ఇప్పటివరకు ఉన్న దశాబ్దాల నాటి ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌ల స్థానంలో ఇకపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్‌హెచ్‌బీ (లింక్హాఫ్మెన్ బుష్) కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.ఎల్హెచ్బి కోచ్‌లతో కూడిన గరీబ్ రథ్ ఈ నెల 22 నుంచే సికింద్రాబాద్ నుంచి వైజాగ్మధ్య ప్రారంభం కానుంది. ఈ ఎక్స్ ప్రెస్‌లో మొత్తం బోగీలన్నీ తృతీయ శ్రేణి ఏసీ కోచ్‌లే ఉంటాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల వల్ల గరీబ్‌రథ్ వేగం గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వరకు చేరుకోనుంది. సూపర్ ఫాస్ట్ రైళ్లతో సమానంగా ఇది పరుగులు తీయనుంది. మిగతా రైళ్ల టికెట్ ధర కంటే చాలా తక్కువ గోదావరి, ఈస్ట్ కోస్ట్, విశాఖ, కోణార్క్ ఫలక్ను మా వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్లలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.1080 వరకు ఉంటుంది. కానీ సికింద్రాబాద్ నుంచి విశాఖకు గరీబ్ రథ్ థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.770 ఉంటుంది. ఇకపై ఆ రైళ్లు కూడా స్పీడ్ రైడ్: గరీబ్ రథ్ రైళ్లను ఎల్‌హెచ్‌బీలుగా మార్చనున్నట్లు రైల్వేబోర్డు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే పరిధిలో కాజీపేట్, విజయవాడ మీదుగా సికింద్రాబాద్ నుంచి విశాఖకు నడిచే రైలుతో పాటు వికారాబాద్, రాయ్‌చూర్ మీదుగా నడిచే సికింద్రాబాద్–యశ్వంత్ పూర్ ట్రై వీక్లీ గరీబ్ రథ్ కూడా ఎల్‌హెచ్‌బీగా మారనుంది.అలాగే దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి రాకపోకలు సాగించే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – నిజాముద్దీన్, యశ్వంత్‌పూర్–విశాఖ గరీబ్‌రథ్ రైళ్లు కూడా ఎల్హెచ్బీకి మారనున్నాయి. దశలవారీగా దక్షిణమధ్య రైల్వేలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బీకి మార్చారు. ఇప్పటి వరకు 90% రైళ్లు ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్బీకి మారగా, మరో 18 రైళ్లు ఐసీఎఫ్ కోచ్‌లతో నడుస్తున్నాయి. త్వరలో వీటినీ ఎల్హెచ్బీకి మార్చనున్నారు. ఈ కోచ్‌లు ఎంతో సురక్షితం⇒ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ప్రయాణికులకు ఎంతో భద్రత ఉంటుంది. ⇒ దురదృష్టవశాత్తు రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురైనా ఈ కోచ్‌లు ఒకదానిపైకి ఒకటి రాకుండా నిలిచిపోతాయి. దీంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది. ఐసీఎఫ్ కోచ్‌లలో ప్రమాదాలు జరిగినప్పుడు కోచ్‌లు ఒకదానిపైకి మరొకటి చేరుతాయి. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం ఎక్కువగా ఉంటోంది. ⇒ అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినా వెంటనే వ్యాప్తి చెందవు. ఇటీవల జరిగిన రైలు ప్రమాదాల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉన్న రైళ్లలో ప్రాణనష్టం తక్కువగా ఉండడానికి కారణం కోచ్‌ల సామర్థ్యమేనని అధికారులు చెబుతున్నారు. -
గరీబ్‌రథ్ జాడేది?
♦ హైదరాబాద్–విశాఖపట్నం మధ్య నిత్యం తిరిగే గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 12 గంటల 35 నిమిషాలు. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1395 ♦ సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వారంలో మూడురోజులు తిరిగే దురొంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 10 గంటల 15 నిమిషాలు. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1630 ♦ సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రోజూ తిరిగే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 11 గంటలే. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1085 మాత్రమే. ♦ గోదావరి, దురొంతో ఎక్స్‌ప్రెస్‌లతో పోలి స్తే గరీబ్రథ్కు డిమాండ్ ఎక్కువ. కానీ, ఆ శ్రేణి రైళ్ల సంఖ్య పెంచేందుకు కేంద్రప్ర భుత్వం ససేమిరా అంటోంది. కేవలం రంగు మార్పు, ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఏర్పాటుకే పరిమితమవుతున్నట్టు తెలుస్తోంది. సాక్షి, హైదరాబాద్: పేదలు కూడా తక్కువ ధరతో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో 17 ఏళ్ల క్రితం రైల్వేశాఖ గరీబ్‌రథ్ కేటగిరీ రైళ్లు ప్రారంభించింది. లాలూప్రసాద్‌యాదవ్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇవి పట్టాలెక్కాయి. సులభంగా ప్రజలకు తెలిసేలా పూర్తి ఆకుపచ్చ రంగుతో ఈ రైళ్లు ఉన్నాయి. వీటిల్లో అన్నీ ఏసీ మూడో శ్రేణి కోచ్‌లే. గరిష్ట వేగం గంటకు దాదాపు 130 కిలోమీటర్లు. సూపర్‌ఫాస్ట్ ఎక్స్ప్రెస్లకంటే ఇవి వేగంగా పరుగుపెడతాయి. అందుకే వాటితో పోలిస్తే ఇవి కొంత తొందరగా గమ్యం చేరుతాయి. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మూడోశ్రేణి ఏసీ కోచ్‌లలో ఉండే టికెట్ ధర కంటే దాదాపు 15 శాతం తక్కువ ధరకే గరీబ్‌రథ్ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ♦ 2008 ఫిబ్రవరిలో సికింద్రాబాద్–యశ్వంతపూర్ మధ్య, అదే సంవత్సరం అక్టోబరులో సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రెండు రైళ్లను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు వారంలో కొన్ని రోజులు మాత్రమే తిరు గుతాయి. ఒక్క విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే నిత్యం తిరుగుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అందులో టికెట్ దొర కటం గగనమే. ♦ గతేడాది సంక్రాంతి రోజున సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. 16 కోచ్‌లతో తిరుగుతున్న ఆ రైలులో ఆక్యుపెన్సీ రేషియో 114– 120 శాతంగా ఉంటోంది. దీంతో ఇటీవలే అదే రూట్లో 8 కోచ్‌లుండే మరో వందేభారత్‌ను ప్రారంభించారు. కానీ, దీనికంటే ఎక్కువ డిమాండ్ ఉన్నా.. ఆ మార్గంలో రెండో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం కేటాయించటం లేదు. ♦ ఇతర నగరాలకు కూడా గరీబ్‌రథ్ రైళ్లు నడపా లని కోరుతున్నా పట్టించుకోవటం లేదు. సాధా రణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ కోచ్ టికెట్ ధరలను కూడా పేదలు భరించలేరన్న ఉద్దేశంతో గరీబ్‌రథ్ రైళ్లను ప్రారంభించారు. అలాంటిది వందేభారత్ కేటగిరీ రైలు టికెట్ ధరలను అసలే భరించలేరు. కానీ, వాటి సంఖ్యను మాత్రం పెంచుతూ, 17 ఏళ్లు గడుస్తున్నా రెండో గరీబ్‌రథ్‌ను ప్రారంభించలేదు. త్వరలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రస్తుతం గరీబ్‌రథ్ రైళ్లు సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లతో తిరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వీటితో తీవ్ర ప్రాణనష్టం జరుగుతోందన్న ఉద్దేశంతో.. అన్ని రైళ్లకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. వేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు గరీబ్‌రథ్ కేటగిరీ రైళ్లకు మాత్రం వాటిని ఏర్పాటు చేయలేదు. త్వరలో వాటన్నింటికి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని తాజాగా రైల్వే నిర్ణయించింది. తొలినుంచి ఆకుపచ్చ రంగు కోచ్‌లే ఉన్నందున, ఇప్పుడు వాటి రంగు మార్చాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎరుపురంగు వేయాలని భావిస్తున్నట్టు అనధికార సమాచారం. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేసినప్పుడు, 3 ఏసీ ఎకానమీ నమూనా కోచ్‌లు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వీటిల్లో బెర్తుల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం గరీబ్‌రథ్‌లో ఒక్కో కోచ్‌లో 78 మంది ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఆ సంఖ్య 83కు చేరుతుందని సమాచారం. -
రంగు మారనున్న గరీబ్ రథ్.. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు!
అందరికీ ఏసీ కోచ్‌లలో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో రైల్వేశాఖ గరీబ్ రథ్ రైలును ప్రారంభించింది. ఇప్పుడు ఈ రైలులో పలు మార్పులు సంతరించుకుంటున్నాయి. బోగీల సంఖ్యను పెంచడంతోపాటు, రంగు కూడా మార్చనున్నారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ గరీబ్ రథ్‌లో చోటుచేసుకోబోయే మార్పులను మీడియాకు తెలియజేశారు. బీహార్‌కు అనుసంధానమైన అన్ని గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లలో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. ముజఫర్‌పూర్-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడుస్తున్న రైలు నంబర్ 12211/12 గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌తో సహా బీహార్ మీదుగా వెళ్లే గరీబ్‌రథ్ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను లింక్ హాఫ్మన్ బుష్‌గా మార్చనున్నారు. ఈ మార్పుల తరువాత గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ 16 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లతో నడుస్తుంది. దీంతో ఒక్కో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో 352 బెర్త్‌లు పెరగనున్నాయి. ఈ రైళ్లకు కొత్త త్రీ టైర్ ఎకానమీ కోచ్‌ను అనుసంధానం చేయనున్నారు. దీంతో గతంలో కంటే ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించే అవకాశం ఏర్పాడుతుంది. ఇప్పటివరకూ ఆకుపచ్చ రంగుతో విభిన్నంగా కనిపించిన గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఇకపై ఎరుపు రంగులో కనిపించనుంది. -
గరీబ్‌రథ్ ప్రయాణికులపై కొత్త భారం
కొత్త సంవత్సరం కానుకగా ప్రయాణికుల నెత్తిన చార్జీల భారం మోపిన రైల్వే బోర్డు.. ఇప్పుడు మరో నిర్ణయంతో నడ్డి విరిచేందుకు సిద్ధమైంది. సామాన్యులకు ఏసీ ప్రయాణ సౌకర్యం అందించేందుకు ప్రారంభించిన గరీబ్‌రథ్ రైళ్లలో అదనపు సర్ చార్జీలు వసూళ్లు చేసేందుకు సిద్ధమైంది. గరీబ్‌రథ్ ఎక్కిన ప్రయాణికులు దిండు, బ్లాంకెట్ కావాలంటే రూ.25 రుసుం చెల్లించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విశాఖ నుంచి సికింద్రాబాద్ వరకు గరీబ్‌రథ్‌లో వెళ్లే ప్రయాణికులపై చార్జీల వడ్డన కారణంగా రూ.30 అదనపు భారం పడుతుండగా.. ఇప్పుడు మరో రూ.25 బాదుడుతోప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రైల్వే శాఖ ప్రయాణికులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. జనవరి ఒకటి నుంచి రైలు చార్జీలు పెంచి ప్రయాణికుల పై భారం మోపిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరో భారం మోపుతూ రైల్వే శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ప్రయాణికుల పుండుపై కారం చల్లినట్లుగా మారింది. గరీబ్‌రథ్ రైళ్లలో ప్రయాణించే వారు ఇకపై దిండు, బ్లాంకెట్ కోసం ప్రత్యేక చార్జీలు చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలు అమల్లోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా గరీబ్ రథ్ రైళ్లను 2005లో ప్రవేశపెట్టారు. గరీబ్‌రథ్ అంటే పేదల రథం. అతి తక్కువ ధరకే పేదలకు ఏసీ కోచ్‌లు అందించాలనే లక్ష్యంతో ఈ సేవలు మొదలయ్యాయి. ఇతర రైళ్ల ఏసీ ప్రయాణం కంటే ఇందులో 2/3 వంతు ఛార్జీ వసులు చేస్తారు. ఈ నెల ఒకటి నుంచి చార్జీలు పెంపుతో అదనపు భారం పడింది. దీనికి తోడు ఏసీ ప్రయాణికులకు అందించే దుప్పట్లపైనా ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. రూ.500తో ప్రారంభమై..: గరీబ్‌రథ్ పేరుతో మొదలైన సేవలు అనుకున్నట్లుగానే సామాన్యుడికి అందుబాటులోనే టికెట్ ధరలుండేవి. గరీబ్ రథ్‌ని ప్రారంభించిన సమయంలో టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే ఉండేది. తరువాత రూ.715 వరకు పెంచుకొచ్చారు. జనవరి ఒకటి నుంచి అమలైన ధరలతో టికెట్‌పై ఏకంగా రూ.30 భారం పడింది. ఈ భారమే ఎక్కువైందని సామాన్యులు భావిస్తున్న నేపథ్యంలో తాజాగా తీసుకున్న నిర్ణయం మరింత భారం మోపింది మొత్తంగా రూ.55 భారం : ఇకపై రిజర్వేషన్ చార్జీతో పాటు ఏసీ ప్రయాణికులకు అందించే బ్లాంకెట్ కోసం అదనంగా రూ.25 వసూలు చెయ్యనున్నారు. ఈ కొత్త ధర మే 15 నుంచి అమల్లోకి తీసుకురావాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. టికెట్ బుక్ చేసినప్పుడే ఈ చార్జీలను అందులోనే కలిపెయ్యాలని నిర్ణయించారు. అంటే ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.745తో పాటు రూ.25 కలిపి మొత్తం టికెట్ ధర రూ.770గా మారనుంది. అంటే గరీబ్‌రథ్‌లో ప్రయాణం చెయ్యాలనుకునే సగటు ప్రయాణికుడిపై రూ.55 అదనపు భారం(పెరిగిన టికెట్ చార్జీ రూ.30, బ్లాంకెట్ చార్జీ రూ.25) పడనుంది. రైల్వే బోర్డు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎవరి కోసం గరీబ్‌రథ్.? సామాన్య ప్రయాణికుల కోసం గరీబ్‌రథ్ ప్రవేశపెట్టామన్నారు. కానీ ఎప్పటికప్పుడు ధరలు పెంచేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ దిండ్లు, దుప్పట్లకి కూడా చార్జీలు వసూలు చెయ్యడం దారుణం. ఇలా ప్రయాణికులపై ఎప్పటికప్పుడు భారం పెంచేసి సాధారణ రైలు టికెట్లా వసూలు చేస్తే గరీబ్‌రథ్ ఎవరి కోసం ప్రవేశపెట్టారో రైల్వే అధికారులే చెప్పాలి.– బి.రవికుమార్, విశాఖ ప్రయాణికుడు -
30 నిమిషాలునరకమే!
పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణ): విశాఖపట్నం–హైదరాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ సీహార్స్ కూడలి వద్ద నిలిపివేయడంతో ఈ మార్గంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు 30 నిమిషాలు నరకం చూస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.... హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు ఉదయం 8.30– 9 గంటల మధ్య విశాఖ చేరుకుంటుంది. తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం చేస్తుంది. ఈ మధ్య కాలంలో దీన్ని శుభ్రం చేసేందుకు లోకోషెడ్‌కు తరలిస్తారు. అయితే ఉదయం 8.30 గంటల సమయంలో విశాఖపట్నానికి వచ్చే రైళ్ల సంఖ్య అధికంగా ఉండడంతో విశాఖకు చేరుకున్న గరీబ్ రథ్‌ను వెంటనే లోకోషెడ్‌కు తరలింపునకు కుదరదు. దీంతో గరీబ్ రథ్‌ను చావులమదుం మీదుగా పోర్టుకు వెళ్లే రైల్వే ట్రాక్‌మీద సీహార్స్ కూడలి వరకూ రైల్వే అధికారులు పంపుతున్నారు. సమస్య మొదలయ్యేది ఇక్కడే.. ఉదయం 9.30 గంటల సమయంలో గరీబ్ రథ్‌ను ప్రతి రోజు పంపుతుండడంతో ఆ ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీహార్స్ కూడలి నుంచి పోర్టుట్రస్ట్, జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఎండీసీ వంటి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పోర్టు ఆవరణలో ఉన్న పలు ప్రైవేటు కార్యాలయాలకు ఉద్యోగులు వెళ్లాల్సింది ఉంటుంది. హడావుడిగా ఉద్యోగులు సీహార్స్ కూడలి నుంచి పోర్టులోకి వెళ్లే మలుపు తిరగ్గానే ఎదురుగా గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ కనిపించడంతో దాదాపు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల వరకూ మండుటెండలో పడిగాపులు పడాల్సి వస్తోంది. ఆఫీసులకు వెళ్లే సమయంలో అడ్డంగా రైలు ఉండడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ భయం.. దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాల్లో బయోమెట్రిక్ ప్రవేశపెట్టడంతో ఆలస్యంగా కార్యాలయానికి చేరుకుంటే ముప్పు తప్పదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలకు ముందుగా బయలుదేరినా మార్గమధ్యలో గరీబ్‌రథ్ సృష్టిస్తున్న ఆలస్యానికి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మరో మార్గంలో ప్రయాణం.. సీహార్స్ కూడలి వద్ద రైలు నిలిచిన సమయంలో కార్యాలయాలకు వెళ్లే వారు తమ కార్యాలయాలను చేరుకోవాలంటే మరో ప్రత్యామ్నాయ మార్గం ఉన్నా సుమారు నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాలి. సీహార్స్ కూడలి నుంచి కాన్వెంట్ కూడలికి వచ్చి అక్కడి నుంచి పోర్టు అంతర్గత మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యామ్నాయ మార్గంలో నిరంతరం కంటైన్లరకు మోసుకుంటూ భారీ వాహనాలు నిరంతరం తిరుగుతుంటాయి. ప్రమాదకరమైన ఈ మార్గాన్ని అత్యవసర సమయాల్లో తప్ప వినియోగించేందుకు సాహసించారు. సకాలంలో చేరకుంటే ఇబ్బంది గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌ను సీహార్స్ కూడలి వరకూ తీసుకువచ్చి అక్కడ నిలిపి ఉంచడం వల్ల ఉద్యోగులు నరకం చూస్తున్నారు. సమ యానికి కార్యాలయాలకు వెళ్లకపోతే ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే. రైల్వే అధికారులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి – ఎం.ఎస్.ఎన్.పాత్రుడు, విశ్రాంత పోర్టు ఉద్యోగి -
గరీబ్‌రథ్ పట్టాలు తప్పుతుందా ?
సామాన్యులకు సరసమైన ధరకే ఏసీ ప్రయాణం.. నిత్యం వంద శాతం ఆక్యుపెన్సీతో సర్వీసులు..నెలా రెండు నెలల ముందే పూర్తి అయ్యే రిజర్వేషన్లు..ఇవే గరీబ్ రథ్ రైలు ప్రత్యేకతలు. పేదలకు ఏసీ ప్రయాణాన్ని చేరువ చేసి.. దాదాపు 11 ఏళ్లుగా నిత్యం విశాఖపట్నం– సికింద్రాబాద్‌ల మధ్య అపూర్వ ఆదరణతో పరుగులు తీస్తున్న ఈ రైలు పట్టాలు తప్పి సామాన్యులకు దూరం నుందా?.. ఏసీ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్చుకొని ఉన్నత వర్గాల దరికి చేరనుందా ? రైల్వేబోర్డు నుంచి అందుతున్న సంకేతాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : దేశవ్యాప్తంగా గరీబ్ రథ్ రైళ్లను 2005లో ప్రవేశపెట్టారు. గరీబ్‌రథ్ అంటే పేదల రథం. అతి తక్కువ ధరకే పేదలకు ఏసీ కోచ్‌లు అందించాలనే లక్ష్యంతో ఈ సేవలు మొదలయ్యాయి. ఇతర రైళ్ల ఏసీ ప్రయాణం కంటే ఇందులో 2/3 వంతు ఛార్జీ వసూలు చేస్తారు. ఇందులో భాగంగా 2008లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకూ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభమయ్యాయి. వారానికి రెండు సార్లు నడిపినప్పుడు వస్తున్న ఆదరణ చూసి వారానికి 3 సార్లు సర్వీసు పెంచారు. ఆక్యుపెన్సీకి విపరీతమైన డిమాండ్ వస్తుండటంతో 2015 నుంచి ప్రతి రోజూ నడపడం ప్రారంభించారు. అయినా నిత్యం రద్దీగానే ఉంటోంది. చౌకగా ఏసీ ప్రయాణం.. మొత్తం 18 కోచ్‌లుండగా.. 892 బెర్తుల్ని జనరల్ కోటాగా, 422 బెర్తుల్ని తత్కాల్ కోటాగా భర్తీ చేస్తున్నారు. మిగిలిన ఎక్స్‌ప్రెస్ ట్రైన్, సూపర్‌ఫాస్ట్ ట్రైన్ల కంటే.. గరీబ్‌రథ్ ప్రయాణం చాలా చౌక. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లాలంటే ఇతర ట్రైన్లలో థర్డ్ ఏసీ 1050, సెకెండ్ ఏసీ 1490 చెల్లించాలి. కానీ గరీబ్‌రథ్ జనరల్ కోటాలో అయితే.. రూ.715 చెల్లించాల్సి ఉండగా.. తత్కాల్లో రూ.1030 ధర ఉంది. అన్నీ ఏసీ బోగీలుండటం, టికెట్ ధర కూడా అందుబాటులో ఉండటంతో సామాన్యులు సైతం గరీబ్‌రథ్ ప్రయాణానికే ఎక్కువగా మొగ్గు చూపేవారు. అప్పటి వరకూ ట్రైన్లో ఏసీ ప్రయాణమంటే.. అమ్మో అంత ఖరీదా.. అని అదిరిపడే ప్రయాణికులకు చల్లని ప్రయాణాన్ని పరిచయం చేసింది గరీబ్‌రథ్. నెల రోజుల తర్వాత బుక్ చెయ్యాలని ప్రయత్నించినా వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తుంటుంది. ఇలా నిత్యం రద్దీగా ఉండే ఈ ట్రైన్‌ని రద్దు చేసే యోచనలో రైల్వేశాఖ ఆలోచనలు పట్టాలెక్కాయి. గరీబ్‌రథ్ స్థానంలో ఏసీ ఎక్స్‌ప్రెస్... దేశవ్యాప్తంగా ఉన్న గరీబ్‌రథ్ రైళ్లని రద్దు చేసేందుకు రైల్వే బోర్డు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. వీటి స్థానంలో ఏసీ ఎక్స్‌ప్రెస్‌లను నడిపితే.. రెట్టింపు ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో సామాన్యుడి ఏసీ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 52( 26 పెయిర్స్) గరీబ్‌రథ్ రైళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇందులో నిత్యం రద్దీగా ఉండేవి కేవలం 5 ట్రైన్లు మాత్రమే. వాటిలో విశాఖ–సికింద్రాబాద్, సికింద్రాబాద్–విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే 100 శాతం రద్దీతో మొదటి స్థానంలో ఉన్నాయి. అలాంటి రైలుని రద్దు చేసి దాని స్థానంలో ఏసీ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని భావిస్తున్నారు. గరీబ్‌రథ్‌లో ఒక బోగీకి టిక్కెట్ల ద్వారా రూ.52 వేల వరకు ఆదాయం వస్తుంది. కానీ.. సాధారణ ఏసీ ఎక్స్‌ప్రెస్ వేస్తే థర్డ్ ఏసీ బోగీకి రూ.76 వేల వరకూ ఆదాయం వస్తుంది. ఈ లెక్కన ఒక రోజుకి ఒక వైపు గరీబ్‌రథ్ బదులుగా ఏసీ ఎక్స్‌ప్రెస్ నడిపితే రూ.5 లక్షలకు పైగా అదనపు ఆదాయం వస్తుందని అధికారులు లెక్కలు కడుతున్నారు. దీంతో పాటు ఈ రైళ్లు ప్రారంభమై దశాబ్ద కాలం గడుస్తోంది. పాత కోచ్‌ల స్థానంలో కొత్త కోచ్‌లు ఏర్పాటు చెయ్యాలంటే భారం పడుతుందనేదీ మరో కారణంగా రైల్వే భావిస్తోంది. అందువల్లనే గరీబ్రథ్కు స్వస్తి చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. గరీబ్‌రథ్ రాకపోకల్ని నిలిపెయ్యొద్దంటూ వాల్తేరు రైల్వే వర్గాలతో పాటు ప్రజలూ కోరుతున్నారు. -
గరీబ్‌రథ్ చార్జీలకూ రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : పేదవారి ఏసీ ట్రైన్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ చార్జీలూ భారం కానున్నాయి. పదేళ్ల కిందట రూ 25గా నిర్ణయించిన ధరను సవరించాలని రైల్వేలు నిర్ణయించాయి. గత కొన్నేళ్లుగా లినెన్ ధర పెరిగినప్పటికీ గరీబ్ రథ్ రైళ్లలో ప్రయాణీకులకు అందించే దుప్పట్ల ధరను టికెట్ రేటులో కలపలేదు. అయితే తాజాగా ఈ ధరల భారాన్ని గరీబ్ రథ్ చార్జీలను పెంచడం ద్వారా కొంతమేర భర్తీ చేయాలని భావిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. బెడ్‌రోల్ ధరలను రైలు చార్జీల్లో కలపాలని కాగ్ కోరిన మీదట ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని చెప్పారు. రానున్న కొద్ది నెలల్లో బెడ్‌రోల్ ధరలు టికెట్ ధరలో కలపడంతో చార్జీలు కొంతమేర పెరుగుతాయని వెల్లడించారు. బెడ్‌రోల్ కిట్స్ ధరలను టికెట్‌తో పాటే ప్రస్తుతం ఆఫర్ చేస్తుండగా, ఇక వీటి ధరలనూ టికెట్లో కలుపుతామని అధికారులు సంకేతాలు పంపారు. కాగ్ సూచనలతో పేద, సాధారణ ప్రయాణీకులు ఎంచుకునే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల పైనా చార్జీల వడ్డన తప్పేలా లేదు. -
షార్ట్‌సర్క్యూట్‌తో నిలిచిన గరీబ్‌రథ్
విశాఖపట్టణం: వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ సమీపంలోని మౌలాలిలో బుధవారం ఉదయం నిలిచిపోయింది. జీ-11 బోగీపైన ఉండే రేకు ఒకటి కరెంట్ లైనుకు తాకటంతో షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి రైలు ఆగిపోయినట్లు సమాచారం. ఆ బోగీపై స్వల్పంగా మంటలు రేగటంతో భయపడిన ప్రయాణికులు కిందికి దిగిపోయారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.