వందేభారత్ సంఖ్య పెరుగుతున్నా.. పేదల రైళ్ల అతీగతీ లేదు
17 ఏళ్లుగా రెండింటితోనే నెట్టుకొస్తున్న తీరు
ఇప్పుడు వాటి రంగు మార్చి, ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం
♦ హైదరాబాద్–విశాఖపట్నం మధ్య నిత్యం తిరిగే గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 12 గంటల 35 నిమిషాలు. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1395
♦ సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వారంలో మూడురోజులు తిరిగే దురొంతో ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 10 గంటల 15 నిమిషాలు. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1630
♦ సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రోజూ తిరిగే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం 11 గంటలే. ఇందులో మూడో శ్రేణి ఏసీ తరగతి టికెట్ ధర రూ.1085 మాత్రమే.
♦ గోదావరి, దురొంతో ఎక్స్‌ప్రెస్‌లతో పోలి స్తే గరీబ్‌రథ్‌కు డిమాండ్ ఎక్కువ. కానీ, ఆ శ్రేణి రైళ్ల సంఖ్య పెంచేందుకు కేంద్రప్ర భుత్వం ససేమిరా అంటోంది. కేవలం రంగు మార్పు, ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఏర్పాటుకే పరిమితమవుతున్నట్టు తెలుస్తోంది.
సాక్షి, హైదరాబాద్: పేదలు కూడా తక్కువ ధరతో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో 17 ఏళ్ల క్రితం రైల్వేశాఖ గరీబ్‌రథ్ కేటగిరీ రైళ్లు ప్రారంభించింది. లాలూప్రసాద్‌యాదవ్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇవి పట్టాలెక్కాయి. సులభంగా ప్రజలకు తెలిసేలా పూర్తి ఆకుపచ్చ రంగుతో ఈ రైళ్లు ఉన్నాయి.
వీటిల్లో అన్నీ ఏసీ మూడో శ్రేణి కోచ్‌లే. గరిష్ట వేగం గంటకు దాదాపు 130 కిలోమీటర్లు. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకంటే ఇవి వేగంగా పరుగుపెడతాయి. అందుకే వాటితో పోలిస్తే ఇవి కొంత తొందరగా గమ్యం చేరుతాయి. సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మూడోశ్రేణి ఏసీ కోచ్‌లలో ఉండే టికెట్ ధర కంటే దాదాపు 15 శాతం తక్కువ ధరకే గరీబ్‌రథ్ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.
♦ 2008 ఫిబ్రవరిలో సికింద్రాబాద్–యశ్వంతపూర్ మధ్య, అదే సంవత్సరం అక్టోబరులో సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య రెండు రైళ్లను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు వారంలో కొన్ని రోజులు మాత్రమే తిరు గుతాయి. ఒక్క విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే నిత్యం తిరుగుతుంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అందులో టికెట్ దొర కటం గగనమే.
♦ గతేడాది సంక్రాంతి రోజున సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. 16 కోచ్‌లతో తిరుగుతున్న ఆ రైలులో ఆక్యుపెన్సీ రేషియో 114– 120 శాతంగా ఉంటోంది. దీంతో ఇటీవలే అదే రూట్‌లో 8 కోచ్‌లుండే మరో వందేభారత్‌ను ప్రారంభించారు. కానీ, దీనికంటే ఎక్కువ డిమాండ్ ఉన్నా.. ఆ మార్గంలో రెండో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం కేటాయించటం లేదు.
♦ ఇతర నగరాలకు కూడా గరీబ్‌రథ్ రైళ్లు నడపా లని కోరుతున్నా పట్టించుకోవటం లేదు. సాధా రణ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఏసీ కోచ్ టికెట్ ధరలను కూడా పేదలు భరించలేరన్న ఉద్దేశంతో గరీబ్‌రథ్ రైళ్లను ప్రారంభించారు. అలాంటిది వందేభారత్ కేటగిరీ రైలు టికెట్ ధరలను అసలే భరించలేరు. కానీ, వాటి సంఖ్యను మాత్రం పెంచుతూ, 17 ఏళ్లు గడుస్తున్నా రెండో గరీబ్‌రథ్‌ను ప్రారంభించలేదు.
త్వరలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
ప్రస్తుతం గరీబ్‌రథ్ రైళ్లు సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లతో తిరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు వీటితో తీవ్ర ప్రాణనష్టం జరుగుతోందన్న ఉద్దేశంతో.. అన్ని రైళ్లకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని గతంలోనే కేంద్రం నిర్ణయించింది. వేగంగా ఆ పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు గరీబ్‌రథ్ కేటగిరీ రైళ్లకు మాత్రం వాటిని ఏర్పాటు చేయలేదు. త్వరలో వాటన్నింటికి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేయాలని తాజాగా రైల్వే నిర్ణయించింది.
తొలినుంచి ఆకుపచ్చ రంగు కోచ్‌లే ఉన్నందున, ఇప్పుడు వాటి రంగు మార్చాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎరుపురంగు వేయాలని భావిస్తున్నట్టు అనధికార సమాచారం. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఏర్పాటు చేసినప్పుడు, 3 ఏసీ ఎకానమీ నమూనా కోచ్‌లు ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. వీటిల్లో బెర్తుల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం గరీబ్‌రథ్‌లో ఒక్కో కోచ్‌లో 78 మంది ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఆ సంఖ్య 83కు చేరుతుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment