కడెం: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు దిగువన గ్రామాల ప్రజల గుండెల్లో సైరన్ మోగుతోంది. ఓ వైపు వరుస వానలతో వరద పోటెత్తుతుండటం, మరోవైపు ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు గురై నీటిని సరిగా విడుదల చేయలేని పరిస్థితి తలెత్తడంపై ఆందోళన మరింతగా పెరుగుతోంది. శనివారం కూడా ప్రాజెక్టుకు గణనీయ స్థాయిలో ప్రవాహం కొనసాగింది. ఇలాంటిది అకస్మాత్తుగా భారీ వరద వస్తే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అన్న భయం కనిపిస్తోంది.
మరమ్మతులు చేపట్టేదెప్పుడు?
గతేడాది జూలైలో వచ్చిన వరదతో కడెం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. 2, 3 నంబర్ గేట్ల కౌంటర్ వెయిట్‌లు కొట్టుకుపోయాయి. రక్షణ గోడలు, స్పిల్ వే, వరద గేటు మోటార్లు దెబ్బతిన్నాయి. కానీ పూర్తిస్థాయి మరమ్మతులకు సరిపడా నిధులు కేటాయించకపోవడం, అదీ సకాలంలో విడుదల చేయకపోవడంతో ఇటీవలి వరకు మరమ్మతుల పనులు ప్రారంభమే కాలేదు. ప్రాజెక్టు దెబ్బతిన్న పదినెలల తర్వాత అంటే మే నెలలో రూ.1.44 కోట్లను మరమ్మతుల కోసం మంజూరు చేశారు. రెండుసార్లు టెండర్లు నిర్వహించారు. టెండర్ పూర్తయ్యే సమయానికి వానాకాలం మొదలవడంతో పనులు చేపట్టలేదని అధికారులు తెలిపారు.
అరకొర నిర్వహణతో..
ఏటా ప్రాజెక్టు గ్రీసింగ్, జనరేటర్ నిర్వహణ, చిన్నస్థాయి మరమ్మతుల కోసం ప్రభుత్వం ఏటా రూ.8 లక్షలు కేటాయిస్తుంది. అవి పైపై పనులకే సరిపోతాయి. అయితే 2018లో ప్రాజెక్టుకు కేటాయించిన 5 కోట్ల నిధుల్లో మిగిలిన మొత్తంతో అధికారులు గేట్ల కౌంటర్ వెయిట్‌లను తయారు చేయిస్తున్నారు. ఇక వానాకాలం మొదలయ్యే ముందే వరద గేట్లు సరిగా పనిచేస్తున్నాయా, లేదా అని ట్రయల్ రన్ చేసి పరిశీలించాలి.
కానీ అధికారులు ఏదో ఒక గేటును పరిశీలించి తూతూమంత్రంగా ప్రక్రియ ముగిస్తున్నారు. అసలు సమయానికి లోపాలు బయటపడితే.. సాంకేతిక కారణాలు అని చెప్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక కనీసం ప్రాజెక్టు గేట్ల వద్ద తేనెతుట్టెలనూ తొలగించలేదు. శుక్రవారం వరద పోటెత్తినప్పుడు గేట్లు ఎత్తడానికి వెళ్లిన సిబ్బందిపై తేనెటీగలు దాడి చేయడంతో గాయపడ్డారు. తేనెతుట్టెల కారణంగా 18వ నంబర్ గేటును ఎత్తడం లేదని సమాచారం.
ఏడాదిగా నిర్లక్ష్యమే..
కడెం ప్రాజెక్టు మరమ్మతులను ఏడాదైనా పూర్తి చేయించకపోవడం దురదృష్టకరం. స్థానిక ఎమ్మెల్యే, నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు అధ్వానంగా మారింది. ఇప్పటికైనా వేగంగా మరమ్మతులు చేయించాలి. – అలెగ్జాండర్, ఎంపీపీ, కడెం
ప్రాజెక్టుకు ముప్పు లేదు
ప్రాజెక్టులో టెక్నికల్ ప్రాబ్లంతో కొన్ని గేట్లు మొరాయించాయి. మెకానికల్ సిబ్బందితో గేట్ల మోటార్లకు మరమ్మతు చేయిస్తున్నాం. ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు. – శ్రీనివాస్, ప్రాజెక్టు సీఈ
Comments
Please login to add a commentAdd a comment