సాక్షి, హైదరాబాద్: ఇంటర్‌మీడియెట్ బోర్డ్‌లో సీసీ కెమెరాల ట్యాంపరింగ్‌కు పాల్పడటమే కాకుండా, వివిధ నేరారోపణలతో సస్పెండైన ప్రభుత్వ లెక్చరర్ పి.మధుసూదన్ రెడ్డికి ఇంటర్ సంస్థల కార్యాలయాల్లో అనుమతి నిషేధిస్తూ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని స్టేట్‌బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (విద్యాభవన్), కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (ప్రొఫెసర్ జయశంకర్ విద్యా భవన్), నాంపల్లి కాలేజీ కాంప్లెక్స్‌ల్లోకి మధుసూదన్ రెడ్డి ప్రవేశిస్తే నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా అతనితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకున్నా క్రిమినల్ చర్యగానే గుర్తించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంటర్ బోర్డ్ కార్యాలయంలోకి మధుసూదన్ రెడ్డి అక్రమంగా ప్రవేశించి, అక్కడి ఉద్యోగిని బెదిరించి సీసీ కెమెరాలను ట్యాంపర్ చేసినట్టు ఇంటర్ బోర్డ్ ఈ నెల 30న బేగంబజార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయ డం తెలిసిందే. ఒక మహిళా ఉద్యోగిని మధు సూదన్ రెడ్డి లైంగికంగా వేధించడంతో పాటు ఆయనపై ఉన్న పలు ఏసీబీ, క్రిమినల్ కేసులను నవీన్ మిత్తల్ తన ఆదేశాల్లో వివరించారు.
‘నాపై నిషేధం ఆశ్చర్యంగా ఉంది..’
ఇంటర్మీడియెట్ కార్యాలయాల్లోకి తన ప్రవేశాన్ని నిషేధిస్తూ నవీన్ మిత్తల్ ఇచ్చిన ఉత్తర్వులపై ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది తన హక్కులను కాలరాయడమేనని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment