సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురానికి చెందిన అల్లంపల్లి మధుసూదన్ బతికి ఉన్నారా లేదా.. ఒకవేళ కరోనా వైరస్ కారణంగా మరణించితే ఆ విషయాన్ని అతని కుటుంబసభ్యులకు తెలియజేయాలి కదా.. అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై సమగ్ర సమాచారాన్ని అందజేయాలని ఆదేశించింది. విచారణను శుక్రవారానికి (నేటికి) వాయిదా వేసింది. తన భర్త మధుసూదన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్చిన తర్వాత అతని ఆచూకీ తెలియలేదంటూ భార్య మాధవి దాఖలు చేసిన రిట్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ వి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. తన భర్త మధుసూదన్ ఎక్కడ ఉన్నారో తెలియజేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె వ్యాజ్యంలో కోరారు. పిటిషనర్ మామ (మధుసూదన్ తండ్రి) కరోనా వచ్చి మరణించారని, ఆ తర్వాత జరిపిన వైద్య పరీక్షల్లో మధుసూదన్‌కు పాజిటివ్ అని తేలడంతో ఏప్రిల్ 30న గాంధీ ఆస్పత్రికి తరలించారని పిటిషనర్ న్యాయవాది కరుణసాగర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు.
మే 1న ఆమె భర్తతో ఫోన్‌లో మాట్లాడారని, ఆ తర్వాత నుంచి అతని ఆచూకీ చెప్పడం లేదన్నారు. కరోనా నివారణకు చికిత్స పొందుతూ మరణించినట్లుగా గాంధీ ఆస్పత్రి లేదా జీహెచ్‌ఎంసీ చెప్పడం లేదన్నారు. అయితే ప్రభుత్వం మే 21న వెలువరించిన ప్రకటన మేరకు మరణించినట్లుగా తెలుస్తోందని, అయితే ఈ విషయాన్ని అధికారికంగా పిటిషనర్‌కు గానీ కుటుంబ సభ్యులకుగానీ తెలియజేయలేదన్నారు. కరోనా వల్ల మరణించినప్పుడు అధికారులే అంత్యక్రియలు నిర్వహిస్తే ఆ మేరకు వీడియో తీసి సంబంధిత ఏసీపీకి సీడీ ఇవ్వాలని, ఈ విధంగా కూడా చేయలేదన్నారు. మధుసూదన్‌కు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యాక పిటిషనర్ ఆమె పిల్లలకు కూడా కోఠి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మే 2న గాంధీకి తరలించి వైద్యం చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, ఎవరైనా మరణిస్తే ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని, అయినా ఈ కేసులో మధుసూదన్ బతికి ఉన్నారో లేదో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి విచారణను నేటికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment