
సాక్షి, హైదరాబాద్: పలు జాతీయ, అంతర్జాతీయ కార్టూన్, క్యారికేచర్ పోటీల్లో అనేక బహుమతులు సాధించిన సాక్షి కార్టూనిస్ట్ శంకర్ ఖాతాలో మరో రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు చేరాయి. పోర్చుగీస్ ప్రింటింగ్‌ప్రెస్ ప్రతియేటా నిర్వహించే 23వ పోర్టో కార్టూన్ వరల్డ్ ఫెస్టివల్‌లో శంకర్ వేసిన రెండు చిత్రాలు ప్రథమ, ద్వితీయ బహుమతులకు ఎంపికయ్యాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మార్టిన్ లూథర్‌కింగ్ క్యారికేచర్‌కు గాను మొదటి బహుమతి, ప్రఖ్యాత పియానిస్ట్ మారియా పైర్స్ క్యారికేచర్‌కు ద్వితీయ బహుమతి లభించింది.
కార్టూన్, క్యారికేచర్ విభాగంలో ఆస్కార్‌గా భావించే గ్రాండ్ ప్రిక్స్ వరల్డ్ ప్రెస్ అవార్డును 2014లోనూ శంకర్ సాధించడం గమనార్హం. ఈ పోటీల్లో ఆయనకు మొత్తం 1,300 యూరోల ప్రైజ్‌మనీ లభించనుంది. త్వరలో పోర్టో సిటీలో జరగబోయే బహుమతి ప్రదానోత్సవంలో ఆయన అవార్డును అందుకోనున్నారు. కాగా, అంతర్జాతీయ క్యారికేచర్ పోటీలకు శంకర్ నాలుగుసార్లు జ్యూరీగానూ వ్యవహరించారు. ఇటీవల జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని కళాకృతిలో ఆయన గాంధీ చిత్రాల ప్రదర్శన నిర్వహించారు. ‘ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్’ అధ్యక్షుడిగానూ శంకర్ వ్యవహరిస్తున్నారు.
కేటీఆర్ అభినందనలు
పోర్చుగల్ పోర్టో కార్టూన్ వరల్డ్ ఫెస్టివల్‌లో రెండు అవార్డులు సాధించిన శంకర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందించారు. శంకర్ తెలంగాణకు గర్వకారణమని, భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment