సాక్షి, హైదరాబాద్: రానున్న మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు పిండప్రదానాలు సమర్పించే వారి కోసం హైదరాబాద్ నుంచి ఉత్తరాదికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలును నడపనుంది. స్వదేశ్ దర్శన్ రెండో ప్యాకేజీలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు (ఐదు రాత్రులు, 6 పగళ్లు) మహాలయ పిండ్ దాన్ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ కిశోర్ తెలిపారు.
ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, విశాఖ, భువనేశ్వర్ మీదుగా గయ, వారణాసి, ప్రయాగ సంగమం వరకు వెళ్లి తిరిగి సికింద్రాబాద్ చేరుకోనుంది. రైలు చార్జీలతోపాటు రోడ్డు రవాణా, వసతి, భోజనం తదితర సదుపాయాలతో స్లీపర్ క్లాస్‌లో ఒక్కొక్కరికీ రూ. 14,485 చొప్పున, థర్డ్ ఏసీ రూ. 18,785 చొప్పున ఉంటుంది. ఈ పర్యటనలో ఇద్దరు లేదా ముగ్గురికి కలిపి నాన్ ఏసీ హోటల్‌లో బస ఏర్పాటు చేస్తారు.
నేచర్ టూర్స్
►కశ్మీర్, కేరళ, కన్యాకుమారి, రామేశ్వరం, భువనేశ్వర్ తదితర ప్రాంతాల్లో నేచర్ టూర్‌లను ఆస్వాదించే మరో సదుపాయాన్ని కూడా ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 25, సెప్టెంబర్ 8, 23 తేదీల్లో హైదరాబాద్ నుంచి లేహ్, లద్దాక్‌లకు విమాన టూర్‌లను ప్రవేశపెట్టింది. ఈ పర్యటనలో లేహ్, శ్యామ్ వ్యాలీ, నుబ్రా, తుర్టక్, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ చార్జీ ఒక్కొక్కరికి రూ. 38,470 చొప్పున ఉంటుంది.
►సెప్టెంబర్ 13 నుంచి రాయల్ రాజస్తాన్ పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో జైపూర్, జోధ్‌పూర్, పుష్కర్, ఉదయ్‌పూర్ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఫ్లైట్ చార్జీలతోపాటు అన్ని వసతులకు ఒక్కొక్కరికీ రూ. 29,400 చొప్పున చార్జీ ఉంటుంది.
►కేరళ డిలైట్స్ పేరుతో ఐఆర్‌సీటీసీ మరో టూర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 7న ఈ టూర్ మొదలవుతుంది. అలెప్పి, కొచ్చి, మున్నార్, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. రూ. 35,500 చొప్పున చార్జీ ఉంటుంది.
►సౌత్ ఇండియా టెంపుల్ రన్ టూర్‌లో భాగంగా కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తిరుచ్చి, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. నవంబర్ 1 నుంచి 6 రాత్రులు, 7 పగళ్లు ఈ పర్యటన కొనసాగుతుంది. ఒక్కొక్కరికీ రూ. 30,200 చొప్పున చార్జీ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ ఫోన్ నంబర్ల 040–27702407/9701360701 ను సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment