సాక్షి, సూర్యాపేట: కూలీల స్థితిగతులను అంచనా వేయడం కోసం ఐఆర్‌ఎస్ అధికారి ఉపాధి కూలీగా మారారు. ఈ ఆసక్తికర ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కూలీగా మారిన అధికారి పేరు సందీప్ బాగా.
వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్, బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్‌లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన సోమవారం నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూలీలతో కలిసి పనిచేశారు.
ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం చేపట్టిన స్వయం ఉపాధి కార్యక్రమాలను వారికి వివరించడంతోపాటుగా వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు గురించి వివరించారు. వాటిపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఆయన కూలీలతో కలిసి భోజనం చేయడంతో పాటుగా బతుకమ్మ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. తనతో పాటు పనిలో పాల్గొన్న 152 మంది కూలీలకు తన జీతం నుంచి రూ.200 చొప్పున అందజేశారు. ఇక, ఉన్నాతాధికారి అయిన సందీప్ వారితో కలిసి ఉండటం, భోజనం చేయడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment