కేటీఆర్ స్పష్టికరణ
దీపావళికి ఇంట్లో పార్టీ చేసుకోవాలంటే పర్మిషన్ కావాలా?
ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని చెప్తూనే.. కేసు ఎలా పెడతారు?
అది ఫామ్‌హౌస్ కాదు.. నా బావమరిది ఉండే ఇల్లు
రాజకీయంగా ఎదుర్కోలేకే కేసుల కుట్ర
అక్రమ కేసులు బనాయించి దెబ్బతీసేందుకు సర్కారు యత్నం
ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టీకరణ
కేసీఆర్ నేర్పిన ఉద్యమ బాటలోనే నడుస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీని, తమను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ కుట్రలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు. తనను ఎదుర్కోలేక కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. జైళ్లకు పంపినా, ఎక్కడికి పంపినా తాము ఉద్యమ బాటలో నడుస్తామని.. చావుకు తెగించి ఉద్యమం చేశామని, ఈ కేసులకు, చిల్లర ప్రయత్నాలకు భయపడబోమని స్పష్టం చేశారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో జరిగిన పార్టీపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వరుస వైఫల్యాలు, ఆరు గ్యారంటీలు, రేవంత్ బావమరిదికి కట్టబెట్టిన అమృత్ టెండర్లు, సివిల్ సప్లైస్ స్కామ్‌పై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధీరోదాత్తంగా పోరాటం చేస్తున్నారు. వాటిపై మాకు సమాధానం చెప్పే పరిస్థితి ప్రభు త్వానికి లేదు. చేతనైతే రాజకీయంగా తలబడండి. శాసనసభ పెట్టండి. రుణమాఫీ కావచ్చు.. మూసీ సుందరీకరణ కావచ్చు.. ఆరు గ్యారంటీల అమలు కావచ్చు.. ప్రతి అంశం మీద సావధానంగా చర్చించి మిమ్మల్ని ఎండగట్టడానికి కేసీఆర్ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా గొంతునొక్కి, ఇష్టమొచ్చినట్లు కేసులు పెట్టి.. రాజకీయంగా మా కుటుంబ సభ్యులను వేధించి ఏదో సాధిస్తామని అనుకుంటే మీరు సాధించేది ఏమీ ఉండదు.
నా బావమరిదికి నెగెటివ్ వచ్చిందిగా..
దీపావళికి ఒక ఇంట్లో దావత్ చేసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలంట. మా బావమరిది రాజ్ పాకాల జన్వాడ రిజర్వ్ కాలనీలో కొత్త ఇల్లు కట్టుకున్నారు. అది ఫామ్‌హౌస్ కాదు.. నా బావమరిది నివాసం ఉండే ఇల్లు. రాజ్ పాకాల ఏం తప్పు చేశాడు. తన సొంతింట్లో దావత్ చేసుకుంటే రేవ్ పార్టీ అని పేరుపెట్టి.. దాన్నో సినిమా చేశారు. ఆ పార్టీలో మా బావమరిది తల్లి, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పార్టీలో ఉన్నది ఎవరో పురుషులు, మహిళలు కాదు.. భార్యాభర్తలు. పొద్దున నాలుగు మందు బాటిళ్లు దొరికాయని ఎక్సైజ్ కేసు పెట్టారు. కానీ సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయింది.
ఎన్డీపీఎస్‌లో 25, 27, 29 సెక్షన్లు పెట్టారు. అసలు ఆ సెక్షన్లు ఏమిటి? సప్లయర్, కన్సంప్షన్, కోహోస్ట్ అని పెట్టారు. అసలు సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలి. లేదా ఎవరో ఒకరు సప్లై చేసి ఉండాలి. అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెబుతున్నారు. ఇంకా కేసు ఎలా పెడతారు? అక్కడ 14 మందికి టెస్ట్ చేస్తే 13 మందికి నెగెటివ్ వచ్చింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఒక్కరు కూడా.. ఆయన ఎక్కడ తీసుకున్నాడో తెలుసుకోకుండా ఎలా కేసు పెడతారు? మత్తుపదార్థం దొరికిందా? ఏ రకంగా బద్నాం చేస్తారు?
నేను కూడా ఉన్నానని తప్పుడు ప్రచారం
కుటుంబ కార్యక్రమాన్ని రేవ్ పార్టీ అంటూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేను అక్కడ లేకున్నా నా పేరుతో అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రజాజీవితంలో ఉంటే మాపై ఎలాంటి మాటలైనా అడ్డగోలు ప్రచారం చేయవచ్చా? అది రాజ్ పాకాల ఇల్లు, ఫాంహౌజ్ కాదు. కుటుంబ సభ్యులను పురుషులు, మహిళలు అంటూ చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ 21 గంటలు పరిశోధించి పట్టుకున్నది ఏమిటి? అక్కడ ఏం లేదని చాలా స్పష్టంగా అధికారులే చెప్పారు, అయినా ఎందుకీ దు్రష్పచారం. రాజ్ పాకాలకు డ్రగ్స్ టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది. అయినా ఆయనపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అయినా ఎన్డీపీఎస్ కేసు ఎలా పెడతారు? ఉదయం ఇచ్చిన పంచనామాకు, ఎఫ్‌ఐఆర్‌కు తేడా ఎలా వచ్చింది? బాంబులు అని చెప్పి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు.
ఎంత ఇబ్బంది పెట్టినా పోరాటం ఆపం..
అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపినా.. మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా పోరాటాన్ని ఆపబోం. రేవంత్‌రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. మీరిచ్చిన హమీలు నెరవేర్చకపోవడం, ప్రజలను మోసం చేయడాన్ని ప్రజల్లోకి తీసుకెళతాం. కేసీఆర్ నేరి్పన ఉద్యమ బాటలో నడుస్తాం.’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment