బంజారాహిల్స్ రోడ్డు నంబర్.12 నుంచి జూబ్లీహిల్స్
చెక్‌పోస్ట్ వరకు రహదారి విస్తరణకు ప్రణాళికలు
మాజీ మంత్రి జానారెడ్డి, నటుడు బాలకృష్ణ సహా ప్రముఖుల ఇళ్లకు మార్కింగ్‌లు..
వారి నుంచి సహకారం అందేనా అని సందేహాలు
బంజారాహిల్స్: రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రోడ్డునెంబర్–12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు భూసేకరణలో భాగంగా పలు భవనాలకు మార్కింగ్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–92లో నివసించే మాజీ మంత్రి జానారెడ్డి రోడ్డు విస్తరణలో భాగంగా తన ప్లాట్ నుంచి 600 గజాల స్థలాన్ని కోల్పోనున్నారు. ఆయన ఇంటికి వేసిన మార్కింగ్ ప్రకారం ఆయన ప్లాట్‌లో సగభాగం విస్తరణలో కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–1 రెండు రోడ్లు కలిపి ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు. ఆయన సుమారుగా తన ప్లాట్‌లో 500 గజాల వరకు కోల్పోనున్నారు. అలాగే ఈ రోడ్డులో నివసిస్తున్న మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి తదితరుల ఇళ్లకు కూడా మార్కింగ్ వేశారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఒకవైపు ప్రాజెక్ట్ ఇంజనీర్లు సన్నద్ధం అవుతుండగా..ఇంకోవైపు కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
ఎలా చూసినా ఈ ఆస్తుల సేకరణ తప్పేలా కనిపించడం లేదు. అంతా ప్రముఖులే కావడంతో రోడ్డు విస్తరణ పనులకు తమ స్థలాలను అప్పగించేందుకు ఎంతవరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభుత్వంపై కస్సుబుస్సుమంటున్నట్లు తెలుస్తోంది. మా ఇంటికే మార్కింగ్ వేస్తారా? అంటూ నిలదీతలు కూడా మొదలయ్యాయి. మరికొంతమంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దాకా తీసుకువెళ్తామని చెబుతున్నారు.
జూబ్లీహిల్స్‌లో ఒకవైపే..
బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణలో భాగంగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని అగ్రసేన్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు రోడ్డుకు ఒకవైపే ఆస్తులు సేకరించనున్నారు. ప్రస్తుతం ఇక్కడ 80 అడుగుల రోడ్డు మాత్రమే 120 అడుగుల వరకు విస్తరించనున్నారు. ఒకవైపు కేబీఆర్ పార్కు గోడ ఉండగా, ఆ ప్రాంతాన్ని ముట్టుకోవడం లేదు. సమరసింహారెడ్డి, జానారెడ్డి, బాలకృష్ణ తదితరులు ఉంటున్న వైపు మాత్రమే రోడ్డు విస్తరణ జరగనుంది. ఆ మేరకే మార్కింగ్ వేశారు. ఇదిలా ఉండగా బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 విరించి ఆస్పత్రి చౌరస్తా నుంచి అగ్రసేన్ చౌరస్తా వరకు ప్రస్తుతం 80 అడుగుల రోడ్డు ఉంది.
దీనిని 100 అడుగుల మేర విస్తరించనున్నారు. ఈ రోడ్డుకు రెండు వైపులా ఆస్తుల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే 86 నివాసాలకు మార్కింగ్ చేశారు. ఈ రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు వాహనాల రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. అయితే పనులు ముందుకుసాగడంలోనే అధికారులకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. అంతా ప్రముఖులే కావడం, ప్రభుత్వంలో ఉండడం వల్ల వీరు తమ ఆస్తులు ఇవ్వడానికి ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment