చాట్‌జీపీటీతో ఉద్యోగ మార్పులు తథ్యం! | Job Changes With ChatGPT | Sakshi
Sakshi News home page

చాట్‌జీపీటీతో ఉద్యోగ మార్పులు తథ్యం!

Published Fri, Sep 29 2023 12:43 AM | Last Updated on Fri, Sep 29 2023 2:26 AM

Job Changes With ChatGPT - Sakshi

వృత్తి నిపుణల నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లింక్డిన్‌ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇటీవలే ఈ సంస్థ జనరేటివ్‌ ఏఐ తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది తెలుసుకునేందుకు హైదరాబాద్‌లో ఓ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల్లో 79 శాతం మంది జనరేటివ్‌ ఏఐ తాము చేసే ఉద్యోగాల్లో కచి్చతంగా మార్పులు తీసుకొస్తుందని అనుకుంటున్నారు.

అదే సమయంలో ఏఐ వల్ల తమ పని ఎంతో కొంత సులువు అవుతుందని 66 శాతం మంది భావిస్తున్నారు. కెరీర్‌లో ముందడుగు వేసేందుకు ఏఐ పనికొస్తుందని కూడా వారు విశ్వసిస్తున్నారు. కొంచెం వివరంగా చూస్తే చాట్‌జీపీటీ వంటి జనరేటివ్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులోకి రావడంతో దాదాపు ప్రతి రంగంలోనూ వినూత్న మార్పులు రావడం తెలిసిందే. మార్కెటింగ్, సేల్స్‌ వంటివే కాకుండా చిన్నచిన్న ప్రోగ్రామ్‌లు రాయడం, కస్టమర్ల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం వంటి అనేక విషయాల్లో ఇది ఉపయోగపడుతోంది.

ఈ నేపథ్యంలోనే లింక్డిన్‌ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. జనరేటివ్‌ ఏఐలో వస్తున్న మార్పులను, కొత్త అప్లికేషన్లను దృష్టిలో పెట్టుకుంటే ఏడాది కాలంలో టెక్‌ రంగంలోనూ గణనీయమైన మార్పులు వస్తాయని హైదరాబాద్‌లోని ఐటీ వృత్తి నిపుణులు అంటున్నారు. సర్వే చేసిన ప్రతి 10 మందిలో దాదాపు 8 మంది ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

జనరేటివ్‌ ఏఐ విస్తృత వాడకంతో చాలా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనపైనా టెకీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏఐ రంగంలో వస్తున్న మార్పులను పట్టించుకోకుంటే ఉద్యోగాలకు ఇబ్బందన్నది నిజమేనని 42 శాతం మంది పేర్కొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఏఐ గురించి తెలుసుకొనేందుకు దాన్ని తమ ఉద్యోగాల్లో భాగం చేసుకునేందుకు సుమారు 69 శాతం మంది సిద్ధంగా ఉండటం!  కంచర్ల యాదగిరిరెడ్డి

మేమిప్పటికే వాడేస్తున్నాం..
సర్వే చేసిన వారిలో సుమారు 64 శాతం మంది ఇప్పటికే తాము ఏఐను ఉద్యోగాల్లో భాగంగా వాడుతున్నట్లు చెప్పారు. అలాగే చాట్‌జీపీటీ వంటి జనరేటివ్‌ ఏఐను వాడే ప్రయత్నం చేస్తున్నామన్న వాళ్లు సగానికిపైగా ఉన్నారు. దేశం మొత్తమ్మీద చూస్తే చాట్‌జీపీటీని వినియోగించే వాళ్లలో 54 శాతంతో మిలినియల్స్‌ ముందు వరుసలో ఉన్నారు. జెన్‌–జీకి చెందిన వారు 46 శాతంతో రెండోస్థానంలో ఉన్నారు. అంతేకాదు హైదరాబాద్‌లోని వృత్తి నిపుణులు జనరేటివ్‌ ఏఐతో జట్టు కట్టేందుకు కూడా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది.

ఏఐతో అయ్యే పనులేమిటి?
ఏఐతో చేయగల పనులకు హద్దుల్లేవని ఐటీ నిపుణులు అంటున్నారు. తమ ఉద్యోగ జీవితాన్ని మార్చేస్తుందని దాదాపు అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తాము ఏఐని ఉద్యోగాల్లో ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని 98 శాతం మంది పేర్కొనడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగానే ఉద్యోగ ప్రకటనల్లోనూ చాట్‌జీపీటీ, ఏఐ టెక్నాలజీల ప్రస్తావన ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిందని లింక్డిన్‌ చెబుతోంది.

‘జనరేటివ్‌ ఏఐ మీ ఉద్యోగ జీవితాన్ని ఎలా మెరుగు పరుస్తుంది?’అని హైదరాబాద్‌లోని వృత్తి నిపుణులను అడిగినప్పుడు కావాల్సిన సమాచారం తక్షణమే అందుబాటులోకి వస్తుంది కాబట్టి చేసే పనిని మరింత సమర్థంగా, విశ్వాసంతో చేయగలమని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఉత్పాదకత విషయంలోనూ ఏఐ తమకు సహాయకారి కాగలదని భావిస్తున్నారు. పనిలో ఎదురయ్యే ఇబ్బందులను సులువుగా అధిగమించేందుకు ఏఐని వాడాలని 83 శాతం మంది ఆలోచిస్తుండగా సహోద్యోగులను అడిగేందుకు ఇబ్బంది పడే ప్రశ్నలకు ఏఐ ద్వారా సమాధానాలు తెలుసుకుంటున్నట్లు 77 శాతం మంది చెప్పారు.

ఏఐ కోర్సులు..
- హౌ టు రీసెర్చ్‌ అండ్‌ రైట్‌ యూజింగ్‌ జనరేటివ్‌ ఏఐ టూల్స్‌ – డేవ్‌ బిర్స్‌
- వాట్‌ ఈజ్‌ జనరేటివ్‌ ఏఐ? – పినార్‌ సెహాన్‌ డెమిర్‌డాగ్‌
- జనరేటివ్‌ ఏఐ ఫర్‌ బిజినెస్‌ లీడర్స్‌ – టోమర్‌ కోహెన్‌
- నానో టిప్స్‌ ఫర్‌ యూజింగ్‌ చాట్‌జీపీటీ ఫర్‌ బిజినెస్‌ – రాచెల్‌ వుడ్స్‌
- మెషీన్‌ లెరి్నంగ్‌ విత్‌ పైథాన్‌: ఫౌండేషన్స్‌ – ఫ్రెడిక్‌ న్వాన్‌గాంగా
- గెట్‌ రెడీ ఫర్‌ జనరేటివ్‌ ఏఐ – ఆష్లీ కెన్నెడీ
- ఇంట్రడక్షన్‌ టు ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ జనరేటివ్‌ ఏఐ – రోనీ షీర్‌
- పైథాన్‌ డేటా స్ట్రక్చర్‌ అండ్‌ అల్గారిథమ్స్‌ – రాబిన్‌ ఆండ్రూస్‌
- ప్రాంప్ట్‌ ఇంజనీరింగ్‌: హౌ టు టాక్‌ టు ద ఏఐస్‌ – జేవియన్‌ అమాట్రియాన్‌
- జీపీటీ–4, ద న్యూ జీపీటీ రిలీజ్‌ అండ్‌ వాట్‌ యూ నీడ్‌ టు నో – జోనథన్‌ ఫెర్నాండెజ్‌

సాఫ్ట్‌ స్కిల్స్‌ తోడైతే..
భవిష్యత్తులో వృత్తి జీవితంలో రాణించాలంటే కేవలం ఏఐపైనే ఆధారపడటం తగదని, సాఫ్ట్‌ స్కిల్స్‌ను పెంపొందించుకోవడమూ చాలా అవసరమని లింక్డిన్‌ సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం, వ్యూహాత్మక ఆలోచనల వంటి నైపుణ్యాలు ఉన్న వారి అవసరం భవిష్యత్తులో ఎక్కువగా 

ఉంటుందన్నది హైదరాబాద్‌లోని వృత్తి నిపుణల లెక్క. రోజువారీ చేయాల్సిన, బోర్‌ కొట్టించే పనుల భారాన్ని ఏఐ టూల్స్‌ చక్కబెట్టగలవు కాబట్టి తాము ఆసక్తికలిగించే, నైపుణ్యం ఉన్న విషయాలపై ఎక్కువ సమయం వెచి్చంచవచ్చునని, ఇది వృత్తి సంతృప్తిని అందిస్తుందని వారు విశ్లేషించారు. అలాగే వృత్తికి.. జీవితానికి మధ్య సమతౌల్యత పెరిగేందుకూ ఏఐ తోడ్పడుతుందని సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది అభిప్రాయపడ్డారు.

‘‘వచ్చే ఐదేళ్లలో ఏఐ తమ ఉద్యోగాల్లో ఎన్నో సానుకూల మార్పులు తీసుకొస్తుందని హైదరాబాద్‌ వృత్తినిపుణుల్లో 86% మంది భావిస్తున్నారు. ఏఐ రాకతో తమకు సమయం ఆదా అవుతుందని, దాన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు, సృజనాత్మక, వ్యూహాత్మక పనులు చేసేందుకు వాడుకుంటామని చెబుతున్నారు’’ – నిరాజితా బెనర్జీ, లింక్డిన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement