రాకేష్(ఫైల్)
పెబ్బేరు: ఉన్న ఒక్కగానొక్క కొడుకు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆ తల్లిదండ్రులు ఆశ పడ్డారు. కానీ 16ఏళ్ల ప్రాయంలోనే కొడుకు అర్ధాంతరంగా కన్నుమూశాడు. తాజాగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడ వ్వడంతో కుటుంబం కంటికి పుట్టెడుగా శోకిస్తోంది. వివరాల్లోకి వెళ్తే... జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడుకు చెందిన చంద్రకళ, కుర్వ ఆంజనేయులు దంపతులు బతుకుదెరువు నిమిత్తం 20 ఏళ్లకిందట పెబ్బేరుకు వచ్చి స్థిరపడ్డారు.
వీరికి కొడుకు రాకేష్(16), కూతురు నందిని. ఇద్దరు పిల్లలను స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. పక్షవాతానికి గురైన తండ్రి ఆంజనేయులు కొన్ని నెలలుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. రాకేష్ ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాశాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న అతను.. జూన్ 19న తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి, బావిలోపడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కాగా గురువారం విడుదలైన పదోతరగతి ఫలితాల్లో 8.8 జీపీఏ సాధించాడు. కొడుకు పాసైనట్లుగా తెలుసు కున్న తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అతడిని గుర్తు తెచ్చుకుని కన్నీరు మున్నీరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment