శ్రీశైలం ప్రాజెక్టు ఒకగేటు తెరవడంతో సాగర్‌కు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ
గద్వాల రూరల్/దోమలపెంట: ఎగువ నుంచి భారీగా వరద పెరగడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు గేట్లను మరోసారి ఎత్తారు. గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులకు గురువారం రాత్రి 8 గంటల సమయంలో 81,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా పదిగేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 81,892 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 8.591 టీఎంసీలు, 317.990 మీటర్ల మేర నీటిని నిల్వ చేశారు.
మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాలతోపాటు సుంకేశుల నుంచి భారీగా వరద పోటెత్తింది. సుంకేశుల 1,16,062, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు, జూరాలతో కలిపి మొత్తం 1,98,204 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ప్రాజెక్టు ఒక గేటు పది అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా 27,662 క్కూసెక్కులు, ఎడమ గట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 32,237 క్యూసెక్కులు మొత్తం 91,683 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.1 అడుగులు, 210.5133 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment