సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా 10 మంది ఎమ్మెల్యేలను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కాగా తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా పిటిషన్‌లో కీలక విషయాలను వెల్లడించారు. పార్టీ మారడం రాజ్యాంగ విరుద్దం. రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికారాలు అనుభవిస్తున్నారు. పార్టీ ఫిరాయించడం అంటే రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంపై బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏప్రిల్‌లో ఒక పిటిషన్, జూలైలో ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆగస్టు 10 తీర్పు రిజర్వు చేశాం. ఇప్పటివరకు అనర్హత పిటిషన్లపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్లలో ఉపశమనం పొందేందుకు పిటిషనర్లు అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. స్పీకర్ కార్యాలయానికి రాజ్యాంగ హోదా, గౌరవం ఉంది.
అనర్హత పిటిషన్లను వెంటనే రాష్ట్ర శాసనసభ స్పీకర్ ముందు ఉంచాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. ఇరుపక్షాల వాదనలు, డాక్యుమెంట్లు, వ్యక్తిగత వాదనలకు సంబంధించి నాలుగు వారాల్లోగా షెడ్యూల్ నిర్ణయించాలి. నాలుగు వారాల్లో ఏం తేల్చకపోతే సుమోటోగా విచారణ చేపడతాం. తగిన ఆదేశాలను మేమే ఇస్తాం అని కోర్టు వ్యాఖ్యలు చేసింది.
ఇది కూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేలూ.. జర జాగ్రత్త!
Comments
Please login to add a commentAdd a comment