ఈడీ కార్యాలయం ఎదుట భర్తతో కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఎమ్మెల్సీ కవితను ఈడీ సోమవారం రాత్రి వరకు విచారించింది. ఈ నేపథ్యంలో సాయంత్రం నుంచి నెలకొన్న ఉత్కంఠకు.. పది గంటలకు పైగా సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి 9.15 గంటల సమయంలో కవిత బయటకు రావడంతో తెరపడింది.
ఆమె కోసం బయట వేచి చూస్తున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. విక్టరీ సంకేతం చూపిస్తూ కారెక్కిన కవిత అక్కణ్ణుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. సోదరుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం విచారణ జరిగిన తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.
అరగంట ముందే ఈడీ ఆఫీసుకు..
ఆదివారం రాత్రికే ఢిల్లీ చేరుకున్న కవిత సోమవారం అరగంట ముందే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, న్యాయవాదులతో భేటీ అయ్యారు. ఈడీ విచారణను ఎదుర్కొనే తీరుపై చర్చించారు.
అనంతరం తుగ్లక్ రోడ్‌లోని నివాసం నుంచి బయటకు వచ్చిన కవిత, భర్త అనిల్‌తో కలిసి ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. 10.30 గంటలకు అక్కడికి చేరుకున్న తర్వాత ఓసారి భర్తను హత్తుకొని లోనికివెళ్లారు.
ఉదయం మొదలుకుని రాత్రి వరకు..
కవిత విచారణకు హాజరైంది మొదలు..బయటకు వచ్చేంతవరకు పది గంటలకు పైగా ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు ఈడీ కార్యాలయం లోపల విచారణ, మరోవైపు ఉదయం నుంచి వర్షంలోనూ బయటే బీఆర్‌ఎస్ నేతల ఎదురుచూపులు, ఇంకోవైపు కేంద్ర బలగాల ఆంక్షలతో రోజంతా ఎడతెగని ఉత్కంఠ కొనసాగింది.
సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో బీఆర్‌ఎస్‌కు చెందిన న్యాయవాదుల బృందం ఈడీ ఆఫీసుకు చేరుకోవడంతో టెన్షన్ పెరిగింది. న్యాయవాదులు వెళ్లిన కొద్ది సేపటికే.. ఆరు గంటల సమయంలో ముగ్గురు సభ్యుల మహిళా వైద్యుల బృందం లోపలికి వెళ్లింది. కవితకు వైద్య పరీక్షల నిమిత్తమే వారు లోనికి వెళ్లారన్న సమాచారంతో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది.
మరో పది నిమిషాల వ్యవధిలోనే ఢిల్లీ పోలీసులకు చెందిన ఎస్కార్ట్ వాహనం కూడా వెళ్లింది. అయితే 6.30 గంటల సమయంలో వైద్యుల బృందం బయటకు వెళ్లిపోయింది. ఈడీ విచారణలో ఉన్న ఇతరుల వైద్య పరీక్షలకే వారు వచ్చారని తెలిసింది.
నవ్వుతూ బయటకు..
చివరకు 9.15 గంటల సమయంలో నవ్వుతూ బయటకు వచ్చిన కవిత వాహనం ఎక్కేముందు విక్టరీ సంకేతం చూపించారు. అందరికీ అభివాదం చేస్తూ తన నివాసానికి వెళ్లిపోయారు. ఈ సమయంలో కారులో కవితతో పాటు ఆమె భర్త అనిల్, న్యాయవాది సోమ భరత్ ఉన్నారు. కవిత ఇంటికి చేరగానే కార్యకర్తలు గుమ్మడికాయతో దిష్టి తీశారు.
కవిత విచారణను దృష్టిలో పెట్టుకొని తుగ్లక్ రోడ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించగా, ఈడీ కార్యాలయానికి ఇరువైపులా ఢిల్లీ పోలీసులు బారికేడ్లు పెట్టి ఐడీ కార్డులు చూపిన వారినే కార్యాలయ ప్రాంతంలోకి అనుమతించారు. భారీగా పోలీసులను మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment