కల్లాల వద్ద రైతులతో కలిసి రాత్రి బస
దీక్షకు మద్దతివ్వాలని రైతు, ప్రజా, ఉద్యమ సంఘాలకు ఎంపీ సంజయ్ పిలుపు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రైతుల కోసం మరోమారు జంగ్‌సైరన్ మోగించారు. అకా లవర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం అందించలేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో సాగునీరందక పంటలు ఎండిపోతు న్నా పట్టించుకోలేదని పంటల బీమాపథకాన్ని అమలు చేయలేదని, ఎన్నికల్లో రైతులకిచ్చిన ఏ ఒక్కహామీ కూడా అమలు చేయలేదని ఆరోపిస్తూ ‘రైతుదీక్ష’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు.
మంగళవా రం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద బండి సంజయ్ ఆధ్వర్యంలో ‘రైతు దీక్ష’ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో సంజయ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు. వడ్ల కల్లాల వద్ద రైతులు పడుతున్న బాధలను, తాలు, తేమ, తరుగు పేరుతో రైతులు ఏ విధంగా నష్టపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవసరమైతే వడ్లకల్లాల వద్ద బండి సంజయ్ బస చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... రైతుల పక్షాన మంగళవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టే ‘దీక్ష’కు అన్ని వర్గాలు మద్దతివ్వాలని కోరారు. కాగా, సోమవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు ఆయన వినతిపత్రాలు అందించనున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే
’’పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించాలి. ఇతర పంటలకు సైతం బోనస్ అందించాలి. తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతో పాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పంటలకు అనుసంధానం చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయాలి.’’
Comments
Please login to add a commentAdd a comment