సాక్షి, కరీంనగర్: ‘నా కోడిని చంపేశారు.. చర్య తీసుకోండంటూ’.. ఒక వ్యక్తి పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు. కరీంనగర్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంగర్ నాఖాచౌరస్తా సమీపంలోని ముబ్బ షీర్ (30).. అదే ప్రాంతానికి చెందిన సాబిర్ (60) బుధవారం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మానకొండూరు మండలం అన్నారం నుంచి టర్కీ కోడిని కొనుగోలు చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానని.. బుధవారం పొరుగింటి సాబిర్ కట్టెతో కొట్టి చంపాడని ముబ్బ షీర్ బోరున విలపిస్తూ సీఐ సీఐ దామోదర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు.
తానేమీ చేయలేదని సాబిర్ తొలుత బుకాయించాడు. కానీ సీఐ గట్టిగా అడిగే సరికి.. కట్టెతో మెల్లిగా కొట్టానని.. కొద్దిదూరం బాగానే పరుగెత్తిన కోడి.. తర్వాత కుప్పకూలిందని వివరించాడు. ఇంతలో వృద్ధుడి కొడుకు వచ్చి తన తండ్రివల్ల తప్పు జరిగిందని.. చనిపోయిన కోడికి పరిహారం ఇస్తానని చెప్పాడు. కోడి ఏడుకిలోల బరువు ఉంటుందని.. రూ.7 వేల పరిహారం ఇవ్వాలని బాధితుడు ముబ్బ షీర్ పట్టుబట్టాడు. చివరికి రూ.వెయ్యి పరిహారం ఇచ్చేందుకు రాజీ కుదరడంతో పంచాయితీ ముగిసింది. పోలీసు స్టేషన్‌కు వచ్చిన అర్జీదారులు ... కోడి పంచాయితీ తెలిసి నవ్వుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment