Turkey Hen
-
నా టర్కీ కోడిని చంపేశారు.. పోలీసు స్టేషన్‌కు కోడి పంచాయితీ
సాక్షి, కరీంనగర్: ‘నా కోడిని చంపేశారు.. చర్య తీసుకోండంటూ’.. ఒక వ్యక్తి పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు. కరీంనగర్లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంగర్ నాఖాచౌరస్తా సమీపంలోని ముబ్బ షీర్ (30).. అదే ప్రాంతానికి చెందిన సాబిర్ (60) బుధవారం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. మానకొండూరు మండలం అన్నారం నుంచి టర్కీ కోడిని కొనుగోలు చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నానని.. బుధవారం పొరుగింటి సాబిర్ కట్టెతో కొట్టి చంపాడని ముబ్బ షీర్ బోరున విలపిస్తూ సీఐ సీఐ దామోదర్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. తానేమీ చేయలేదని సాబిర్ తొలుత బుకాయించాడు. కానీ సీఐ గట్టిగా అడిగే సరికి.. కట్టెతో మెల్లిగా కొట్టానని.. కొద్దిదూరం బాగానే పరుగెత్తిన కోడి.. తర్వాత కుప్పకూలిందని వివరించాడు. ఇంతలో వృద్ధుడి కొడుకు వచ్చి తన తండ్రివల్ల తప్పు జరిగిందని.. చనిపోయిన కోడికి పరిహారం ఇస్తానని చెప్పాడు. కోడి ఏడుకిలోల బరువు ఉంటుందని.. రూ.7 వేల పరిహారం ఇవ్వాలని బాధితుడు ముబ్బ షీర్ పట్టుబట్టాడు. చివరికి రూ.వెయ్యి పరిహారం ఇచ్చేందుకు రాజీ కుదరడంతో పంచాయితీ ముగిసింది. పోలీసు స్టేషన్‌కు వచ్చిన అర్జీదారులు ... కోడి పంచాయితీ తెలిసి నవ్వుకున్నారు. -
నెమలి ఆర్డర్ చేస్తే టర్కీ కోడి వచ్చింది..!
సాధారణంగా పెళ్లి వేడుకల్లో వివాహం చేసుకునే జంట అందమైన, రంగురంగుల ఆకృతిలో ఉండే కేకులను కట్ చేసి తమ అనందాన్ని రెట్టింపు చేసుకుంటారు. ఈ క్రమంలోనే జార్జియాకు చెందిన రెనా డేవిస్ అనే పెళ్లి కూతురు తన వివాహ వేడుకకు నెమలి ఆకారంలో ఉన్న కేకును 300 డాలర్లు ఖర్చు చేసి మరి ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. కేకు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన తాను కేకు వచ్చాక దాన్ని చూసి షాక్‌కు గురైంది. ఆ కేకు పూర్తిగా తాను పంపించిన నెమలి ఆకారానికి భిన్నంగా ఉండటంతో సదరు పెళ్లి కూతురు అగ్గి మీద గుగ్గిలంలా మారింది. తాను వృత్తాకారంలో ఉండే పదార్థం మీద కూర్చున్న నెమలి.. తన పింఛము కన్నులు నీలం, ఆకుపచ్చ రంగులతో చిన్న బుట్ట కేకులుగా ఉండే కేకును ఆర్డర్ చేసింది. అయితే అందమైన కేకు కోసం వేచి చూసిన రెనాకు చేదు అనుభవం ఎదురైంది. వింత ఆకారంలో తయారు చేయబడిన కేకును రేనా వదిన అన్నెట్ హిల్ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ‘కేకును తయారు చేసే పదార్థం తెల్లగా లేదు. కుష్టి రోగం వచ్చిన నెమలి లేదా ఓ టర్కీ కోడిలా కేకు మాకు దర్శనమిచ్చిందని వ్యంగ్యంగా తెలిపారు. కనీసం ఆ పక్షికి తోక కూడా సరిగా లేదని మండిపడ్డారు. ఎటునుంచి చూసినా ఆ పక్షి ఆకారం తాము ఆర్డర్ చేసిన నెమలి ఆకృతిలో మాత్రము లేదని’ హిల్ పేర్కొన్నారు. ఇంత వికృతంగా తయారుచేయబడిన ఈ కేకు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చివరగా సంబంధిత బేకరీ సిబ్బంది కేకు డబ్బులను తిరిగి ఇచ్చినట్టు హిల్ తెలిపారు. -
ఆకట్టుకొంటున్న టర్కీ కోళ్లు
మిరుదొడ్డి(దుబ్బాక) : స్వదేశంలో విదేశీకి చెందిన టర్కీ కోడి సందడి చేస్తోంది. ఇక్కడి గ్రామీణ కోళ్లతో కలివిడిగా తిరుగుతూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఊళ్లల్లో ఉండే కోళ్ల కంటే కాస్త భిన్నంగా ఎత్తు పొడవు, బరువులో తేడా ఉండటంతో చూపరులకు ఆసక్తిని కలిగిస్తోంది.. సుమారు 8 కిలోల నుంచి 12 కిలోల బరువు తూగే ఈ టర్కీ కోళ్లు ఒక్కో దాని విలువ సుమారు రూ. 1800ల నుంచి రూ. 3 వేల ధర పలుకుతుందని వాటి సంరక్షకులు తెలుపుతున్నారు. మండల పరిధిలోని మిరుదొడ్డి అందె శివారులో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో టర్కీ కోడిని సంరక్షిస్తున్నారు. ఊరి కోళ్లతో కలివిడిగా తిరుగుతూ సందడి చేస్తున్న టర్కీ కోడిని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
అనుకోని అతిథి!
అటెన్షన్ ప్లీజ్! స్పీకర్స్‌లో మృదువుగా ఎయిర్‌హోస్టెస్ వాయిస్! ప్రయాణికులు ఒక్కొక్కరుగా విమానం ఎక్కుతున్నారు. లోపలికి అడుగు పెట్టగానే షాక్! ఎదురుగా సీట్లో దర్జాగా ఆశీనుడై ఉన్నాడో అనుకోని అతిథి! ఉలుకు... బెరుకు లేదు! హుందాగా కూర్చుని... వచ్చినవారందరినీ ఓ లుక్ వేస్తున్నాడు. అలాగని ఏ ఫుట్‌బాల్ స్టారో కాదు. హాలీవుడ్ సూపర్స్టారూ కాదు. ‘రెక్కలు తొడిగి’ మనం గగనంలో విహరిస్తుంటే... ‘రెక్కలు ముడిచి’ తన యజమానితో కలసి విమానంలో ఎగిరేందుకు సిద్ధంగా ఉన్నాడా అతిథి. ఇంతకీ ఎవరనేగా..! టర్కీ కోడి! సన్నివేశం చూసి ఓ క్షణంపాటు నిశ్చేష్టు లైనా... ఆ వెంటనే తేరుకుని అబ్బురంగా సెల్ కెమెరాల్లో ‘క్లిక్’మనిపించారు ప్రయాణికులు! అలా తీసిందే ఈ చిత్రం. ఓ ఫ్లయిట్ అటెండెంట్ మిత్రుడు సామాజిక మాధ్యమంలో దీన్ని షేర్ చేస్తే వేల కొద్దీ లైక్‌లు కొట్టేస్తోంది. ‘షేరింగ్’లతో నెట్టింట పాకేస్తోంది. ‘భావోద్వేగ మద్దతునిచ్చే జంతువుల’ కోటాలో ఈ కోడి విమానం ఎక్కేసింది. విమాన ప్రయాణమంటే ఉండే ఉత్సుకత, భయం దరిచేరకుండా ఉండేందుకు అమెరికాలోని కొన్ని ఎయిర్‌లైన్స్ శునకం తదితర తమ పెంపుడు జంతువులను వెంట తెచ్చుకోవడానికి ప్రయాణికులకు అనుమతినిస్తున్నాయి. ఇందుకు గాను కొన్ని అదనపు చార్జి వసూలు చేస్తుండగా, కొన్ని ఉచితంగా ఈ సేవలందిస్తున్నాయి. అన్నట్టు... యూకేలో కూడా ఈ తరహా వెసులుబాటు ఉంది.