అనుకోని అతిథి!
అటెన్షన్ ప్లీజ్! స్పీకర్స్‌లో మృదువుగా ఎయిర్‌హోస్టెస్ వాయిస్! ప్రయాణికులు ఒక్కొక్కరుగా విమానం ఎక్కుతున్నారు. లోపలికి అడుగు పెట్టగానే షాక్! ఎదురుగా సీట్లో దర్జాగా ఆశీనుడై ఉన్నాడో అనుకోని అతిథి! ఉలుకు... బెరుకు లేదు! హుందాగా కూర్చుని... వచ్చినవారందరినీ ఓ లుక్ వేస్తున్నాడు. అలాగని ఏ ఫుట్‌బాల్ స్టారో కాదు. హాలీవుడ్ సూపర్‌స్టారూ కాదు. ‘రెక్కలు తొడిగి’ మనం గగనంలో విహరిస్తుంటే... ‘రెక్కలు ముడిచి’ తన యజమానితో కలసి విమానంలో ఎగిరేందుకు సిద్ధంగా ఉన్నాడా అతిథి. ఇంతకీ ఎవరనేగా..! టర్కీ కోడి! సన్నివేశం చూసి ఓ క్షణంపాటు నిశ్చేష్టు లైనా... ఆ వెంటనే తేరుకుని అబ్బురంగా సెల్ కెమెరాల్లో ‘క్లిక్’మనిపించారు ప్రయాణికులు!
అలా తీసిందే ఈ చిత్రం. ఓ ఫ్లయిట్ అటెండెంట్ మిత్రుడు సామాజిక మాధ్యమంలో దీన్ని షేర్ చేస్తే వేల కొద్దీ లైక్‌లు కొట్టేస్తోంది. ‘షేరింగ్’లతో నెట్టింట పాకేస్తోంది. ‘భావోద్వేగ మద్దతునిచ్చే జంతువుల’ కోటాలో ఈ కోడి విమానం ఎక్కేసింది. విమాన ప్రయాణమంటే ఉండే ఉత్సుకత, భయం దరిచేరకుండా ఉండేందుకు అమెరికాలోని కొన్ని ఎయిర్‌లైన్స్ శునకం తదితర తమ పెంపుడు జంతువులను వెంట తెచ్చుకోవడానికి ప్రయాణికులకు అనుమతినిస్తున్నాయి. ఇందుకు గాను కొన్ని అదనపు చార్జి వసూలు చేస్తుండగా, కొన్ని ఉచితంగా ఈ సేవలందిస్తున్నాయి. అన్నట్టు... యూకేలో కూడా ఈ తరహా వెసులుబాటు ఉంది.