కరీంనగర్‌లోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రజలు
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరల పెంపుతో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు విలువలు జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్నాయి. తద్వారా ప్రజలపై భారం పడుతుండగా.. రిజిస్ట్రేషన్ శాఖకు కాసులపంట పండనుంది. ఈ మేరకు కరీంనగర్ జిల్లాలోని 13 రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఉన్న పట్టణాలు, పల్లెల్లో మార్కెట్ ధరలు పెంచుతున్నారు. గత జూలైలోనే పెంచగా.. ఇప్పుడు మళ్ళీ వాటికి వ్యవసాయ భూముల్లో సుమారుగా 50 శాతం వరకు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్‌లలో 35 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారు. అన్ని గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాల వారీగా మార్కెట్ ధరను పెంచగా కమిటీల సంతకాలు కూడా పూర్తయినట్లు సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది.
5 నెలల్లోనే మరోసారి పెంపు...
భూముల విలువ ప్రకారం భూ లావాదేవీల్లో రిజిస్ట్రేషన్ శాఖ స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా సుమారు తొమ్మిదేళ్ల కిత్రం పెంచగా గత జూలైలో మార్కెట్ విలువను సవరించారు. తొమ్మిదేళ్ల నుండి పెంచలేదు కాబట్టి పెంచారని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పాత విలువలను బట్టే ఏళ్లుగా రిజిస్ట్రేషన్‌లు కొనసాగాయి. తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెంచుకోవడం కోసం ఎనిమిదేళ్ల తర్వాత గత జూలైలో పెంచింది. ఏడాది కూడా కాకుండానే పెంచిన ధరలను మళ్లీ 6 నెలలకే పెంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: సిటీజనులకు గుడ్‌న్యూస్.. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు.. ఇలా బుక్ చేసుకోండి
50 శాతం వ్యవసాయ భూములు.. 35 శాతం ప్లాట్లు
కొత్తగా ప్రభుత్వం మార్కెట్ ధరను పెంచాలని తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయభూములు సుమారు 50 శాతం వరకు పెరగనున్నాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగా సైదాపూర్‌లో 2.25 లక్షల నుండి 3.37 లక్షలు పెరుగుతుండగా జమ్మికుంటలోని వ్యవసాయ భూములు మార్కెట్ విలువ ఎకరానికి 2.22 కోట్ల నుండి 3.33 కోట్ల వరకు పెరుగుతోంది. కరీంనగర్ పట్టణానికి ఆనుకొని ఉన్న వ్యవసాయ భూములు సైతం ఇదే స్థాయిలో పెరగనున్నట్లు సమాచారం. కరీంనగర్‌లో గరిష్టంగా గజానికి 32,500 ఉండగా ఇప్పుడు దానిని 37,400 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అపార్ట్‌మెంట్ల విషయంలో చదరపు అడుగుకు 2,200 ఉండగా ఇప్పుడు ఆ విలువను 3,300లకు పెంచనున్నారు. ఇదే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా) వేములవాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ)లో కూడా పెంచారు. కరీంనగర్‌లోని ప్రధాన పట్టణాలైన జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, గంగాధరల్లో మార్కెట్ వ్యాల్యూ పెరుగుతున్నాయి. దీనివల్ల సుమారు 20 కోట్ల పైగానే రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రజల నెత్తిన మాత్రం భారం పడనుంది.
చదవండి: సాధారణ సబ్బు రూ.20 నుంచి 60 ఉంటే.. ఈ సబ్బు రూ.96 అట.. కారణం ఏంటో తెలుసా?
మరికొంత సమయమివ్వాలి...
ప్రభుత్వం ఫిబ్రవరి 1 తేదీ నుండి కొత్త ధరలు అమల్లోకి తీసుకువస్తుందని తెలియడంతో కరీంనగర్‌తోపాటు 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వారం రోజులుగా కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలైన కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాలతోపాటు రామగుండం, హుజూరా బాద్, కోరుట్ల, మెట్‌పల్లి వంటి పట్టణ ప్రాంతాల్లో బారులు తీరుతున్నారు. అదేవిధంగా మీ సేవా కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు మీసేవా, రిజిస్ట్రేషన్ సర్వర్‌లు బిజీ వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో నెల గడువు ఇచ్చిన తర్వాత పెంచిన మార్కెట్ విలువను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment