సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం మేయర్ సునీల్‌రావు అధ్యక్షతన జరిగిన నగరపాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశం రసాభాసగా జరిగింది. అధికార పార్టీ కార్పొరేటర్లే మంచినీటి సరఫరాపై నిరసన తెలిపారు. మాజీ మేయర్ రవీందర్‌సింగ్, మేయర్ మధ్య నీటి మోటార్ల విషయంలో తీవ్ర వాగ్వాదం జరిగింది. అలాగే పాలకవర్గ సభ్యులు ఆయా డివిజన్లలో సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా.. అన్నింటినీ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మేయర్ పేర్కొన్నారు.
సర్వసభ్య సమావేశంలో నగర అభివృద్ధికి సంబందించి రూపొందించిన 15 ఎజెండా అంశాలపై పాలకవర్గ సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. బీజేపీ కార్పొరేటర్ జితేందర్ మాట్లాడుతూ, నల్లా ఆన్‌లైన్ సమస్యలు పరిష్కరించాలని, ఇంటినంబర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కోరారు. కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, మంచినీటి పైప్ లైన్ పనులు వేగంగా పూర్తి చేసి తాగునీరందించాలన్నారు. వేసవికాలంలో కావడంతో మంచినీటి సమస్యను కార్పొరేటర్లు సభా దృష్టికి తీసుకువచ్చారు.
సమస్యలు పరిష్కరిస్తాం: మేయర్
దేశంలోనే ప్రతిరోజూ నిరంతరంగా మంచినీటి సరఫరా చేస్తున్న ఏకైక నగరం కరీంనగర్ అని మేయర్ సునీల్‌రావు అన్నారు. కొద్దిరోజులుగా సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తిందని, సమస్య పరిష్కారానికి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ మిడ్‌మానేరు నుంచి లోయర్ మానేరు డ్యాంకు నీటి విడుదల చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. మిడ్ మానేరు గేట్లకు చిన్న మరమ్మతు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నీరు విడుదల చేయక నగరంలో సమస్య తలెత్తిందని వివరించారు. వేసవిలో ప్రజలకు మంచినీరు ప్రధానం కాబట్టి నీటిసరఫరాలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్, కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ కమిషనర్ త్రియంభకేశ్వర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
– నగరంలో మంచినీటి సరఫరా విషయంలో ప్రస్తుతం ఉన్న మోటార్లు పని చేస్తున్నా.. అనవసరంగా కొత్తవి కొంటున్నారు. కమీషన్ల కోసమే ఇదంతా చేస్తున్నారు.
– రవీందర్‌సింగ్, మాజీ మేయర్
మీ పాలనలో మంచినీటి సరఫరాకు నాసిరకం మోటార్లు కొనుగోలు చేశారు. అవి పనిచేయకపోవడంతో ఇప్పుడు కొత్త మోటార్లు కొంటున్నాం.
– సునీల్‌రావు, మేయర్
Comments
Please login to add a commentAdd a comment