కార్తీక దీపాలు వెలిగిస్తున్న మహిళలు
సాక్షి, వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీక శోభ సంతరించుకుంది. నెల రోజులపాటు స్వామివారు భక్తుల విశేష పూజలందుకుంటారు. ఆదివారం అమావాస్య అయినప్పటికీ రాజన్నను దర్శించుకునేందుకు 10 వేల మందికి పైగా భక్తులు వచ్చారు. కార్తీకదీపాలు వెలిగించి, మొక్కు తీర్చుకున్నారు. కోవిడ్–19 నిబంధనల మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న సాయంత్రం 6.30 గంటలకు విఠలేశ్వర స్వామికి శ్రీకృష్ణతులసీ కల్యాణం జరిపిస్తున్నట్లు స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ తెలిపారు. 28న వైకుంఠ చతుర్ధశిని పురస్కరించుకుని శ్రీఅనంతపద్మనాభ స్వామి వారికి 12 మంది రుత్విజులతో మహాభిషేకం జరపనున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు రాత్రి 7.30 గంటలకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి మహాపూజ, పొన్నసేవపై స్వామివార్లకు ఊరేగింపు, రాత్రి 8 గంటలకు జ్వాలాతోరణం, 10.30 గంటలకు స్వామివారి నిషిపూజ అనంతరం మహాపూజ ఉంటుందన్నారు.
వేములవాడలో దీపావళి వేడుకలు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దీపావళి వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. అర్చకులు ఉదయం స్వామివారి సన్నిధిలో నిత్యపూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు గంటన్నరపాటు కల్యాణ మండపంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో ధనలక్ష్మీ పూజ ఘనంగా జరిపించారు. అనంతరం శ్రీపార్వతీరాజరాజేశ్వర స్వామి, శ్రీఅనంతపద్మనాభస్వామి వార్ల ఉత్సవమూర్తులను గజ వాహనంపై ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.
పూజలు చేస్తున్న అర్చకులు
కార్తీకం.. సర్వపాప హరణం!
కరీంనగర్ కల్చరల్/విద్యానగర్(కరీంనగర్): కార్తీకమాసం శివుడికి ప్రీతికర మాసం.. అందుకే దీన్ని పవిత్రమాసంగా భావిస్తారు.. సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది.. ఈ మాసంలో దీపారాధన చేయ డం ద్వారా సర్వపాపాలు హరించుకుపోతాయని ప్రజల నమ్మకం. తెల్లవారుజామునే నిద్రలేవడం.. కతికా నక్షత్రం అస్తమించేలోగా స్నానమాచరించడం, భోళాశంకురుడికి నిత్యం రుద్రాభిషేకం చేయడం, మెడలో రుద్రాక్షలు, తులసీ పూసల్ని ధరించడం, ఒక్కపూట మాత్రమే భోజనం చేయడం వంటి సంప్రదాయాలను ఆచరిస్తారు. కతికా నక్షత్రానికి అధిపతి అగ్ని, అగ్నికి మారుపేరు రుద్రుడు. ప్రతీ ఆలయంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి. పుత్రులు లేని వారికి పుత్రులు, దరిద్రులకు ధనం, పురుషులకు గహస్తులు, భోగమోక్షాలు లభించడంతో పాటు వానప్రస్థ ఆశ్రమాలలో ఉండే వారికి జ్ఞాన వైరాగ్యత, స్త్రీలకు మోక్షం, మహాపుణ్యం కలుగుతాయి. కార్తీకమాసం నేపథ్యంలో దానాలు, పూజలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
శైవక్షేత్రాల్లో అర్చనలు, అభిషేకాలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రాంతాల్లోని శివక్షేత్రాల్లో అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేక ఉంది. ఈ రోజు దీపదానాలు చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం.
దానం.. శుభప్రదం
కార్తీక మాసంలో ఉసిరికాయలు దానం చేయడం ద్వారా సంతానం లేని స్త్రీలకు సంతానం కలుగుతుంది. శివపూజ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ జరుగుతుంది. గుమ్మడి కాయ దానం చేయడం వల్ల యమదూతలు దూరంగా ఉంటారు. ఆవు నెయ్యితో వత్తులు వెలిగించి, ఆకుడొప్పల్లో ఉంచి, నీటి ప్రవాహంలో వదలడం, కుమార్తెలకు వివాహాలు, కుటుంబ సభ్యులతో వనభోజనాలు, ఉసిరి, తులసి చెట్లకు పూజలు, విష్ణుమూర్తి కల్యాణం, నాగుపాములకు పూజలు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి పూజలు, దీపారాధన చేయడం మహా మహిమోపితమైనది. ఇంటి ఎదుట ముగ్గులు పెట్టి, తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి గౌరీ పూజలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది. ధాత్రి అంటే ఉసిరి. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. లక్ష బిల్వార్చనలు, అభిషేకాలు, కాగడ హారతులు, కార్తీక స్నానాలు, మారేడు పత్రాలతో ఈశ్వరుడిని ఆరా ధిస్తే శుభాలు కలుగుతాయని వేదపండితులు చెబుతున్నారు.
దీపం.. మోక్ష మార్గం
దీపంలో ప్రమిద, వత్తి, నూనె, అగ్ని, వెలుగు.. వీటిలో దేనికదే ప్రత్యేకం. ప్రమిద మనసుకు, వత్తి దైవ స్మరణకై ఆసక్తి, నూనె జ్ఞానానికి, అగ్ని అజ్ఞానాన్ని తొలగించే నిప్పురవ్వకు, వెలుగు మనుషుల్లోని చెడు స్వభావాలను తొలగించి, మోక్ష మార్గానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా మహిళలు దేవాలయాల్లో దీపాలను సమర్పిస్తారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, దాస్యం, వందనం, పాద సేవనం, సఖ్యం, ఆత్మ నివేదనం అనే తొమ్మిది భావనలతో పూజలు చేస్తారు. విష్ణు కథాశ్రవణంతో పరీక్షిత్తుడు, కీర్తనతో వ్యాసుని కుమారుడు శుఖుడు, నారదుడు, స్మరణతో ప్రహ్లాదుడు, అర్చనతో పథు చక్రవర్తి, దాస్యంతో హనుమంతుడు, గరుత్మంతుడు, వందనంతో అక్రూరుడు, పాదసేవతో లక్ష్మి, భార్గవి, సఖ్యంతో అర్జునుడు, ఆత్మనివేదనంతో బలి చక్రవర్తి పుణ్యలోకాలను చేరుకున్నారని వేద శాస్త్రాలు ప్రవచిస్తున్నాయి. ఈ కారణంగానే తొమ్మిది రకాల భక్తి భావనలతో పౌర్ణమి రోజు దీప ప్రదానంతో పుణ్యలోకాలను అందుకునేందుకు ప్రయత్నిస్తారు. మని షి పతనానికి హేతువులైన అరిష«ఢ్వర్గాలను జయించేందుకు గోధుమ పిండితో ఆరు దీపపు ప్రమిదలను చేసి, నెయ్యితో వెలిగిస్తారు. సకల శాంతి, సౌభాగ్యాల కోసం ధాత్రి నారాయణ, తులసీ కల్యాణం జరుపుతారు.
కార్తీక మాసోత్సవం..
కీసర: ప్రఖ్యాత శైవ క్షేత్రమైన కీసరగుట్టలో సోమవారం నుంచి వచ్చేనెల 14వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. దాదాపు నెల రోజుల పాటు కీసరగుట్టలో కొనసాగనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలకు నగర నలుమూలల నుంచి కీసరగుట్ట శ్రీభవానీరామలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ తటాకం శ్రీనివాస్‌శర్మ, ఈఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు. మొదటిరోజు సోమవారం ఆలయంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ఆకాశదీపోత్సవంతో పూజలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో దేవాదాయశాఖ ఆదేశానుసారం గుట్టలో ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో గర్భాలయ అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వత్రాలు, అన్నదానం తదితర వాటిని రద్దు చేశామని వారు వివరించారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment