రైతాంగ సమస్యలపై పోరాటానికి కార్యాచరణ
సభలు, సమావేశాలు నిర్వహించే యోచన
ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎర్రవల్లి నివాసానికి పరిమితమైన బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టేలా కార్యాచరణకు పదును పెడుతున్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రాష్ట్రంలో పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
ఈ దిశగా ఇప్పటికే కొందరు పార్టీ ముఖ్యనేతలతో చర్చించి ప్రజల్లోకి వెళ్లాల్సిన తీరుపై ప్రాథమికంగా ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదే అంశంపై మరోమారు పార్టీ నేతలతో మరింత లోతుగా చర్చించి ఒకట్రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టేందుకు కేసీఆర్ ప్రత్యక్షంగా జనంలోకి వెళ్లాలని పార్టీ నేతలు సూచిస్తున్నట్లు తెలిసింది.
రుణమాఫీ, రైతు బంధు వైఫల్యంపై..
రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీరు, విద్యుత్ కష్టాలతోపాటు రుణమాఫీ జరగకపోవడం, రైతుబంధు ఇవ్వకపోవడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతు సంక్షేమం కేంద్రంగా అమలు చేసిన కార్యక్రమాలను వివరించడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు.
రుణమాఫీ, రైతు భరోసా అంటూ ఎన్నికల హామీలను ఉల్లంఘిస్తున్న వైనాన్ని కేసీఆర్ ఎండగట్టనున్నారు. దీని కోసం లోక్‌సభ ఎన్నికల ప్రచారం తరహాలో బస్సు యాత్ర పెట్టాలా లేక భారీ సభలు నిర్వహించాలా అనే కోణంలో పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ కేడర్, రైతులతో సభలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ కసరత్తు జరుగుతోంది.
అమెరికా పర్యటనకు కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బుధవారం రాత్రి అమెరికా పర్యటనకు వెళ్లారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి సోదరి కవితతోపాటు హైదరాబాద్‌కు చేరుకున్న కేటీఆర్ కొద్ది గంటల వ్యవధిలోనే అమెరికాకు వెళ్లారు. తన కుమారుడు హిమాన్షుకు సంబంధించిన విద్యాపరమైన విషయాల కోసం కేటీఆర్ అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. సెప్టెంబర్ రెండో వారంలో కేటీఆర్ తిరిగి హైదరాబాద్‌కు వస్తారని సమాచారం. ఇదిలాఉంటే ‘తండ్రి బాధ్యతల్లో అమెరికాకు వెళ్తున్నా’ అనే అర్థం వచ్చేలా కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్‌పెట్టారు.
ఆడబిడ్డకు ఆత్మీయ స్వాగతం
ఎర్రవల్లిలోని ఫామ్‌హస్‌కి చేరుకున్న కవిత
ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్
మర్కూక్/గజ్వేల్/సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై విడుదలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఫామ్‌హúస్‌లో ఆత్మీయ స్వాగతం లభించింది. మూడు రోజుల క్రితం బెయిల్‌పై విడుదలై హైదరాబాద్‌కు చేరుకున్న కవిత గురువారం బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి భర్త అనిల్ కుమార్, కుమారుడితో కలిసి ఎర్రవల్లికి వెళ్లారు. ఎర్రవల్లిలోని నివాసానికి చేరుకున్న కవితను ఆమె తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆప్యాయంగా హత్తుకున్నారు.
కేసీఆర్ పాదాలకు నమస్కరించి తండ్రి చేతిని కవిత ఆప్యాయంగా ముద్దాడారు. కేసీఆర్ పాదాలకు కవిత నమస్కరిస్తున్న సమయంలో ఎర్రవల్లి నివాసంలో ఉది్వగ్న వాతావరణం కనిపించింది. పలువురు మహిళలు కవితకు దిష్టితీసి మంగళహారతులతో స్వాగతం పలికారు.
అప్పటికే ఫామ్‌హౌస్‌లో ఉన్న ఎంపీ జోగినపల్లి సంతోష్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మాజీ టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కూడా కవితకు స్వాగతం పలికారు. కవిత రెండు గంటలకుపైగా ఫామ్‌హౌస్‌లో గడిపి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment