సాక్షి, హైదరాబాద్: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం ‘ఐ ప్యాక్’తో కలిసి పనిచేసేందుకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆసక్తి చూపుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. విశ్వసనీయ సమాచారం మేరకు.. కొంతకాలంగా వారితో సంప్రదింపులు జరుపుతున్న గులాబీ దళం అధినేత, బుధవారం ప్రగతిభవన్‌లో ఐ ప్యాక్‌కు చెందిన కీలక బృం దంతో సమావేశమయ్యారు.
ఐ ప్యాక్ సర్వే బృం దంగా చెబుతున్న వారితో జరిగిన భేటీలో.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. కాగా రాష్ట్రంలోని వివిధ వర్గాల స్పం దన వివిధ కోణాల్లో తెలుసుకునేందుకు కేసీఆర్ ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని సర్వేల ద్వారా సేకరించడంపై చర్చించినట్లు సమాచారం.
ఏడేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న అంశాలు, పార్టీ యంత్రాంగం పనితీరు వంటి వాటిపై ఐ ప్యాక్ ద్వారా సర్వే చేయించాలని టీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నట్లు తెలిసింది. ఐ ప్యాక్ నుంచి ప్రస్తుతానికి సర్వేలకు సంబంధించిన సేవలు మాత్రమే తీసుకోవాలని, భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని విస్తృత సేవలు పొందాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment