
గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా 11 అడుగులకే పరిమితమైన మహాగణపతి విగ్రహ ఎత్తును ఈసారి 40 అడుగులకు పెంచారు.
శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు చకచకా నడుస్తున్నాయి. ఈ నెల 10న వినాయక చవితికి నాలుగైదు రోజుల ముందే పనులు పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా 11 అడుగులకే పరిమితమైన మహాగణపతి విగ్రహ ఎత్తును ఈసారి 40 అడుగులకు పెంచారు. దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠల శర్మ సూచన మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నుంచి ప్రజలను కాపాడేందుకు శివుడి రుద్ర అవతారమైన పంచముఖ రుద్ర మహాగణపతిగా నామకరణం చేశారు.
(చదవండి: పాము, విభూతి, భస్మంతో బురిడీ, రూ.62 లక్షలు గోవిందా!)
మహాగణపతి కుడివైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటుచేశారు. కాగా మహా గణపతికి శనివారం ఉదయం 11.30 గంటలకు నేత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. మహాగణపతికి కంటి పాపను పెట్టడం ద్వారా మహాగణపతికి ప్రాణం పోసినట్లు అవుతుందని శిల్పి తెలిపారు.
–సాక్షి, ఖైరతాబాద్