Ganesh Statues
-
నేడు ఖైరతాబాద్ మహా గణపతికి నేత్రోత్సవం
శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు చకచకా నడుస్తున్నాయి. ఈ నెల 10న వినాయక చవితికి నాలుగైదు రోజుల ముందే పనులు పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా 11 అడుగులకే పరిమితమైన మహాగణపతి విగ్రహ ఎత్తును ఈసారి 40 అడుగులకు పెంచారు. దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠల శర్మ సూచన మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నుంచి ప్రజలను కాపాడేందుకు శివుడి రుద్ర అవతారమైన పంచముఖ రుద్ర మహాగణపతిగా నామకరణం చేశారు. (చదవండి: పాము, విభూతి, భస్మంతో బురిడీ, రూ.62 లక్షలు గోవిందా!) మహాగణపతి కుడివైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటుచేశారు. కాగా మహా గణపతికి శనివారం ఉదయం 11.30 గంటలకు నేత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. మహాగణపతికి కంటి పాపను పెట్టడం ద్వారా మహాగణపతికి ప్రాణం పోసినట్లు అవుతుందని శిల్పి తెలిపారు. –సాక్షి, ఖైరతాబాద్ -
రంగు రంగుల గణపయ్యలు సిద్ధం!
చేబ్రోలు: మరి కొద్ది రోజుల్లో జరగనున్న వినాయక చవతి వేడుకలకోసం తయారు చేస్తున్న వినాయక విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, వడ్లమూడి గరవుపాలెం, చేబ్రోలు ప్రాంతాల్లో ఈ ఏడాది రాజస్థాన్ ప్రాంతానికి చెందిన విగ్రహాల తయారీ దారులు కొద్ది నెలలుగా ఇక్కడే నివాసం ఉంటూ తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు. వివిధ రూపాల వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఒక్కో తయారీ సెంటర్లో సుమారు 50 నుంచి 60 భారీ విగ్రహాలను తయారీ చేసి విక్రయానికి సిద్దం చేస్తున్నారు. 5 నుంచి 13 అడుగుల ఎత్తున్న విగ్రహాలను తయారు చేసినట్లు తయారీ దారులు చెబుతున్నారు. రూ. నాలుగు వేల నుంచి రూ. 20వేల విలువ చేసే విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. నెమలి, ఎలుక, కమలం తదితర 10 రకాల్లో విగ్రహాలు విక్రయానికి సిద్దం చేస్తున్నారు. ఈ ఏడాది మల్టీ కలర్లో ఆకర్షనీయంగా విగ్రహాలను తయారు చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ఆయిల్ పెయింట్లతో కాకుండా వాటర్ పెయింట్‌తో ప్రత్యేక నిపుణులతో ఆకర్షనీయంగా రంగులు దిద్దినట్లు వారు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో విగ్రహాల పనులు పూర్తి అవుతుందని వారు చెబుతున్నారు. మండల పరిధిలోని 13 గ్రామాల్లో గత ఏడాది 200 భారీ వినాయక విగ్రహాలను పెట్టినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న జరిగే వినాయక చవితికి గత ఏడాది కన్నా విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉంది. -
సహజరంగుల గణేశ ప్రతిమల కోసం..
రాజేంద్రనగర్: సహజ రంగులతో వినాయక విగ్రహాలు అందించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నడుం బిగించింది. సహజ రంగులను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు దేశంలోనే మొట్టమొదటి భారీ యంత్రాన్ని వర్సిటీ ప్రాంగణంలో నెలకొల్పింది.. వినాయక చవితి రోజున గణనాధుడికి పూజకు కావాల్సిన పత్రి (21పత్రాలు), పూలతో పాటు ప్రకృతిలో లభించే వివిధ దుంపలు, వృక్షాల బెరళ్లతో వచ్చిన సహజ రంగులను గణేష్ ప్రతిమల తయారీలో వాడుతున్నారు. వర్సిటీ పరిధిలోని కాలేజ్ ఆఫ్ హోం సైన్స్‌కు నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టు (ఎన్ఏఐపీ) కింద ప్రపంచ బ్యాంక్ నిధులతో సహజరంగులను తయారు చేస్తోంది. సహజంగా లభించే ఆకులు, చెట్ల బెరళ్లు, దుంపల నుంచి తయారు చేసే రంగులను ఏటా 5వేల వరకు వినాయక ప్రతిమలకు అద్ది నగరంలోని ప్రజలకు అందిస్తున్నారు. అయితే, రంగులను పెద్ద మొత్తంలో తయారు చేసి వినాయక ప్రతిమలను నగరంలోని ప్రజలకు అందించాలని తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. రసాయనాలతో ముప్పు... వినాయక విగ్రహాల తయారీలో వాడే రసాయనాలు నీటిలో తేలికగా కరిగిపోవు. దీంతో జలాశయాల్లో విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు నీటిలోని జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు జలాశయాల్లో నీరు కలుషితమవుతుంది. అందుకే, కృత్రిమ రంగుల వాడకాన్ని అరికట్టి సహజరంగులతో రూపుదిద్దుకునే వినాయకవిగ్రహాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పూనుకుంది. అయితే వర్సిటీలో తయారు చేసే సహజరంగుల ఉత్పత్తిని అధిక మొత్తంలో తయారు చేసి తమకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిఎస్‌పిసిబి) వ్యవసాయ వర్సిటీని కోరింది. దీనికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తామని వారికి సూచించారు. రోజుకు ఐదు టన్నుల సహజ రంగులు... సహజరంగులను అధిక మొత్తంలో తయారు చేసేందుకు వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలో సహజ రంగుల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా రోజుకు ఐదు టన్నుల సహజ రంగులను ఉత్పత్తి చేయవచ్చు. ఈ యంత్రం దేశంలోనే మొట్టమొదటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఈ వినాయక చవితికి గాను తమకు 30 టన్నుల సహజ రంగులను అందివ్వాలని వ్యవసాయ వర్సిటీని పీసీబీ కోరినట్లు సమాచారం. దీంతో అధిక మొత్తంలో సహజ రంగులను ఉత్పత్తి చేసే యంత్రాలను వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. -
సహజరంగులనే వాడాలంట..
సాక్షి, సిటీబ్యూరో: వినాయక ప్రతిమలు తయారు చేస్తున్న కళాకారులు తాము తయారుచేసే గణపతి ప్రతిమలకు సహజరంగులనే వినియోగించాలని పీసీబీ శాస్త్రవేత్తలు సూచించారు. ఈమేరకు పలువురు కళాకారులకు ఆదివారం హయత్‌నగర్‌లో నిర్వహించిన శిబిరంలో పీసీబీ శాస్త్రవేత్తలు రవీందర్ తదితరులు సహజరంగుల వినియోగంపై అవగాహన కల్పించారు. -
గణేశ్ విగ్రహాలు ఎత్తు తగ్గించాల్సిందే..
-
గణేశ్ విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించొద్దు
హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసే గణేశ్ విగ్రహాల ఎత్తు 15 అడుగులకు మించరాదని హైకోర్టు సూచించింది. అంతకంటే ఎక్కువ ఎత్తులో విగ్రహాలు ఏర్పాటు చేయరాదని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి సూచనలు చేసింది. విగ్రహాల పేరుతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవటం తగదని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. మరోవైపు విగ్రహాల ఎత్తును తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా నగరంలో మెట్రో నిర్మాణం కారణంగా వినాయకుని విగ్రహలు ఈసారి 15 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేలా చూడాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కూడా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. -
గణేశుడు పాలు తాగెను!
1995లో జరిగిన ఓ వింత సంఘటన.. ప్రపంచాన్నే ముక్కున వేలేసుకునేలా చేసింది. ఎక్కడెక్కడి నుంచో శాస్త్రవేత్తలు, నాస్తికులు, భక్తులు, ఔత్సాహికులు, మీడియా ప్రముఖులను దేశ రాజధానికి చేరుకునేలా ప్రేరేపించింది. న్యూఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా ట్రాఫిక్జామ్నీ, దేశ పౌరుల మదిలో ఎక్కడలేని సందేహాలని, కన్ఫ్యూజన్నీ క్రియేట్ చేసింది. దేశంలోనే పాల ప్యాకెట్లకు కొరత వచ్చేంత ప్రభంజనాన్ని సృష్టించిన ఆ మహత్తర ఘటనే.. ‘‘గణేశుడు పాలు తాగడం’’! అవును, మీరు చదివింది నిజమే. 19 ఏళ్ల కిందట వినాయక విగ్రహాలు తొలిసారిగా పాలు తాగాయి..!! సెప్టెంబర్, 21.. అప్పుడప్పుడే చలిగాలులు ఢిల్లీని తాకడం మొదలుపెట్టాయి. దుప్పట్లు చుట్టుకుని నిద్రిస్తున్న ఢిల్లీ ప్రజానీకం ఎప్పుడెప్పుడు నిద్రలేద్దామా అన్నట్టుగా ఎదురుచూస్తోంది. అయితే, వారిని మరింత సేపు ఊరించడం ఇష్టం లేదన్నట్టు.. తొలి కోడి కూయక మునుపే ఓ మెరుపు వార్త తట్టిమరీ అందరినీ నిద్రలేపింది. గణేషుడు పాలు తాగుతున్నాడన్నదే ఆ వార్త! వివరంగా చెప్పాలంటే.. ఆ రోజు సూర్యోదయానికి ముందే ఓ భక్తుడు విఘ్నేశ్వరుడి ఆలయానికి చేరుకున్నాడు. తాను చేపట్టే ఏ పనిలోనూ విఘ్నాలు ఎదురు కాకుండా చూడాలంటూ నల్లనయ్యకు మొక్కుకున్నాడు. అక్కడితో ఆగకుండా వెంట తెచ్చుకున్న చెంబుడు పాలను స్వామి సన్నిధిలో ఉంచాడు. అంతలోనే ఏం ఆలోచించాడో ఏమో.. ఓ స్పూన్ నిండా పాలను తీసుకుని గణేషుడి తొండం దగ్గర పెట్టాడు. ఈ భక్తుడి అపర భక్తికి పూజారి కూడా కళ్లప్పగించి చూశాడు. కానీ, వద్దని వారించలేదు. ఫలితం.. అద్భుతం! అవును, కొద్ది నిమిషాలకే స్పూన్లోని పాలు మాయమయ్యాయి. పూజారి, భక్తుడు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. మరోసారి స్పూన్‌తో స్వామికి పాలు పట్టాల్సిందిగా భక్తుణ్ని కోరాడు పూజారి. రెండోసారీ అదే ఫలితం పునరావృత్తం అయింది. అంతే.. ఢిల్లీ మొత్తానికీ ఈ వార్త క్షణాల్లో తెలిసిపోయింది. ఎక్కడ చూసినా గణేశుడు పాలు తాగుతున్నాడన్న విషయమే హాట్ టాపిక్‌గా మారింది. వెనువెంటనే తలంటు స్నానాలు ఆచరించిన భక్తులు దగ్గర్లోని కిరాణా షాపుల్లో పాల ప్యాకెట్లు కొనుగోలు చేసి గుళ్లకు పరుగుపెట్టారు. చిన్నాపెద్దా తేడా లేకుండా కనిపించిన ప్రతి గుడి ముందూ బారులు తీరారు. గణపయ్యను దర్శించుకుని, పాలను నైవేద్యంగా పెట్టారు. ఆశ్చర్యంగా ఏకదంతుడు ఏ ఒక్కరినీ నిరాశ పర్చలేదు. తన చెంతకు చేరిన భక్తులందరి పాలనూ రుచిచూశాడు. దీంతో ఈ వార్త దేశమంతా దావానలంలా పాకింది. మధ్యాహ్నానికల్లా దేశంలోని గణేశుడి ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. టీవీల ముందు కూర్చుని ఈ దృశ్యాలను తిలకిస్తున్న కొందరు.. గుళ్లకు వెళ్లే తీరిక లేక ఇంట్లోనే ప్రయోగాత్మకంగా వినాయకుడికి పాలు పట్టించారు. ఈ విధానం కూడా విజయవంతమైంది. దీంతో చిన్నపాటి ఆలయాలకు కాస్తంత ఊరట కలిగింది. భక్తుల తాకిడి కాస్త తగ్గి, పూజారులు ఊపిరి పీల్చుకున్నారు. గణేశుడు పాలు తాగడం భక్తులనే కాదు.. శాస్త్రజ్ఞులనూ అమితంగా ఆకర్షించింది. టీవీ సెట్లలో ఆ దృశ్యాలను చూసి, వెంటనే ఢిల్లీలోని గుడికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సైంటిస్టు రాస్ మెక్‌డొవల్ తన బృందంతో సహా ప్రయోగాలు నిర్వహించారు. పాలలో ఫుడ్ కలరింగ్ కలిపి, విగ్రహానికి తాగించారు. ఈ ప్రయోగాల అనంతరం.. పాల తలతన్యతే దీనంతటికీ కారణమంటూ తేల్చేశారు. తల తన్యత కారణంగా తనలోని ద్రావణాన్ని పాలు పైకి పంపిస్తోందనీ, దీనికి సాక్ష్యంగా తొండానికి అంటుకున్న ఫుడ్ కలరింగ్‌ను చూపించారు. అయితే, ఈ వాదనలను భక్తులు కొట్టిపారేశారు. శాస్త్రజ్ఞులు చెప్పినదే నిజమైతే, గతంలో విగ్రహాలు పాలను ఎందుకు తాగలేదంటూ కొందరు ప్రశ్నించారు. దీనికి హేతువాదులు సమాధానం వెతికేలోపే, తర్వాతి రోజు నుంచి గణేశ విగ్రహాలు పాలు తాగడం ఆపేశాయి. దీంతో హిందుత్వ వాదులకు మరింత పట్టుదొరికినట్టైంది. దీన్ని దైవ రహస్యంగా.. మహాద్భుతంగా కొనియాడారు భక్తులు. ప్రపంచవ్యాప్తంగా హిందువులను సంఘటితం చేసే విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థల కారణంగా ఈ వార్త యూఎస్, యూకే, కెనడాలాంటి దేశాలకూ పాకింది. అక్కడ కూడా వినాయకుడు పాలు తాగడం విశేషం!దేవుడు, సైన్స్‌ల కొట్లాట పక్కనపెడితే.. ఢిల్లీలో ఈ ఘటనతో ఎప్పుడూ లేనంత ట్రాఫిక్ తయారైంది. భక్తులు ఆలయాల ముందు కొన్ని కిలోమీటర్ల దూరం క్యూలు కట్టారు. పాల విక్రయాలు ఒక్కసారిగా 30 శాతానికి పైగా పెరిగిపోయాయి. మన దేశంలోనే కాదు, ఇంగ్లండ్‌లోని ఓ స్టోర్‌లో దాదాపు 12 వేల లీటర్ల పాలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. తర్వాతి కాలంలో.. 2006లోనూ ఇలాంటి ఘటనలే అక్కడక్కడా చోటు చేసుకున్నాయి. కానీ, 1995లో ప్రపంచవ్యాప్తంగా జరిగినట్టుగా సంచలనాలు నమోదవ్వలేదు. భక్తుల విశ్వాసాలే నిజమో లేక శాస్త్రమే సత్యం ఘోషిస్తోందో స్పష్టంగా తెలియరానప్పటికీ, గణేశుడి విగ్రహాలు పాలు తాగడం మాత్రం ముమ్మాటికీ నిజం!! -
సహజ రంగులు వాడేలా చర్యలు
* గ్రేటర్ అధికారులకు హైకోర్టు ఆదేశం * తయారీదారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించండి * ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించండి * వినాయక చవితికి ముందే ఈ ప్రక్రియనంతా పూర్తి చేయండి * దీనిపై ఓ కార్యాచరణ ప్రణాళికను మా ముందుంచండి * విచారణ జూన్ 4కు వాయిదా సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాలకు కృత్రిమ రంగుల స్థానంలో సహజ రంగులను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు గురువారం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులను ఆదేశించింది. విగ్రహాల తయారీదారుల వద్దకు వెళ్లి వారికి సహజ రంగుల పట్ల అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. కృత్రిమ రంగుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వారికి వివరించాలంది. విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులు బంకమట్టిని ఉపయోగించేలా చూడాలంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగుల వినియోగం వల్ల ప్రజానీకానికి కలిగే నష్టాల గురించి పోస్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియోల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని గ్రేటర్ అధికారులకు తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియనంతా కూడా వినాయక చవితికి ముందే పూర్తి చేయాలంది. ఈ విషయంలో గణేష్ ఉత్సవ సమితులతో చర్చించి, వారు కూడా సహకరించేలా చూడాలంది. ఈ మొత్తం వ్యవహారంపై ఓ నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువులు, నీటి కుంటలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. అన్ని చోట్లా భారీ విగ్రహాలు వద్దు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు స్పందిస్తూ, విగ్రహాల నిమజ్జనం నిమిత్తం ఎన్క్లోజర్ల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 15 అడుగులకు మించి విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తామన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఒకటి రెండు చోట్లు భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తే తప్పు లేదని, అయతే ఒకరిని చూసి మరొకరు ఎత్తుపై పోటీపడుతూ అన్ని చోట్ల భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఏ మాత్రం అమోదయోగ్యం కాదంది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, విగ్రహాలకు సహజ రంగులు ఉపయోగించే విషయంలో ప్రభుత్వం నిధులు జారీ చేసిందన్నారు. ఈ సమయంలో భాగ్యనగర ఉత్సవ కమిటీ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ స్పందిస్తూ, సహజ రంగుల వాడకంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. -
విగ్రహాల ఎత్తు 20 అడుగులకు మించొద్దు
జీహెచ్ఎంసీకి హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసే గణేశ్ విగ్రహాల ఎత్తు 15 నుంచి 20 అడుగులకు మించకుండా ఉంటే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇంతకు మించితే తప్పనిసరిగా అనుమతి తీసుకునేలా తగు చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీకి సూచించింది. ఈ కేసులో వాదనలు విని పించేందుకు న్యాయవాదిని నియమించుకునే వెసులుబాటును గణేశ్ ఉత్సవ సమితికి ఇచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువులు, నీటి కుంటలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ న్యాయవాది ఎం.వేణుమాధవ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై తాత్కాలి సీజే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం విగ్రహాల ఎత్తు వల్ల కలిగే ఇబ్బందులను ప్రస్తావించింది. అలాగే విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
నేనేమి చేశాను పాపం!
కల్లూరు (రూరల్): నగరంలోని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశంలో ఓ పసికందు మృతదేహం బయటపడింది. హంద్రీ నది పక్కన మురుగు కాలువలో నాలుగు గర్భస్థ శిశు మృతదేహాలు గుర్తించి నెల కాకముందే ఆదివారం ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం. వివరాల్లోకి వెళితే. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని కేసీ కెనాల్లో గణేష్ నిమజ్జన చేసే ప్రదేశానికి సమీపంలో ఓ మగ శిశువు మృతదేహం తెలియాడుతుంది. గుర్తించిన స్థానిక దేవనగర్వాసులు బొమ్మన గురులక్ష్మి, దీప్తిబాయి పోలీసులకు సమాచారమందించారు. వెంటనే మూడవ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి కర్నూలు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. శిశువు ఎడమ కాలిపై డాటర్ ఆఫ్ లక్ష్మి అని రాసి ఉంది. వివాహేతర సంబంధం కారణమా.. లేక చనిపోతే అంత్యక్రియలు నిర్వహించకుండా కేసీ కాల్వలో పడేసి వెళ్లారా అనే దిశగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బాలాంజనేయులు
పరిపరి శోధన ఆ మధ్య ఎప్పుడో వినాయక విగ్రహాలు పాలు తాగినట్టే, కొంతమందికి బాలాంజనేయులు పుట్టినట్టు అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తుంటాయి. జన్యుపరమైన కొన్ని లోపాల వల్ల కొందరు చిన్నారులు వెనకభాగంలో కణుతులు, సిస్టులతో పుడుతుంటారు. దానినే మనవాళ్లు తోక అని చెప్పుకుంటుంటారు. నిజానికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5వ వారంలో చిన్నారులకు తోక ఏర్పడుతుందట. అయితే ఎనిమిదవ వారానికల్లా అది కాస్తా మాయమవుతుంది. అలా ఏర్పడ్డ తోకనే ఎంబ్రియో అంటారు. కొద్దిమంది చిన్నారులకు మాత్రం ఈ ఎంబ్రియో దానంతట అది కుదించుకుపోదు. అలాంటివాళ్లే తోకలాంటి అవయవంతో పుడతారు. నిజానికి అది తోక కాదు... చిన్నచిన్న కండరాలు, కణాల సముదాయం. ఈ విధంగా తోకతో పుట్టేవారి గురించి ఆ మధ్య ఎప్పుడో‘స్పెక్ట్రమ్ ఆఫ్ హ్యూమన్ టెయిల్స్’ పేరిట ఒక పరిశోధన పత్రం కూడా ప్రచురితమయింది. -
ఆపరేషన్ వినాయక!
యుద్ధప్రాతిపదికన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన వ్యర్థాల తొలగింపునకు రంగంలోకి హెచ్ఎండీఏ 200 మంది వర్కర్లు, 10 లారీలు, 3జేసీబీల ఏర్పాటు సిటీబ్యూరో : గౌరీ సుతుడు గంగ ఒడికి చేరడంతో నిమజ్జనోత్సవ ఘట్టం ముగిసింది. జంటనగరాల్లోని వేలాది వినాయక విగ్రహాలు సోమవారం రాత్రి 10 గంటల వరకు హుస్సేన్‌సాగర్‌లో నిక్షిప్తమయ్యాయి. వీటి తాలూకూ వ్యర్థాలను యుద్ధప్రాతిపదికన తొలగించేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. సాగర్‌ను జల్లెడ పట్టి నిమజ్జన వ్యర్థాలను వెలికితీసే కార్యక్రమాన్ని అధికారులు సోమవారం అర్థరాత్రి నుంచే ప్రారంభించారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ప్లాట్‌ఫారాల వద్ద నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాల తాలూకు అవశేషాలు, పూలు పత్రి ఇతర చెత్తాచెదారాన్ని సమూలంగా గట్టుకు చేరుస్తున్నారు. నిమజ్జన విగ్రహాలు నీటి అడుగు భాగానికి జారిపోకుండా ఎప్పటికప్పుడు డీయూసీ, ఫ్లోటింగ్ పాంటూన్ ద్వారా వెలికితీసి కుప్పలుగా చేశారు. ఈ వ్యర్థాలను లారీల ద్వారా కవాడీగూడలోని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డుకు తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 200 మంది కార్మికులు, 10 లారీలను వినియోగిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. వ్యర్థాలను మూడు రోజుల్లోనే తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ వైపు 4500 టన్నులు, ట్యాంకుబండ్ వైపు 6-7 వేల మెట్రిక్ టన్నుల మేర వ్యర్థాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ఫ్లాట్ ఫారాల వద్ద ఇప్పటికే 1500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించిన అధికారులు మిగిలిన వాటిని తొలగించేందుకు మూడు రోజుల పాటు షిఫ్టుల వారీగా 24 గంటలూ పనులు నిర్వహించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. బండ్‌కు భరోసా ఏదీ ? హుస్సేన్‌సాగర్‌లో ట్యాంకుబండ్, ఎన్టీఆర్ మార్గ్‌ల వైపు వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నా... ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే ప్రక్షాళన పనులు చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఎన్టీఆర్ మార్గ్ వైపున నిమజ్జనం చేసిన విగ్రహాలను మాత్రమే తొలగించే పనులకు హెచ్ఎండీఏ అధికారులు పరిమితమయ్యారు. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంకు బండ్ వైపున నీళ్లలో పడుతున్న విగ్రహాలను వెలికితీసే విషయాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అది లోతైన ప్రాంతం కావడంతో పూడిక తొలగింపు వ్యవహారం అంత సులభం కాదన్న విషయాన్ని కారణంగా చెబుతూ కొన్నేళ్లుగా దాటవేస్తున్నారు. ఏటా అక్కడ పడుతున్న విగ్రహాల వల్ల పూడిక భారీగా పేరుకుపోతోంది. ఇది ట్యాంకు బండ్ ఉనికికే ప్రమాదమని, నీటి నిల్వ సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
హుస్సేన్ సాగర్‌లోనే గణేశ్ నిమజ్జనం
హిందువుల మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు వద్దు మండపాలకు అనుమతి అవసరంలేదు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే చాలు 13న హిందూ చైతన్య సభ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి వెల్లడి పంజగుట్ట:ఈ ఏడాది కూడా వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని, దీనిపై మరో మాట అవసరం లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి.రాఘవరెడ్డి అన్నారు. ఇందిరాపార్క్‌లో కృత్రిమంగా ట్యాంక్ ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేయడం తగదన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం, వ్యవహరించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన గురువారం విగ్రహ ప్రతిష్టతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 27వ తేదీన ఆదివారం సామూహిక నిమజ్జనోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. వినాయక మండపాలకు ఎలాంటి పోలీస్ అనుమతి అవసరంలేదని, సంబంధిత పోలీస్స్టేషన్లలో కేవలం సమాచారం ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో సీఎం కూడా చెప్పారని, పోలీసులు మండపాల నిర్వాహకులను వేధించడం మానుకోవాలని అన్నారు. అన్ని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇవ్వాలని కోరారు. గణేశ్ ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతున్నప్పటికీ దేవాదాయ శాఖలో స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఉత్సవాల్లో ఆ శాఖ సైతం పాలుపంచుకోవాలన్నారు. గణేశ్ మండపాల వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 13న ఎన్టీఆర్ స్టేడియంలో హిందూ చైతన్య సభ 36వ సామూహిక గణేష్ ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించేందుకు సన్నాహకంలో భాగంగా ఈ నెల 13వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో ‘హిందూ చైతన్య సభ’ నిర్వహిస్తున్నట్లు రాఘవరెడ్డి తెలిపారు. ఈమేరకు సభ పోస్టర్, కరపత్రాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవత్‌రావు, ఉపాధ్యక్షులు నర్సింగ్, ఖైరతాబాద్ గణ్ష్ అధ్యక్షులు సుదర్శన్‌లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. సభకు ముఖ్య అతిథులుగా శ్రీ త్రిదండి చిన్న జీయర్‌స్వామి, గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్, సాధ్వి హేమలతా శాస్త్రి, శ్రీ కమలానంద భారతి తదితరులు హాజరవుతారని తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినం కావడంతో ప్రతీ వినాయక మండపం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాన్ని, జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కేంద్ర కమిటీ సభ్యురాలు శశికళ, కార్యదర్శి ఆర్. శశిధర్ తదితరులు పాల్గొన్నారు. -
రాతపూర్వక హామీ ఇవ్వండి
ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: చెరువులు, సరస్సులు, నీటి కుంటల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలపై గతంలో తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామంటూ తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లను హైకోర్టు గురువారం ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం ద్వారా నీటి వనరులు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయడం లేదంటూ మామిడి వేణుమాధవ్ అనే న్యాయవాది కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి బెంగళూరులో అమలవుతున్న విధానాన్ని వివరించింది. చెరువులో ఎక్కడపడితే అక్కడ వేయకుండా అందులోనే ఓ మూల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట మాత్రమే నిమజ్జనం చేస్తారని, అలా హుస్సేన్‌సాగర్‌లో అమలు సాధ్యమవుతుందా..? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ ఏడాది కూడా అమలు చేస్తామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తాము స్వయంగా పర్యవేక్షిస్తామని, హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యరహితంగా చేసేందుకు అందరూ కృషి చేయాలని ధర్మాసనం తెలిపింది. నిమజ్జనం విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు రాతపూర్వక హామీ ఇవ్వాలంటూ విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది. -
శుక్లాంబరధరం.. విష్ణుం
ఖమ్మం కల్చరల్ : విఘ్నాలకు అధిపతి గణేషుడు కొలువుదీరబోతున్నాడు. వినాయక చవితికి భక్తులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా మండపాల్లో విఘ్నేశ్వరుడి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. వేడుకలను వైభవంగా నిర్వహించటానికి సన్నద్ధమయ్యారు. గత ఏడాది జిల్లాకేంద్రంలో 634 గణేష్ మండపాలను నెలకోల్పగా ప్రస్తుతం వాటి సంఖ్య 973కు చేరింది. చివరి నిముషంలో మరొక 15, 20 విగ్రహాలు ఏర్పాటయ్యే అవకాశముంది. కొత్తగూడెంలో 500, పాల్వంచలో 180, భద్రాచలంలో 110, ఇల్లెందులో 200, సత్తుపల్లిలో 150కిపైగా విగ్రహాలు మండపాల్లో కొలువుదీరనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈసారి ఏర్పాటు కానున్న భారీ, మధ్యతరహా విగ్రహాల సంఖ్య తొమ్మిది వేలు దాటొచ్చని అంచనా. ఖమ్మంతోపాటు పలు ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేశ్ విగ్రహాలు తయారు చేసేవారు స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఏడాది పొడవునా పనిచేశారు. వీరు తయారుచేసే విగ్రహాలు డిమాండ్‌కు సరిపోకపోవటంతో హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విగ్రహాలు తెప్పించటం మొదలైంది. దీంతో విగ్రహాల తయారీతో సంబంధంలేని పలువురు దళారులుగా, వ్యాపారులుగా ఖమ్మంలోని వైరారోడ్డు, బైపాస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో గతేడాది విగ్రహాలను తెప్పించి నిల్వ ఉంచడం ప్రారంభించారు. విగ్రహాల వ్యాపారంలో పోటీ పెరగడంతో ధరలు కాస్తంత దిగొచ్చాయి. ప్రస్తుతం భారీ వినాయక విగ్రహాల కోసం మాత్రమే హైదరాబాద్‌కు వెళ్తున్నారు. అందుబాటులో వివిధ వెరైటీల విగ్రహాలు, ప్రతిమలు లభిస్తుండడం, ట్రాన్స్పోర్ట్ అవకాశాలు పెరగడంతో వినాయకోత్సవ మండపాలు గణనీయంగా పెరుగుతున్నాయి. వినాయకమండపాల నిర్వహణకు విద్యుత్తు, ఫైర్, మైక్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటైన ఉత్సవ సమితులు ముందుగానే మండప నిర్వాహకులతో సమావేశాలు జరిపి, విద్యుత్, మైక్ పర్మిషన్లు ఉమ్మడిగా తీసుకుంటున్నాయి. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్, ఫైర్, పొల్యూషన్ బోర్డ్, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులతో ఉత్సవ సమితుల నేతలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. గణపయ్య వేడుకలకు పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. మట్టి విగ్రహాలే మళ్లీ.. రంగులు అద్దిన పాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాలు హానికరమనే ప్రచారం ఈసారి మరింత జోరందుకుంది. పర్యావరణానికి ముప్పు వాటిల్లజేసే ఈ విగ్రహాలను వినియోగించొద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా చైతన్యం కల్పించాయి. దీంతో మట్టి విగ్రహాలే మళ్లీ అత్యధికంగా దర్శనమిస్తున్నాయి. ఖమ్మంలో హిందూ ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పడిన స్తంభాద్రి ఉత్సవ సమితి ఆదర్శంగా నిలుస్తోంది. నెల రోజులు మందునుంచే గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం సకల ఏర్పాట్లు చేస్తోంది. రంగులద్దిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ఈసారి ఉత్సవాల్లో వాడరాదని తీర్మానించింది. అంతేకాక తానే స్వయంగా రంగంలోకి దిగి మట్టి విగ్రహాలను అందుబాటులోకి తెస్తోంది. కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి సైతం మట్టి విగ్రహాలు అందరూ వాడేలా చూడాలని స్తంభాద్రి ఉత్సవ సమితిని కోరారు. వాతావరణ, నీటి కాలుష్యాలకు తావివ్వని విధంగా వినాయక మండపాల నిర్వాహకులంతా ఈసారి మట్టి విగ్రహాలే నెలకొల్పనున్నారు. కాలుష్య నియంత్రణ మండలితోపాటు రోటరీక్లబ్, వాసవీక్లబ్, లయన్స్‌క్లబ్ తదితర స్వచ్ఛంద సంస్థలు వినాయక మట్టి ప్రతిమలను తమ శక్తిమేర ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాకుండా ఇళ్లలో వినియోగించే చిన్న గణపతి ప్రతిమలను సైతం పెద్ద ఎత్తున నగరవాసులకు అందుబాటులోకి తేవటానికి ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. -
ట్యాంక్‌బండ్ వద్దకు భారీగా చేరిన గణేష్ విగ్రహాలు
హైదరాబాద్: ట్యాంక్‌బండ్ వద్దకు గణేష్ విగ్రహాలు భారీగా వచ్చాయి. గణేష్ భక్తులతో ట్యాంక్‌బండ్ వద్ద కోలాహలంగా ఉంది. భారీగా కురుస్తున్న వర్షానికి భక్తులు తడిసి ముద్దయిపోయారు. వర్షంలో సైతం భక్తులు అత్యంత ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. అయితే వర్షం కారణంగా గణేష్ విగ్రహాల ఊరేగింపు వేగంగా ముందుకు సాగుతోంది. ట్యాంక్‌బండ్ వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వర్షంలో కూడా నిమజ్జనం కొనసాగుతోంది. ఈ రాత్రంతా నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది.