సహజరంగుల గణేశ ప్రతిమల కోసం..
Published Tue, Jul 26 2016 4:29 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
రాజేంద్రనగర్: సహజ రంగులతో వినాయక విగ్రహాలు అందించి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నడుం బిగించింది. సహజ రంగులను అధిక మొత్తంలో ఉత్పత్తి చేసేందుకు దేశంలోనే మొట్టమొదటి భారీ యంత్రాన్ని వర్సిటీ ప్రాంగణంలో నెలకొల్పింది.. వినాయక చవితి రోజున గణనాధుడికి పూజకు కావాల్సిన పత్రి (21పత్రాలు), పూలతో పాటు ప్రకృతిలో లభించే వివిధ దుంపలు, వృక్షాల బెరళ్లతో వచ్చిన సహజ రంగులను గణేష్ ప్రతిమల తయారీలో వాడుతున్నారు. వర్సిటీ పరిధిలోని కాలేజ్ ఆఫ్ హోం సైన్స్‌కు నేషనల్ అగ్రికల్చర్ ఇన్నోవేటివ్ ప్రాజెక్టు (ఎన్‌ఏఐపీ) కింద ప్రపంచ బ్యాంక్ నిధులతో సహజరంగులను తయారు చేస్తోంది. సహజంగా లభించే ఆకులు, చెట్ల బెరళ్లు, దుంపల నుంచి తయారు చేసే రంగులను ఏటా 5వేల వరకు వినాయక ప్రతిమలకు అద్ది నగరంలోని ప్రజలకు అందిస్తున్నారు. అయితే, రంగులను పెద్ద మొత్తంలో తయారు చేసి వినాయక ప్రతిమలను నగరంలోని ప్రజలకు అందించాలని తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది.
రసాయనాలతో ముప్పు...
వినాయక విగ్రహాల తయారీలో వాడే రసాయనాలు నీటిలో తేలికగా కరిగిపోవు. దీంతో జలాశయాల్లో విగ్రహాలను నిమజ్జనం చేసినప్పుడు నీటిలోని జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు జలాశయాల్లో నీరు కలుషితమవుతుంది. అందుకే, కృత్రిమ రంగుల వాడకాన్ని అరికట్టి సహజరంగులతో రూపుదిద్దుకునే వినాయకవిగ్రహాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం పూనుకుంది. అయితే వర్సిటీలో తయారు చేసే సహజరంగుల ఉత్పత్తిని అధిక మొత్తంలో తయారు చేసి తమకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిఎస్‌పిసిబి) వ్యవసాయ వర్సిటీని కోరింది. దీనికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తామని వారికి సూచించారు.
రోజుకు ఐదు టన్నుల సహజ రంగులు...
సహజరంగులను అధిక మొత్తంలో తయారు చేసేందుకు వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలో సహజ రంగుల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా రోజుకు ఐదు టన్నుల సహజ రంగులను ఉత్పత్తి చేయవచ్చు. ఈ యంత్రం దేశంలోనే మొట్టమొదటిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఈ వినాయక చవితికి గాను తమకు 30 టన్నుల సహజ రంగులను అందివ్వాలని వ్యవసాయ వర్సిటీని పీసీబీ కోరినట్లు సమాచారం. దీంతో అధిక మొత్తంలో సహజ రంగులను ఉత్పత్తి చేసే యంత్రాలను వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి.
Advertisement
Advertisement