నగరంలోని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశంలో ఓ పసికందు మృతదేహం బయటపడింది.
కల్లూరు (రూరల్): నగరంలోని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశంలో ఓ పసికందు మృతదేహం బయటపడింది. హంద్రీ నది పక్కన మురుగు కాలువలో నాలుగు గర్భస్థ శిశు మృతదేహాలు గుర్తించి నెల కాకముందే ఆదివారం ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం. వివరాల్లోకి వెళితే. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని కేసీ కెనాల్‌లో గణేష్ నిమజ్జన చేసే ప్రదేశానికి సమీపంలో ఓ మగ శిశువు మృతదేహం తెలియాడుతుంది. గుర్తించిన స్థానిక దేవనగర్‌వాసులు బొమ్మన గురులక్ష్మి, దీప్తిబాయి పోలీసులకు సమాచారమందించారు. వెంటనే మూడవ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి కర్నూలు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
శిశువు ఎడమ కాలిపై డాటర్ ఆఫ్ లక్ష్మి అని రాసి ఉంది. వివాహేతర సంబంధం కారణమా.. లేక చనిపోతే అంత్యక్రియలు నిర్వహించకుండా కేసీ కాల్వలో పడేసి వెళ్లారా అనే దిశగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.