రాతపూర్వక హామీ ఇవ్వండి
ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: చెరువులు, సరస్సులు, నీటి కుంటల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలపై గతంలో తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తామంటూ తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)లను హైకోర్టు గురువారం ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
గణేష్ విగ్రహాల నిమజ్జనం ద్వారా నీటి వనరులు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయడం లేదంటూ మామిడి వేణుమాధవ్ అనే న్యాయవాది కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం దానిని మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా ధర్మాసనం విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి బెంగళూరులో అమలవుతున్న విధానాన్ని వివరించింది. చెరువులో ఎక్కడపడితే అక్కడ వేయకుండా అందులోనే ఓ మూల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చోట మాత్రమే నిమజ్జనం చేస్తారని, అలా హుస్సేన్‌సాగర్‌లో అమలు సాధ్యమవుతుందా..? అని ధర్మాసనం ప్రశ్నించింది.
దీనికి రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, నిమజ్జనంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఈ ఏడాది కూడా అమలు చేస్తామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తాము స్వయంగా పర్యవేక్షిస్తామని, హుస్సేన్‌సాగర్‌ను కాలుష్యరహితంగా చేసేందుకు అందరూ కృషి చేయాలని ధర్మాసనం తెలిపింది. నిమజ్జనం విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు రాతపూర్వక హామీ ఇవ్వాలంటూ విచారణను వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.