
హుస్సేన్ సాగర్‌లోనే గణేశ్ నిమజ్జనం
హిందువుల మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు వద్దు
మండపాలకు అనుమతి అవసరంలేదు
పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇస్తే చాలు
13న హిందూ చైతన్య సభ
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి వెల్లడి
పంజగుట్ట:ఈ ఏడాది కూడా వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని, దీనిపై మరో మాట అవసరం లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి.రాఘవరెడ్డి అన్నారు. ఇందిరాపార్క్‌లో కృత్రిమంగా ట్యాంక్ ఏర్పాటు చేసి అందులో నిమజ్జనం చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేయడం తగదన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం, వ్యవహరించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన గురువారం విగ్రహ ప్రతిష్టతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 27వ తేదీన ఆదివారం సామూహిక నిమజ్జనోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. వినాయక మండపాలకు ఎలాంటి పోలీస్ అనుమతి అవసరంలేదని, సంబంధిత పోలీస్‌స్టేషన్‌లలో కేవలం సమాచారం ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో సీఎం కూడా చెప్పారని, పోలీసులు మండపాల నిర్వాహకులను వేధించడం మానుకోవాలని అన్నారు. అన్ని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇవ్వాలని కోరారు. గణేశ్ ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతున్నప్పటికీ దేవాదాయ శాఖలో స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఉత్సవాల్లో ఆ శాఖ సైతం పాలుపంచుకోవాలన్నారు. గణేశ్ మండపాల వద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
13న ఎన్టీఆర్ స్టేడియంలో హిందూ చైతన్య సభ
36వ సామూహిక గణేష్ ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహించేందుకు సన్నాహకంలో భాగంగా ఈ నెల 13వ తేదీన ఎన్‌టీఆర్ స్టేడియంలో ‘హిందూ చైతన్య సభ’ నిర్వహిస్తున్నట్లు రాఘవరెడ్డి తెలిపారు. ఈమేరకు సభ పోస్టర్, కరపత్రాన్ని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవత్‌రావు, ఉపాధ్యక్షులు నర్సింగ్, ఖైరతాబాద్ గణ్‌ష్ అధ్యక్షులు సుదర్శన్‌లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. సభకు ముఖ్య అతిథులుగా శ్రీ త్రిదండి చిన్న జీయర్‌స్వామి, గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్, సాధ్వి హేమలతా శాస్త్రి, శ్రీ కమలానంద భారతి తదితరులు హాజరవుతారని తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనదినం కావడంతో ప్రతీ వినాయక మండపం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాన్ని, జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కేంద్ర కమిటీ సభ్యురాలు శశికళ, కార్యదర్శి ఆర్. శశిధర్ తదితరులు పాల్గొన్నారు.