గణేశుడు పాలు తాగెను! | Ganesha drinking milk! | Sakshi
Sakshi News home page

గణేశుడు పాలు తాగెను!

Published Wed, Jun 15 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

గణేశుడు పాలు తాగెను!

గణేశుడు పాలు తాగెను!

1995లో జరిగిన ఓ వింత సంఘటన.. ప్రపంచాన్నే ముక్కున వేలేసుకునేలా చేసింది. ఎక్కడెక్కడి నుంచో శాస్త్రవేత్తలు, నాస్తికులు, భక్తులు, ఔత్సాహికులు, మీడియా ప్రముఖులను దేశ రాజధానికి చేరుకునేలా ప్రేరేపించింది. న్యూఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా ట్రాఫిక్‌జామ్‌నీ, దేశ పౌరుల మదిలో ఎక్కడలేని సందేహాలని, కన్ఫ్యూజన్‌నీ క్రియేట్ చేసింది. దేశంలోనే పాల ప్యాకెట్లకు కొరత వచ్చేంత ప్రభంజనాన్ని సృష్టించిన ఆ మహత్తర ఘటనే.. ‘‘గణేశుడు పాలు తాగడం’’! అవును, మీరు చదివింది నిజమే. 19 ఏళ్ల కిందట వినాయక విగ్రహాలు తొలిసారిగా పాలు తాగాయి..!!
 
సెప్టెంబర్, 21.. అప్పుడప్పుడే చలిగాలులు ఢిల్లీని తాకడం మొదలుపెట్టాయి. దుప్పట్లు చుట్టుకుని నిద్రిస్తున్న ఢిల్లీ ప్రజానీకం ఎప్పుడెప్పుడు నిద్రలేద్దామా అన్నట్టుగా ఎదురుచూస్తోంది. అయితే, వారిని మరింత సేపు ఊరించడం ఇష్టం లేదన్నట్టు.. తొలి కోడి కూయక మునుపే ఓ మెరుపు వార్త తట్టిమరీ అందరినీ నిద్రలేపింది. గణేషుడు పాలు తాగుతున్నాడన్నదే ఆ వార్త! వివరంగా చెప్పాలంటే..
 
ఆ రోజు సూర్యోదయానికి ముందే ఓ భక్తుడు విఘ్నేశ్వరుడి ఆలయానికి చేరుకున్నాడు. తాను చేపట్టే ఏ పనిలోనూ విఘ్నాలు ఎదురు కాకుండా చూడాలంటూ నల్లనయ్యకు మొక్కుకున్నాడు. అక్కడితో ఆగకుండా వెంట తెచ్చుకున్న చెంబుడు పాలను స్వామి సన్నిధిలో ఉంచాడు. అంతలోనే ఏం ఆలోచించాడో ఏమో.. ఓ స్పూన్ నిండా పాలను తీసుకుని గణేషుడి తొండం దగ్గర పెట్టాడు. ఈ భక్తుడి అపర భక్తికి పూజారి కూడా కళ్లప్పగించి చూశాడు. కానీ, వద్దని వారించలేదు. ఫలితం.. అద్భుతం! అవును, కొద్ది నిమిషాలకే స్పూన్‌లోని పాలు మాయమయ్యాయి.
 
పూజారి, భక్తుడు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. మరోసారి స్పూన్‌తో స్వామికి పాలు పట్టాల్సిందిగా భక్తుణ్ని కోరాడు పూజారి. రెండోసారీ అదే ఫలితం పునరావృత్తం అయింది. అంతే.. ఢిల్లీ మొత్తానికీ ఈ వార్త క్షణాల్లో తెలిసిపోయింది. ఎక్కడ చూసినా గణేశుడు పాలు తాగుతున్నాడన్న విషయమే హాట్ టాపిక్‌గా మారింది. వెనువెంటనే తలంటు స్నానాలు ఆచరించిన భక్తులు దగ్గర్లోని కిరాణా షాపుల్లో పాల ప్యాకెట్లు కొనుగోలు చేసి గుళ్లకు పరుగుపెట్టారు. చిన్నాపెద్దా తేడా లేకుండా కనిపించిన ప్రతి గుడి ముందూ బారులు తీరారు. గణపయ్యను దర్శించుకుని, పాలను నైవేద్యంగా పెట్టారు. ఆశ్చర్యంగా ఏకదంతుడు ఏ ఒక్కరినీ నిరాశ పర్చలేదు. తన చెంతకు చేరిన భక్తులందరి పాలనూ రుచిచూశాడు.

దీంతో ఈ వార్త దేశమంతా దావానలంలా పాకింది. మధ్యాహ్నానికల్లా దేశంలోని గణేశుడి ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. టీవీల ముందు కూర్చుని ఈ దృశ్యాలను తిలకిస్తున్న కొందరు.. గుళ్లకు వెళ్లే తీరిక లేక ఇంట్లోనే ప్రయోగాత్మకంగా వినాయకుడికి పాలు పట్టించారు. ఈ విధానం కూడా విజయవంతమైంది. దీంతో చిన్నపాటి ఆలయాలకు కాస్తంత ఊరట కలిగింది. భక్తుల తాకిడి కాస్త తగ్గి, పూజారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
గణేశుడు పాలు తాగడం భక్తులనే కాదు.. శాస్త్రజ్ఞులనూ అమితంగా ఆకర్షించింది. టీవీ సెట్లలో ఆ దృశ్యాలను చూసి, వెంటనే ఢిల్లీలోని గుడికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సైంటిస్టు రాస్ మెక్‌డొవల్ తన బృందంతో సహా ప్రయోగాలు నిర్వహించారు. పాలలో ఫుడ్ కలరింగ్ కలిపి, విగ్రహానికి తాగించారు. ఈ ప్రయోగాల అనంతరం.. పాల తలతన్యతే దీనంతటికీ కారణమంటూ తేల్చేశారు. తల తన్యత కారణంగా తనలోని ద్రావణాన్ని పాలు పైకి పంపిస్తోందనీ, దీనికి సాక్ష్యంగా తొండానికి అంటుకున్న ఫుడ్ కలరింగ్‌ను చూపించారు. అయితే, ఈ వాదనలను భక్తులు కొట్టిపారేశారు.
 
శాస్త్రజ్ఞులు చెప్పినదే నిజమైతే, గతంలో విగ్రహాలు పాలను ఎందుకు తాగలేదంటూ కొందరు ప్రశ్నించారు. దీనికి హేతువాదులు సమాధానం వెతికేలోపే, తర్వాతి రోజు నుంచి గణేశ విగ్రహాలు పాలు తాగడం ఆపేశాయి. దీంతో హిందుత్వ వాదులకు మరింత పట్టుదొరికినట్టైంది. దీన్ని దైవ రహస్యంగా.. మహాద్భుతంగా కొనియాడారు భక్తులు. ప్రపంచవ్యాప్తంగా హిందువులను సంఘటితం చేసే విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థల కారణంగా ఈ వార్త యూఎస్, యూకే, కెనడాలాంటి దేశాలకూ పాకింది. అక్కడ కూడా వినాయకుడు పాలు తాగడం విశేషం!దేవుడు, సైన్స్‌ల కొట్లాట పక్కనపెడితే.. ఢిల్లీలో ఈ ఘటనతో ఎప్పుడూ లేనంత ట్రాఫిక్ తయారైంది. భక్తులు ఆలయాల ముందు కొన్ని కిలోమీటర్ల దూరం క్యూలు కట్టారు. పాల విక్రయాలు ఒక్కసారిగా 30 శాతానికి పైగా పెరిగిపోయాయి. మన దేశంలోనే కాదు, ఇంగ్లండ్‌లోని ఓ స్టోర్‌లో దాదాపు 12 వేల లీటర్ల పాలు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. తర్వాతి కాలంలో.. 2006లోనూ ఇలాంటి ఘటనలే అక్కడక్కడా చోటు చేసుకున్నాయి. కానీ, 1995లో ప్రపంచవ్యాప్తంగా జరిగినట్టుగా సంచలనాలు నమోదవ్వలేదు. భక్తుల విశ్వాసాలే నిజమో లేక శాస్త్రమే సత్యం ఘోషిస్తోందో స్పష్టంగా తెలియరానప్పటికీ, గణేశుడి విగ్రహాలు పాలు తాగడం మాత్రం ముమ్మాటికీ నిజం!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement