శుక్లాంబరధరం.. విష్ణుం | Today Ganesh Chaturthi | Sakshi
Sakshi News home page

శుక్లాంబరధరం.. విష్ణుం

Published Fri, Aug 29 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

Today Ganesh Chaturthi

ఖమ్మం కల్చరల్ :  విఘ్నాలకు అధిపతి గణేషుడు కొలువుదీరబోతున్నాడు. వినాయక చవితికి భక్తులు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా మండపాల్లో విఘ్నేశ్వరుడి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. వేడుకలను వైభవంగా నిర్వహించటానికి సన్నద్ధమయ్యారు. గత ఏడాది జిల్లాకేంద్రంలో 634 గణేష్ మండపాలను నెలకోల్పగా ప్రస్తుతం వాటి సంఖ్య 973కు చేరింది.

 చివరి నిముషంలో మరొక 15, 20 విగ్రహాలు ఏర్పాటయ్యే అవకాశముంది.  కొత్తగూడెంలో 500, పాల్వంచలో 180, భద్రాచలంలో 110, ఇల్లెందులో 200, సత్తుపల్లిలో 150కిపైగా విగ్రహాలు మండపాల్లో కొలువుదీరనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈసారి ఏర్పాటు కానున్న  భారీ, మధ్యతరహా విగ్రహాల సంఖ్య తొమ్మిది వేలు దాటొచ్చని అంచనా. ఖమ్మంతోపాటు పలు ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేశ్ విగ్రహాలు తయారు చేసేవారు స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని ఏడాది పొడవునా పనిచేశారు. వీరు తయారుచేసే విగ్రహాలు డిమాండ్‌కు సరిపోకపోవటంతో హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విగ్రహాలు తెప్పించటం మొదలైంది.

 దీంతో విగ్రహాల తయారీతో సంబంధంలేని పలువురు దళారులుగా, వ్యాపారులుగా ఖమ్మంలోని వైరారోడ్డు, బైపాస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో గతేడాది విగ్రహాలను తెప్పించి నిల్వ ఉంచడం ప్రారంభించారు. విగ్రహాల వ్యాపారంలో పోటీ పెరగడంతో ధరలు కాస్తంత దిగొచ్చాయి. ప్రస్తుతం భారీ వినాయక విగ్రహాల కోసం మాత్రమే హైదరాబాద్‌కు వెళ్తున్నారు. అందుబాటులో వివిధ వెరైటీల విగ్రహాలు, ప్రతిమలు లభిస్తుండడం, ట్రాన్స్‌పోర్ట్ అవకాశాలు పెరగడంతో వినాయకోత్సవ మండపాలు గణనీయంగా పెరుగుతున్నాయి.

వినాయకమండపాల నిర్వహణకు విద్యుత్తు, ఫైర్,  మైక్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటైన ఉత్సవ సమితులు ముందుగానే మండప నిర్వాహకులతో సమావేశాలు జరిపి, విద్యుత్, మైక్ పర్మిషన్లు ఉమ్మడిగా తీసుకుంటున్నాయి. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్, విద్యుత్, ఫైర్, పొల్యూషన్ బోర్డ్, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులతో ఉత్సవ సమితుల నేతలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. గణపయ్య వేడుకలకు పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారం అందిస్తున్నారు.
 
మట్టి విగ్రహాలే మళ్లీ..
 రంగులు అద్దిన పాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే విగ్రహాలు హానికరమనే ప్రచారం ఈసారి మరింత జోరందుకుంది. పర్యావరణానికి ముప్పు వాటిల్లజేసే ఈ విగ్రహాలను వినియోగించొద్దని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా చైతన్యం కల్పించాయి. దీంతో మట్టి విగ్రహాలే మళ్లీ అత్యధికంగా దర్శనమిస్తున్నాయి. ఖమ్మంలో హిందూ ఉత్సవాల నిర్వహణ కోసం ఏర్పడిన స్తంభాద్రి ఉత్సవ సమితి  ఆదర్శంగా నిలుస్తోంది.  నెల రోజులు మందునుంచే గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం సకల ఏర్పాట్లు చేస్తోంది.

 రంగులద్దిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను ఈసారి ఉత్సవాల్లో వాడరాదని తీర్మానించింది. అంతేకాక తానే స్వయంగా రంగంలోకి దిగి మట్టి విగ్రహాలను అందుబాటులోకి తెస్తోంది.  కలెక్టర్  డాక్టర్ కె.ఇలంబరితి  సైతం మట్టి విగ్రహాలు అందరూ వాడేలా చూడాలని స్తంభాద్రి ఉత్సవ సమితిని కోరారు. వాతావరణ, నీటి కాలుష్యాలకు తావివ్వని విధంగా వినాయక మండపాల నిర్వాహకులంతా ఈసారి మట్టి విగ్రహాలే నెలకొల్పనున్నారు.

కాలుష్య నియంత్రణ మండలితోపాటు రోటరీక్లబ్, వాసవీక్లబ్, లయన్స్‌క్లబ్ తదితర స్వచ్ఛంద సంస్థలు వినాయక మట్టి ప్రతిమలను తమ శక్తిమేర ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాకుండా ఇళ్లలో వినియోగించే చిన్న గణపతి ప్రతిమలను సైతం పెద్ద ఎత్తున నగరవాసులకు అందుబాటులోకి తేవటానికి ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement