రంగు రంగుల గణపయ్యలు సిద్ధం!
చేబ్రోలు: మరి కొద్ది రోజుల్లో జరగనున్న వినాయక చవతి వేడుకలకోసం తయారు చేస్తున్న వినాయక విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, వడ్లమూడి గరవుపాలెం, చేబ్రోలు ప్రాంతాల్లో ఈ ఏడాది రాజస్థాన్ ప్రాంతానికి చెందిన విగ్రహాల తయారీ దారులు కొద్ది నెలలుగా ఇక్కడే నివాసం ఉంటూ తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు. వివిధ రూపాల వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఒక్కో తయారీ సెంటర్‌లో సుమారు 50 నుంచి 60 భారీ విగ్రహాలను తయారీ చేసి విక్రయానికి సిద్దం చేస్తున్నారు. 5 నుంచి 13 అడుగుల ఎత్తున్న విగ్రహాలను తయారు చేసినట్లు తయారీ దారులు చెబుతున్నారు. రూ. నాలుగు వేల నుంచి రూ. 20వేల విలువ చేసే విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. నెమలి, ఎలుక, కమలం తదితర 10 రకాల్లో విగ్రహాలు విక్రయానికి సిద్దం చేస్తున్నారు. ఈ ఏడాది మల్టీ కలర్‌లో ఆకర్షనీయంగా విగ్రహాలను తయారు చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ఆయిల్ పెయింట్‌లతో కాకుండా వాటర్ పెయింట్‌తో ప్రత్యేక నిపుణులతో ఆకర్షనీయంగా రంగులు దిద్దినట్లు వారు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో విగ్రహాల పనులు పూర్తి అవుతుందని వారు చెబుతున్నారు. మండల పరిధిలోని 13 గ్రామాల్లో గత ఏడాది 200 భారీ వినాయక విగ్రహాలను పెట్టినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న జరిగే వినాయక చవితికి గత ఏడాది కన్నా విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉంది.