లక్నో: బీజేపీ ఎంపీ విందుపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ ఇటీవల ఇచ్చిన విందులో జరిగిన ‘మటన్ వార్’ చరిత్రకెక్కిందని విమర్శలు గుప్పించారు. ‘మీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నో సంఘటనలు ప్రాచుర్యం పొందాయి. కానీ మటన్ వార్ కూడా జరిగిందని నాకు తెలియనే లేదు. నేను ఎన్నో యుద్ధాలను చూశాను.. ఈ మటన్ యుద్ధం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది’ అంటూ వ్యంగ్యస్థ్రాలు సంధించారు.
అసలేం జరిగిందంటే.. ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపూర్‌లో బదోహి బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ బింద్ ఈ నెల 14వ ఆయన కార్యాలయంలో విందు ఏర్పాటు చేశారు. దీనికి చాలా మంది హాజరయ్యారు. అయితే వారికి భోజనం వడ్డించే సమయంలో ఓ వ్యక్తికి.. ఎంపీ డ్రైవర్ సోదరుడు మటన్ కర్రీ వేశాడు. కానీ అందులో ముక్కలు లేక కేవలం గ్రేవీ మాత్రమే ఉండటంతో సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ఆ ఎంపీ డ్రైవర్ సోదరుడిని దూషించాడు.
వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మిగితా వారు కూడా వచ్చి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం పలువురు బీజేపీ సీనియర్ నేతలు జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ సద్దుమణించింది. ఆ తర్వాత ఈ ఘటనపై బీజేపీ ఎంపీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకునే ఉమాశంకర్ బింద్ ఈ ఘటనపై స్పందిస్తూ. విందులో చివర్లో మద్యం చేసించిన వారు రావడం వల్ల గొడవ జరిగినట్లు తెలిపారు.
మరోవైపు మీర్జాపూర్ జిల్లాలోని మజ్‌వాన్ నియోజకవర్గంలో నిషాద్ పార్టీ ఎమ్మెల్యే అయిన వినోద్ కుమార్ బింద్, బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఎంపీగా గెలిచారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని సుచిస్మిత మౌర్యపై, భదోహి ఎంపీ రమేశ్ బింద్ కుమార్తె జ్యోతి బింద్‌ను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బరిలోకి దింపింది
Comments
Please login to add a commentAdd a comment