జీవో 29పై అనేక అనుమానాలున్నాయి.. వాటిని నివృత్తి చేయాల్సిందే: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నియామక పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. గ్రూప్–1 పరీక్షల రీషెడ్యూల్ కోరుతూ అభ్యర్థులు రోడ్డెక్కితే వారిపై లాఠీలు ఝలిపించి, దురహంకారంతో అణచివేయాలని చూడటం దారుణమని వ్యాఖ్యానించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘గ్రూప్–1 ఉద్యోగాల ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు ఒకే తరహా నిబంధనలుండాలి. ఆ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒకే హాల్‌టికెట్ ఉండాలి.
కానీ టీజీపీఎస్సీ రెండుసార్లు జారీ చేయడం ఏమిటి? పరీక్షలన్నీ హైదరాబాద్ పరిసరాల్లోనే నిర్వహించడానికి కారణాలు ఏమిటి? ఇలా ఒకేచోట పరీక్షల నిర్వహణపై పలు అనుమానాలు వస్తున్నాయి. గ్రూప్–1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో అమలు చేసిన జీవో 29 విషయంలో అభ్యర్థులకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి దాపరికం లేకపోతే స్పష్టత ఎందుకు ఇవ్వడం లేదు?’’అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీతో కలసి అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో మాట్లాడిన మాటలేమిటి? ఇప్పుడు చేస్తున్న పనులేమిటి? ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని సీఎం రేవంత్‌కు సూచించారు.
హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నాలు
న్యాయం కావాలని రోడ్డెక్కిన నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం, నిరసనలను అణచివేసే ప్రయత్నం చేయడం, అరెస్టులకు దిగడం దారుణమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా పేదల ఇళ్లను కూలి్చవేస్తూ కాలం గడిపే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హామీలు అమలు చేసే సత్తా, శక్తి, లేకనే.. కొత్త సమస్యలు సృష్టించి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్ పూర్తిగా హిందూ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు.
వినాయక చవితి, బోనాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా అనేక మందిపై కేసులు పెట్టించారని.. డీజే సౌండ్ పెట్టారంటూ మండపాల నిర్వాహకులను వేధించారని పేర్కొన్నారు. ఇతర వర్గాల ప్రార్థన కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న శబ్దాలు పోలీసులకు, ముఖ్యమంత్రికి వినబడవా? కనబడవా? అని ప్రశ్నించారు. ముత్యాలమ్మ గుడి వద్ద నిరసనకారులపై అత్యంత పాశవికంగా దాడి చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఒక కార్యకర్తకు తీవ్రగాయాలు అయ్యాయని, పోలీసులు అతడిని ఇంట్లో వదిలివెళ్లారని.. కానీ అతడి పరిస్థితి విషమిస్తుండటంతో తాము ప్రైవేట్‌ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చూశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment