
వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడటం వెనుక.. ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించబడిన పశు వైద్యశాల ప్రహరీ గోడ నిర్మాణమేనని సమాచారం.
పశు వైద్యశాల వెనకాలే సాయిరెడ్డి ఇల్లు ఉండగా, ఆయన ఇంటికి దారి లేకుండా పశు వైద్యశాల ప్రహరీ గోడను నిర్మించారంటూ వివాదం నెలకొంది. దీంతో మనస్తాపానికి గురైన సాయి రెడ్డి కల్వకుర్తి వచ్చి పురుగుల మందు తాగాడు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపు సాయిరెడ్డి మృతి చెందాడు. సాయిరెడ్డి రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్‌లో తనను సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు పేర్కొనడం సంచలనంగా మారింది.