రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లిలో త్వరలో ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఐటీ సెంటర్ ఏర్పాటు వల్ల 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. బుధవారం చందనవెల్లిలో వెల్‌స్పన్ పరిశ్రమ రెండో యూనిట్‌ను మంత్రి సబితారెడ్డి, ఎంపీ జి.రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులతో కలసి ఆయన ప్రారంభించారు. తర్వాత వెల్‌స్పన్ చైర్మన్ బీకే గోయెంకా తదితరులతో కలిసి కంపెనీలో కలియదిరిగి పరికరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు.
చందనవెల్లిలో ప్రస్తుతం వెల్‌స్పన్ కంపెనీతోపాటు ఐటీఈఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ కేంద్రంలో మహిళలు, యువకులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కలి్పంచే బాధ్యతను కంపెనీ తీసుకుందని చెప్పారు. ఐటీ సెంటర్ ఏర్పాటుతో మరిన్ని చిన్న, మధ్య తరహా కంపెనీలు ఈ ప్రాంతం వైపు దృష్టి సారిస్తాయని అశాభావం వ్యక్తం చేశారు. త్వరలో సీతారాంపూర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఐటీని మరింతగా విస్తరిస్తామని ప్రకటించారు. 40 నుంచి 50 పరిశ్రమల ఏర్పాటుకు కృషి వెల్‌స్పన్‌లో కార్యక్రమం అనంతరం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి మాట్లాడారు. చందనవెల్లి, సీతారాంపూర్‌కు పరిశ్రమలు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని.. ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇక్కడ 40 నుంచి 50 పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హైతాబాద్, చందనవెల్లి, మాచనపల్లి గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు హెచ్‌ఎండీఏ ప్లాట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
త్వరలో పాలమూరు పూర్తి చేస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరలో పూర్తిచేసి షాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని కేటీఆర్ చెప్పారు. రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment