బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టీకరణ
ఢిల్లీ పెద్దల కోసం రూ.లక్షన్నర కోట్ల అవినీతికి పాల్పడతామంటే ఊరుకోం
ఇళ్ల కూల్చివేతలు అడ్డుకుంటాం.. పేదలకు అండగా ఉంటాం
మల్లాపూర్ (హైదరాబాద్): మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, అభివృద్ధికి తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదని, దానిపేరిట లూటిఫికేషన్‌కు మాత్రమే వ్యతిరేకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరు చెప్పి ఢిల్లీ పెద్దల కోసం లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి చేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఆరు గ్యారంటీలను పక్కనపెట్టి మూసీకి లక్షన్నర కోట్లు ఖర్చుపెడతామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చెబుతోందని, కేవలం రూ.1,100 కోట్లతో గోదావరి నీళ్లు మూసీకి తీసుకువస్తే సుందరీకరణ పూర్తి అవుతుందని చెప్పారు. నాచారంలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) పనితీరును పార్టీ నేతలతో కలిసి ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.
రూ.3,866 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం
బీఆర్‌ఎస్ హయాంలోని పదేళ్లలో రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని మాజీమంత్రి కేటీఆర్ చెప్పారు. మురుగునీటి శుద్ధి కోసం రూ.3,866 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టామని తెలిపారు. పేద ప్రజల ఇళ్లు కూలగొట్టి షాపింగ్ మాల్స్ కట్టేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకుంటామని, పేదలకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ చెప్పారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ఆవు పంచకంతో ఎస్టీపీ శుద్ధి
కేటీఆర్ నాచారం ఎస్టీపీ సందర్శన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నేతలు చేతులకు నల్ల బ్యాడ్జీలను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కేటీఆర్ తిరిగిన ప్రదేశంలో ఆవు పంచకంతో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ హెచ్‌ఆర్ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment