ప్రేమోన్మాది చేతిలో తల్లిదండ్రుల్ని కోల్పోయినవారికి కేటీఆర్ భరోసా
చెన్నారావుపేట: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో ప్రేమోన్మాది దాడిలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. నిందితుడు నాగరాజు దాడిలో తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణలు చనిపోవడంతో పిల్లలు దీపిక, మదన్‌లు అనాథలయ్యారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్నలు మంగళవారం హైదరాబాద్‌లోని కేటీఆర్ వద్దకు పిల్లలను తీసుకెళ్లారు.
వారితో మాట్లాడిన కేటీఆర్ జరిగిన విషయాలు తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ అనాథ పిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. సుగుణ బీఆర్‌ఎస్ క్రియాశీల కార్యకర్త, గ్రామ పంచాయతీలో వార్డు సభ్యురాలు కావడంతో పార్టీ తరఫున కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు.
కుటుంబానికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్ధిక సాయం అందించాలని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా నిందితుడు నాగరాజుకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కేటీఆర్ కోరినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment