KTR Request To UAE Envoy To Release Indian Expatriates - Sakshi
Sakshi News home page

వాళ్లను విడుదల చేయండి.. యూఏఈ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ రిక్వెస్ట్‌

Published Mon, Mar 13 2023 5:27 PM | Last Updated on Mon, Mar 13 2023 5:47 PM

KTR Request To UAE Envoy For expatriate Indians Release - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దుబాయ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని మంత్రి కేటీఆర్‌, యూఏఈ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌కు విచ్చేసిన ఆ దేశ రాయబారి ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారాయన. యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి.. నగర పర్యటనలో భాగంగా ప్రగతిభవన్‌తో కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్‌లో ఒక కేసుకుగానూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2005లో నేపాల్ దేశానికి చెందిన దిల్ ప్రసాద్ రాయ్ మరణం విషయంలో వీరు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే యూఏఈ చట్టాల ప్రకారం (షరియా చట్టం) మేరకు రూ.15 లక్షల రూపాయల పరిహారాన్ని బాధితుని కుటుంబం స్వీకరించేందుకు అంగీకరించిందని, ఈ మేరకు గతంలోనే స్వయంగా తానే నేపాల్ వెళ్లి 2013లోనే బాధితుడి కుటుంబాన్ని కలిసినట్లు మంత్రి కేటీఆర్‌, దుబాయ్‌ రాయబారికి వివరించారు.

షరియా చట్టంలోని (Diyyah) ప్రకారం బాధితుల కుటుంబం (blood money తీసుకుని)  క్షమాపణ పత్రం అందిస్తే వీరిని విడుదల చేసే అవకాశం ఉందని, ఈ మేరకు బాధితుని కుటుంబం 2013లోనే అవసరమైన అన్ని రకాల డాక్యుమెంట్లను దుబాయ్ ప్రభుత్వానికి ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే అటు భారత దౌత్య కార్యాలయం తో పాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి సైతం ఈ విషయంలో అనేకసార్లు తాను స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే..

యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు తాను వివరించిన ఈ సంఘటన తాలూకు వివరాలను అటు భారత, నేపాల్ దౌత్య కార్యాలయాల ద్వారా విచారించుకోవాలన్నారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో, దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ యూఏఈ రాయబారిని కోరారు. ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపించి, దుబాయిలోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు భారతీయ ప్రవాసీలను వెంటనే భారతదేశానికి పంపించేలా ప్రయత్నం చేయాలని కోరారు. 

తెలంగాణ అభివృద్ధి భేష్‌
మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలి  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పట్ల అనేక ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీపడేలా నిర్మిస్తున్న మౌలిక వసతుల వలన భవిష్యత్తులో హైదరాబాద్ ముఖచిత్రం మరింతగా మారుతుందన్న ఆశాభావాన్ని అబ్దుల్ నసీర్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం మరియు ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక రంగాల్లోని పెట్టుబడి అవకాశాలను,  తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్, యూఏఈ రాయబారికి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈ లోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్ కు పరిచయం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి, ఈ మేరకు తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్ట్ అప్ సంస్థలను అనుసంధానం చేసేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement