
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు అంతర్జాతీయ సమాజానికి దేశం ఎందుకు క్షమాపణ చెప్పా లి?’ అని ప్రధాని నరేంద్రమోదీని మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాల్సింది బీజేపీనే అని, దేశం కాదని ప్రధానిని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్వేషం వెదజల్లుతున్నందుకు బీజేపీ తొలుత దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపూర్‌శర్మ ఓ టీవీ చర్చా కార్య క్రమంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
అలాగే బీజేపీ మీడియా ఇన్‌చార్జి నవీన్‌కుమార్ జిందాల్ అభ్యంతరకర వ్యాఖ్యలతో ట్వీట్‌లు చేశారు. వీరి వ్యాఖ్యలకు ముస్లిం దేశాలైన ఇరాన్, ఖతార్, కువైట్, పాకిస్తాన్ తదితర దేశాలు తమ నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో భారత్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నుపూర్ శర్మపై సస్పెన్షన్ వేటు వేయగా.. నవీన్‌కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచే బహిష్కరించింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రధానిని ఉద్దేశించి చేసిన ట్వీట్‌ను వేలాది మంది రీట్వీట్ చేశారు.