వరుణ్ వేసిన చిత్రపటం
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా యాక్టివిస్ట్ తక్కళ్లపల్లి వరుణ్ తాను వేసిన చిత్రపటాన్ని సోమవారం ప్రగతి భవన్ లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశాడు. తన కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్యతో చిన్నవయసులో ఉన్నప్పుడు వారితో కలిసి ఉన్న చిత్ర పటాన్ని అత్యంత సహజంగా వేసిన వరుణ్ ను కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం కేటీఆర్ తన పిల్లలు ఇద్దరితో కలిసి షాపింగ్‌కు వెళ్లిన ఫొటోను చూసి వరుణ్ ఈ చిత్రాన్ని గీశారు. అచ్చం ఫొటోలో ఉన్నట్టుగానే ఈ పెయింటింగ్ వేశారు.
ఈ చిత్రాన్ని చూసి మురిసిపోయిన కేటీఆర్ అప్యాయంగా వరుణ్‌ను హత్తుకుని అభినందనలు తెలిపారు. తనకు ఇంత మంచి కానుక ఇచ్చినందుకు ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు. అయితే గత సెప్టెంబర్‌లో కూడా తన తండ్రి కేసీఆర్‌తో కేటీఆర్ కలిసివున్న చిత్రపటాన్ని వరుణ్ అందజేశారు.
‘గాంధీ’ వైద్యునికి అభినందనలు
గాంధీ ఆస్పత్రి వైద్యుడు అర్జున్‌రావును మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా అభినందించారు. మేడ్చల్ జిల్లా కీసరలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్బిణీకి రోడ్డుపైనే పురుడు పోసి రెండు ప్రాణాలను అర్జున్‌రావు కాపాడారు. 108 అంబులెన్స్ వచ్చేలోపు తల్లీబిడ్డలను కాపాడిన డాక్టర్ అర్జున్‌రావుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న కేటీఆర్.. మంచి పనిచేశారంటూ వైద్యుడిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment