బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రోజూ లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది.. కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు
పార్టీ నేతలతో కలసి ఎల్‌ఎండీ సందర్శన
తిమ్మాపూర్(మానకొండూర్): ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని, ఈ ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన లోయర్ మానేరు (ఎల్‌ఎండీ) జలాశయాన్ని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా జలాశయం వద్ద విలేకరులతో మాట్లాడారు. 8 నెలలుగా కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పంట పొలాలను ఎండబెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరంలో ఏర్పడిన చిన్న లోపాన్ని సాకుగా చూపి, ఒక విఫల ప్రాజెక్టుగా చూపే ప్రయత్నం చేశారన్నారు.
కాళేశ్వరం నుంచి రోజూ లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వృథాగా పోతున్నా లిఫ్టు చేయడం లేదన్నారు. ఈ ఏడాది కేవలం 45 శాతం వర్షపాతం మాత్రమే నమోదయిందని అధికారులు చెబుతున్నారని, అందుకే లోయర్ మానేరు డ్యాం, మిడ్ మానేరు సహా ఎండిపోయిన ప్రాజెక్టులను పరిశీలించేందుకే తాము పర్యటిస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ ఠీవిగా నిలబడి ఉందని వివరించారు. లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను రేవంత్‌రెడ్డి పణంగా పెట్టి, పంట పొలాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు.
ఎల్‌ఎండీ, అన్నపూర్ణ రిజర్వాయర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నింపితే రైతుల్లో భరోసా ఏర్పడుతుందని పేర్కొన్నారు. నీరు ఉన్నప్పుడు కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టులు నింపకుండా, రేపు వర్షం పడలేదనే సాకు చూపెడతారని అన్నారు. 40 వేల క్యూసెక్కుల ప్రవాహం దాటితే కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చన్నారు. ఇప్పుడు అక్కడ పది లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వెళుతోందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టులు నింపాలని సూచించారు.
ప్రభుత్వ ఆదేశాలు రాకపోవడం వల్లే నీరు లిఫ్ట్ చేయడం లేదని అధికారులు చెబుతున్నారని, కన్నెపల్లి దగ్గర పంపు ఆన్ చేస్తే రిజర్వాయర్లు అన్నీ నిండుతాయని అన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపితే రైతుల అవసరాలతో పాటు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాలు తీరుతాయని వెల్లడించారు. కేసీఆర్‌ను బద్నాం చేయాలని ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ చేసిన కుట్రలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.
మేడిగడ్డపై తప్పుడు ప్రచారం
మేడిగడ్డ మేడిపండు అని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఎండుతున్న ప్రాజెక్టులు, రైతుల బాధలను శాసనసభలో ప్రస్తావిస్తామన్నా రు. కేసీఆర్ ఆదేశాలతో, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచనతో ప్రాజెక్టుల సందర్శనకు వచ్చామన్నారు. ఎన్నికలు ముగిసినందున రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.
మల్లారెడ్డిపై సెటైర్లు
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సరదాగా సెటైర్లు వేశారు. ఎల్‌ఎండీ గేట్ల సమీపంలోని గెస్ట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతుండగా సోషల్ మీడియా స్టార్ ఉండగా తాము మాట్లాడలేమంటూ కేటీఆర్ చమత్కరించారు. మాజీ మంత్రులు సబిత, నిరంజన్‌రెడ్డి సైతం తామందరికన్నా మల్లారెడ్డి స్టేట్ ఫిగర్ అంటూ సెటైర్లు వేశారు.
రామగుండంలో బీఆర్‌ఎస్ బృందం బస
గోదావరిఖని: మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం రామగుండంలోని ఎన్టీపీసీ చేరుకోగా, స్థానిక బీఆర్‌ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాత్రి రామగుండంలోనే బస చేశారు. ఉదయం 8 గంటలకు ఎనీ్టపీసీ నుంచి నేరుగా కన్నెపల్లి పంపు హౌజ్‌ను సందర్శించి, అక్కడి నుంచి బయల్దేరి మేడిగడ్డను సందర్శించనున్నారు. అనంతరం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంట్లో మీడియా సమావేశంలో మాట్లాడతారు. మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment