మాకు ఇవ్వాల్సింది 1,434 కోట్లు | KTR Writes Letter To Financial Minister Nirmala Sitharaman Over Municipal Fonds | Sakshi
Sakshi News home page

మాకు ఇవ్వాల్సింది 1,434 కోట్లు

Published Sun, Sep 20 2020 4:30 AM | Last Updated on Sun, Sep 20 2020 4:30 AM

KTR Writes Letter To Financial Minister Nirmala Sitharaman Over Municipal Fonds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి హైదరాబాద్‌కు రావా ల్సిన రూ.468 కోట్లు, ఇతర పట్టణాలకు రావాల్సిన రూ.315.75 కోట్లు, 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన రూ. 650.20 కోట్లు కలిపి మొత్తం రూ.1,434 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రికి శనివారం కేటీఆర్‌ లేఖ రాశారు. ఈ లేఖను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరికి కూడా పంపించారు. 

కేటాయించారు...విడుదల చేయట్లేదు 
10 లక్షలకు పైగా జనాభా గల నగరాల కేటగిరిలో ఉన్న హైదరాబాద్‌కు రూ.468 కోట్లు, ఇతర పట్టణాలకు రూ.421 కోట్లను 15వ ఆర్థిక సంఘం కేటాయించినా, ఇప్పటి వరకు విడుదల చేయలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ నిధుల కేటాయింపులను కేంద్రం అంగీకరించిందని, లోక్‌సభలో సైతం యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టును ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. హైదరాబాద్‌కు రావాల్సిన నిధుల్లో ఒక్క రూపాయి విడుదల కాలేదని, మిగిలిన నగరాలకు సంబంధించి రూ.106 కోట్లు మాత్రమే విడుదల అయ్యాయన్నారు. కరోనా సంక్షోభంలో రాష్ట్రాలు కూడా ముందువరుసలో ఉండి పోరాడుతున్నాయని, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టిందని, వీటికి కేంద్ర ఆర్థిక సంఘం నిధులను మ్యాచింగ్‌ గ్రాంట్‌గా రాష్ట్ర బడ్జెట్లో కేటాయించడం జరిగిందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమాలను కొనసాగించడం ఇబ్బందిగా మారిందన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన రూ.2,714 కోట్ల బేసిక్‌ గ్రాంట్స్‌కు గాను కేంద్రం రూ. 2,502 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, రూ. 212 కోట్లు బకాయిపడిందన్నారు. 14వ ఆర్థిక సంఘానికి సంబంధించి మొత్తం రూ.650 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకు ఈ నిధులను పూర్తిగా చెల్లించిన విషయాన్ని మంత్రి తన లేఖలో ప్రస్తావించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement