దామరగిద్ద (నారాయణపేట): కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తుండగా ఫిట్స్ వచ్చి ఓ మహిళా సర్పంచ్ మృతి చెందింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దామరగిద్ద పీహెచ్‌సీలో డీపీఎల్ సర్జన్ డాక్టర్ హరిచందర్‌రెడ్డి సమక్షంలో మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరం చేపట్టారు. ఈ శిబిరంలో ఆపరేషన్ చేయించుకునేందుకు లింగారెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మి (32) వచ్చింది. అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను మధ్యాహ్నం రెండు గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు.
జైలోకిన్ ఇంజెక్షన్ ఇచ్చి, గర్భసంచి ప్రాంతంలో కడుపుపై ట్రాకర్‌ను లోపలికి పంపేందుకు చర్మాన్ని కట్ చేసే సమయంలో లక్ష్మికి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే లక్ష్మి మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు నారాయణపేట పాతబస్టాండ్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళా సర్పంచ్ మృతి చెందిందని, బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆపరేషన్ చేయకముందే..
లక్ష్మికి సర్జరీ చేసేందుకు అనస్తీయా వైద్యులు జైలోకిన్ ఇంజెక్షన్ ఇచ్చారని, ఆపరేషన్ చేసేందుకు సర్జన్ హరిచందర్‌రెడ్డి చర్మాన్ని కట్ చేయగా.. పేషెంట్ కోమాలోకి వెళ్లిందని డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్ తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వెంటనే మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించామన్నారు. అయితే, అక్కడికి చేరుకోగానే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. లక్ష్మి మృతికి గల కారణం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందన్నారు.
( చదవండి: విషాదం: ఇద్దరు చిన్నారులు సజీవ దహనం )
Comments
Please login to add a commentAdd a comment