fits patient
-
ఆపరేషన్ చేస్తుండగా ఫిట్స్..మహిళా సర్పంచ్ మృతి
దామరగిద్ద (నారాయణపేట): కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తుండగా ఫిట్స్ వచ్చి ఓ మహిళా సర్పంచ్ మృతి చెందింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. దామరగిద్ద పీహెచ్సీలో డీపీఎల్ సర్జన్ డాక్టర్ హరిచందర్‌రెడ్డి సమక్షంలో మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ శిబిరం చేపట్టారు. ఈ శిబిరంలో ఆపరేషన్ చేయించుకునేందుకు లింగారెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మి (32) వచ్చింది. అవసరమైన పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెను మధ్యాహ్నం రెండు గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. జైలోకిన్ ఇంజెక్షన్ ఇచ్చి, గర్భసంచి ప్రాంతంలో కడుపుపై ట్రాకర్‌ను లోపలికి పంపేందుకు చర్మాన్ని కట్ చేసే సమయంలో లక్ష్మికి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే లక్ష్మి మృతి చెందినట్టు అక్కడి వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు నారాయణపేట పాతబస్టాండ్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళా సర్పంచ్ మృతి చెందిందని, బాధ్యులపై చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆపరేషన్ చేయకముందే.. లక్ష్మికి సర్జరీ చేసేందుకు అనస్తీయా వైద్యులు జైలోకిన్ ఇంజెక్షన్ ఇచ్చారని, ఆపరేషన్ చేసేందుకు సర్జన్ హరిచందర్‌రెడ్డి చర్మాన్ని కట్ చేయగా.. పేషెంట్ కోమాలోకి వెళ్లిందని డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్ తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వెంటనే మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించామన్నారు. అయితే, అక్కడికి చేరుకోగానే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. లక్ష్మి మృతికి గల కారణం పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందన్నారు. ( చదవండి: విషాదం: ఇద్దరు చిన్నారులు సజీవ దహనం ) -
ట్రాక్టర్ బీభత్సం
చైతన్యపురి: నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో శనివారం ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. అయితే ఈ ఘటనలో రెండు కార్లు, ఐదు బైక్‌లు ధ్వంసం కాగా అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. గణేశ్పురి కాలనీలోట్రాక్టర్లో బిల్డింగ్ వ్యర్థాలను తీసుకెళ్తున్న డ్రైవర్ లింగయ్యకు ఫిట్స్ వచ్చి డ్రైవింగ్ సీటునుంచి కిందికి పడిపోయాడు. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపిన బైక్‌లు, కార్లను ఢీకొంటూ వెళ్లి ఆగింది. ఫిట్స్ తో కిందపడిపోయిన లింగయ్యను స్థానికులు దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై జానకిరెడ్డి తెలిపారు. -
తాత్కాలిక డ్రైవర్‌కు ఫిట్స్
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్‌కు దాస్‌నగర్ గ్రామశివారులో ఫిట్స్ రావడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. శుక్రవారం కోరుట్ల డిపోకు చెందిన (టీఎస్ 02 జెడ్ 0283) బస్సు సాయంత్రం 7.30 గంటల సమయంలో నిజామాబాద్ నుంచి కోరుట్లకు బయలుదేరింది. ఇందులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. మాక్లూర్ మండలం దాస్‌నగర్ వద్దకు రాగానే బస్‌డ్రైవర్ ప్రసాద్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. పొలాల్లో బస్సు నిలిచిపోయింది. డ్రైవర్ ప్రసాద్‌కు కొద్దిపాటి గాయాలు అయ్యాయి. బస్సు పొలాల్లోకి వెళ్లగానే ప్రయాణికులు ఆందోళన చెంది కేకలు వేశారు. ఓవైపు చీకటి పడింది. అత్యవసర డోర్ ద్వారా 25 మంది బస్సునుంచి బయటకు వచ్చారు. మాక్లూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించి వారిని మరో బస్సు కోరుట్లకు తరలించారు. డ్రైవర్‌ను జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్‌గా ప్రసాద్ కోరుట్ల డిపోలో ఐదు రోజుల చేరాడు. ఆర్టీసీ అధికారులు హడావుడిగా అనుభవం, ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా తాత్కాలిక డ్రైవర్లను నియమించడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయం వ్యక్తమైంది. -
బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ : తప్పిన ప్రమాదం
సిరిసిల్ల : డ్యూటీలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు సిరిసిల్ల నుంచి రగుడు గ్రామం వైపు వెళ్తున్న సమయంలో డ్రైవర్ నరసింహులుకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. దీంతో బస్సు రోడ్డుపక్కకు ఒరిగిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో డ్రైవర్ బ్రేకుపై కాలు వేసి ఉండడంతో బస్సుపక్కకు ఒరిగి ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇది గమనించిన ప్రయాణికులు కిటికీ అద్దాల నుంచి బయటకు దూకారు. వెంటనే డ్రైవర్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.