Land Mafia: Real Estate Illegal Constructions In Hyderabad- Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో రెచ్చిపోతున్న భూ మంత్రగాళ్లు

Published Thu, Dec 16 2021 8:54 AM | Last Updated on Thu, Dec 16 2021 1:16 PM

Land Mafia: Real Estate Illegal Constructions In Hyderabad - Sakshi

శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయిలో సర్వే నంబర్‌ 2,5,6లలోని ఫిరంగి నాలాలో అర్ధరాత్రి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. చారిత్రక ఫిరంగి నాలాను అపర్ణ, సుమధుర కన్‌స్ట్రక్షన్‌ సంస్థలు ధ్వంసం చేసి భారీ నిర్మాణాలు చేపడుతున్నాయని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి వీటిని ఆపాలని కోరుతూ ఎంపీటీసీ మాజీ సభ్యుడు నరేందర్‌ రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్, నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సహా సీఎల్పీ నేత భట్టివిక్రమార్కలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు’ 

‘కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్‌ 19, 20లలో నివాస గృహాల మధ్య ఎలాంటి అనుమతుల్లేకుండా గోదాములు, ఫంక్షన్‌హాళ్లు నిర్మిస్తున్నారు. పాటు కాల్వను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండటంతో వర్షపు నీరు నిలిచిపోయి మహిళా సమాఖ్య భవనం దెబ్బతిందని, ఈ నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని స్థానికుడు శివకుమార్‌ ఇటీవల మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేయడం గమనార్హం’  

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ యంత్రాంగం ఒకవైపు అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తుంటే.. మరో వైపు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ భూములు, చెరువు శిఖం, నాలాలపై నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. పాత పంచాయతీల నుంచి అనుమతులు తీసుకుని, కొత్తగా నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. వీటిని గుర్తించి అడ్డుకుంటున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి.

వాటి జోలికి వెళ్లొద్ధంటూ హుకుం జారీ చేస్తున్నా.. టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే శివారు జిల్లాల్లో వందకుపైగా నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు తెలిసింది. అయినా అక్రమ వెంచర్లు, భవన నిర్మాణాలు ఆగకపోగా.. మరిన్ని వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వీటి వెనుక బడా కార్పొరేట్‌ సంస్థలు, ప్రజాప్రతినిధులు ఉండటమే  కా రణమని టాస్క్‌ఫోర్స్‌ బృందాలు అభిప్రాయపడుతున్నాయి.  

16 మున్సిపాలిటీల పరిధిలో..  

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాలుగు వేలకుపైగా వెంచర్లు ఉన్నట్లు సమాచారం. 16 మున్సిపాలిటీల పరిధిలో 1397 లే అవుట్లు ఉండగా, వీటిలో 380 లేఅవుట్లకు మాత్రమే హెచ్‌ఎండీ అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటికి  ఎలాంటి అనుమతులు లేవు. వీటిలో రెండు వేలకుపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

 వీటిలో ఎక్కువగా మణికొండ, నార్సింగి, తుర్కయాంజాల్, హయత్‌నగర్, మీర్‌పేట్, బడంగ్‌ పేట్‌ మున్సిపాలిటీల పరిధిలోనే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఏటా 12 వేల నిర్మాణాలకు, హెచ్‌ఎండీఏ ఏటా నాలుగు వేల నిర్మాణాలకు అనుమతులు  ఇస్తున్నాయి. జీ+పోర్‌కు అనుమతులు తీసుకుని, అంతకంటే ఎక్కువ అంతస్తులు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

  ఇలా వీటి పరిధిలో అయిదు వేలకుపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో కొనుగోలుదారులంతా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను డిసెంబర్‌ 31లోగా అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఆ పనుల్లో వేగం పెంచారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్న అధికారులకు అండగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు కూల్చివేతలను ఆపాల్సిందిగా కోరుతూ క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు.  
 
మచ్చుకు కొన్ని కూల్చివేతలు.. 

 మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ రోడ్‌ నంబర్‌– 2లో అనుమతించిన దానికన్నా అదనంగా నిర్మించిన అంతస్తులను కూల్చివేశారు. పైపులైన్‌ రోడ్డులో అయిదు అంతస్తులకు అనుమతి పొంది ఆరు అంతస్తులు నిర్మిస్తుండగా, అధికారులు గుర్తించి కూల్చివేతలు చేపట్టారు.  

 నార్సింగ్‌ పరిధిలోని పంచవటి లక్ష్మీసాయి లేఅవుట్‌లో రహదారిని ఆక్రమించి నిర్మించిన ప్రహరీ సహా బుల్కాపూర్‌ నాలా బఫర్‌జోన్‌లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు.  

  శంషాబాద్‌ మున్సిపాలిటీ సహా ఆ పరిసర ప్రాంతాల్లోని గ్రామాలన్నీ 111 జీఓ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.  

 తొండుపల్లి, ఊట్‌పల్లి, రాళ్లగూడ, గొల్లపల్లిల్లో భారీ నిర్మాణాలు, గోదాములు నిర్మించారు. కేవలం మున్సిపాలిటీ పరిధిలోనే 146 అక్రమ నిర్మాణాలు గుర్తించి, ఆ మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు నివేదించారు.  

 ఇబ్రహీంపట్నం శేరిగూడలోని వార్డు నంబర్‌ 14, 16లలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను అధికారులు కూల్చివేశారు. 

 శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంనగర్‌ కాలనీలో అక్రమంగా రోడ్డును ఆక్రమించి నిర్మిస్తున్న ఓ నిర్మాణంతో పాటు అదే కాలనీలో అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న మరికొన్ని భవనాలకు నాలుగు రోజుల క్రితం అధికారులు నోటీసులు జారీ చేశారు.  

► కొందుర్గు గ్రామ పంచాయతీ పరిధిలో 23 అక్రమ నిర్మాణాలతో పాటు మరో 11 అక్రమ వెంచర్లను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో పంచాయతీ కార్యదర్శిపై జిల్లా అధికారులు వేటువేశారు.   

 ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓ వెంచర్‌లో ప్రజావసరాలకోసం వదిలిన పార్కు స్థలాల స్థిరాస్తి వ్యాపారులు ఆ తర్వాత ఆ çస్థలాన్ని 44 ప్లాట్లు చేసి 12 మందికి విక్రయించినట్లు అధికారులు గుర్తించి, ఆయా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాల్సిందిగా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.    

 పెద్ద అంబర్‌పేట్‌ సర్వే నంబర్‌ 47, 48లలో ప్రహరీ సహా పసుమాములలోని సర్వే నంబర్‌ 91(పి), 96(పి)లలో అనుమతి లేని వెంచర్‌లో నిర్మిస్తున్న ప్రహరీలను 
కూల్చివేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement