సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతకు మూలమైన నీళ్లు–నిధులు–నియామకాల విషయంలో తీవ్ర అన్యా యం జరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకో వడం లేదని శాసనమండలి మాజీ చైర్మన్ కె.స్వామిగౌడ్ ధ్వజమెత్తారు. కమీషన్ల పేరుతో ప్రభుత్వం దోచుకుంటోందని, గడీల పాలన తో కుటుంబపాలనకే పరిమితమైందని మండిపడ్డారు. ఈ అంశాలన్నీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకే ఈ నెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్నారని వివరించారు.
మంగళవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పాదయాత్ర ప్రముఖ్ డా.జి.మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పాదయాత్ర సహ ప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్‌తో కలిసి స్వామిగౌడ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రాజెక్ట్‌ల విషయంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరితో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితులు నెలకొన్నాయని డీకే అరుణ విమర్శించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం 68 శాతం తెలంగాణలో ఉండగా, తక్కువ నీటి వాటాకు కేసీఆర్ ఒప్పుకుని రాష్ట్రానికి ద్రోహం చేశారన్నారు.
‘ఉద్యమ నిర్మాణాల్లో కీలకభూమిక పోషించాలి’
సాక్షి, హైదరాబాద్: ప్రజాఉద్యమాల నిర్మాణం, సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక భూమిక పోషించాలని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. సామాన్యులు, కష్టజీవులకు అండగా నిలుస్తూ సమస్యలపై తీవ్రస్థాయి ఉద్యమాలు చేపట్టి పార్టీపట్ల ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచాలని సూచించారు. మంగళవారం ఆయన నగరానికి వచ్చిన సందర్భంగా మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డిలతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉద్యమకార్యాచరణ, విస్తరణపై చర్చించారు. ప్రధాని మోదీ రైతు, కారి్మక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక నల్లచట్టాలను తీసుకొచ్చారని రాజా ధ్వజమెత్తారు.
ఉద్యమాల ఆవశ్యకత పెరిగింది: చాడ
తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ ఉద్యమాల ఆవశ్యకత మరింత పెరిగిందని చాడ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోలేదని, పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడంలేదని అన్నారు. నగరంలోని సీఆర్ ఫౌండేషన్‌ను డి.రాజా, ఆయన సతీమణి ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అనీరాజా సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment