Limited Transportation Facility For Crores Of People In Greater - Sakshi
Sakshi News home page

సొంత బండి సో బెటర్‌.. హైదరాబాద్‌లో ఎన్ని వాహనాలు ఉన్నాయో తెలుసా?

Published Sat, May 28 2022 7:59 AM | Last Updated on Sat, May 28 2022 9:25 AM

Limited Transportation Facility For Crores Of People In Greater - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాధారణంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక, రవాణా సదుపాయాలు విస్తరిస్తాయి. కానీ గ్రేటర్‌లో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. ఏటేటా జనాభా పెరుగుతోంది. నలువైపులా నగరం విస్తరిస్తోంది. కానీ ప్రజారవాణా సదుపాయాలు మాత్రం పరిమితంగానే విస్తరించాయి. కొత్తగా మెట్రో రైలు సదుపాయం మినహా  అదనంగా ప్రజారవాణా ఏ మాత్రం మెరుగుపడకపోవడం గమనార్హం. అదే సమయంలో వ్యక్తిగత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి.

నగర జనాభా ప్రస్తుతం ఇంచుమించు కోటిన్నరకు చేరుకుంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగానే వాహనాల సంఖ్య 70 లక్షలు దాటింది. ఈ పదేళ్లలో ప్రజారవాణా విస్తరణకు నోచకపోవడం వల్లనే వ్యక్తిగత వాహనాల సంఖ్య భారీగా పెరిగినట్లు  రవాణా రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రోపాలిటన్‌ నగరాల్లో ప్రజా రవాణా గణనీయంగా అభివృద్ధి చెందితే హైదరాబాద్‌లో మాత్రం తగ్గుముఖం పట్టడం గమనార్హం.  

కిక్కిరిసిపోతున్న రహదారులు.. 

  • గ్రేటర్‌లో ఏటా సుమారు 2.5 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. వీటిలో మూడొంతులకు పైగా వ్యక్తిగత వాహనాలే.  ప్రజారవాణా వాహనాల విస్తరణ కనీసం 15 శాతం కూడా లేకపోవడం గమనార్హం. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో వాహనాల సంఖ్య ప్రస్తుతం 71 లక్షలు దాటింది.  రోజు రోజుకు వేల సంఖ్యలో రోడ్డెక్కుతున్న  వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. కోవిడ్‌ దృష్ట్యా వ్యక్తిగత వాహనాల  వినియోగం  భారీగా పెరిగింది. ఈ రెండేళ్లలోనే  5  లక్షలకు పైగా కొత్త వాహనాలు  రోడ్డుపైకి వచ్చాయి.  
  • 2020లో 65 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 71 లక్షలు  దాటాయి. యువతలో  80 శాతం  మందికి బైక్‌ తప్పనిసరిగా మారింది. చదువు, ఉద్యోగ,వ్యాపార అవసరాలతో  నిమిత్తం లేకుండా ఒక వయస్సుకు రాగానే  పిల్లలకు బండి కొనివ్వడాన్ని  తల్లిదండ్రులు గొప్పగా భావిస్తున్నారు.  
  • రవాణాశాఖలో నమోదైన 71 లక్షల వాహనాల్లో సుమారు 47 లక్షల వరకు బైక్‌లే కావడం గమనార్హం. మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. మిగతా 5 లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, సరుకు రవాణా వాహనాలు, స్కూల్‌ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు తదితర కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి.  

పదేళ్లలో రెట్టింపు... 

పదేళ్లలో జనాభా పెరిగింది. 2011 నాటి  లెక్కల ప్రకారం 75 లక్షలు ఉంటే ఇప్పుడు కోటిన్నరకు చేరింది. సొంత వాహనాలు సైతం ఇంచుమించు జనాభాకు సమాంతరంగా పెరిగాయి. కానీ  ప్రజారవాణా సదుపాయాలు మాత్రం ఈ పదేళ్లలో  చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. 2012 నాటి లెక్కల ప్రకారం నగరంలోని 28 డిపోల పరిధిలో 3850 సిటీ బస్సులు ఉండేవి. ప్రతిరోజు సుమారు 32 లక్షల మంది ప్రయాణికులు ఈ బస్సుల్లో రాకపోకలు సాగించారు. మరో 8 లక్షల మంది ఆటోలను వినియోగించుకున్నారు. లక్ష మంది ఎంఎంటీఎస్‌ రైళ్లలో ప్రయాణం చేశారు. అంటే 75 లక్షల జనాభాలో కనీసం సగం మందికి ప్రజా రవాణా అందుబాటులో ఉంది. ఆర్టీఏ  లెక్కల ప్రకారం పదేళ్ల క్రితం నగరంలో వ్యక్తిగత 33 లక్షల వరకు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 71 లక్షలు దాటింది.   

ఇప్పు‘ఢీ’లా... 
రోజుకు 3.5 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే మెట్రో రైలు తప్ప ఈ పదేళ్లలో ఇతర రవాణా సదుపాయాలు ఏ మాత్రం మెరుగుపడలేదు. సిటీ బస్సుల సంఖ్య ఇంచుమించు సగానికి పడిపోయింది. 2550 బస్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 16 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. కోవిడ్‌ దృష్ట్యా ఆటోలు, క్యాబ్‌ల వినియోగం బాగా తగ్గింది. ప్రస్తుతం ఈ రెండు కేటగిరీ వాహనాల్లో ప్రతిరోజు 5 లక్షల మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నట్లు అంచనా.

కోవిడ్‌తో ఎంఎంటీఎస్‌ల వినియోగం దారుణంగా పడిపోయింది. గతంలో రోజుకు 121 సర్వీసులు నడిస్తే ఇప్పుడు 75 మాత్రమే ఉన్నాయి. అప్పుడు లక్ష మంది ప్రయాణం చేశారు. ఇప్పుడు 25 వేల నుంచి 30 వేల మంది మాత్రమే ఎంఎంటీఎస్‌లను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ,ప్రైవేట్‌ రంగాలకు చెందిన ఉద్యోగులు, ఐటీ నిపుణులు, విద్యార్ధులు తదితర అన్ని వర్గాలకు మెట్రో రైలును ఏకైక పరిష్కారంగా భావించారు. కానీ  ఈ ఐదేళ్లలో మెట్రో  ప్రయాణికుల సంఖ్య ఏ మాత్రం మెరుగుపడలేదు.  

(చదవండి: టాఫిక్‌ సిగ్నల్‌.. ఇక ఆటోమేటిక్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement