సాక్షి, ఖమ్మం: ‘నువ్వు తీసుకున్న అప్పు తీరలేదు. ఇంకా చెల్లించాలి. లేకపోతే.. మీ అమ్మ ఫోటోను మార్ఫింగ్ చేసి.. పోర్న్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాం’.. ఇది లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న ఆరాచకాలు. మంచిర్యాల ఘటన మరవకముందే ఖమ్మం జిల్లా మధిరలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తీసుకున్న డబ్బు చెల్లించినా ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకులు ఓ యువకుడిని వేధిస్తుండడంతో పాటు ఆయన తల్లి ఫొటోను మార్ఫింగ్ చేసి ఇతరులకు పంపిస్తున్న ఘటన ఇది.
మధిరకు చెందిన ప్రదీప్ ఆన్‌లైన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఆ సమయాన ప్రదీప్‌తో పాటు ఆయన ఆధార్‌కార్డుతో పాటు తల్లి పాన్‌కార్డును యాప్ నిర్వాహకులు తీసుకున్నారు. అయితే, రుణం తిరిగి చెల్లించేందుకు యత్నించగా, వెబ్‌సైట్ పనిచేయలేదు. దీంతో నిర్వాహకులకు ఫోన్ చేస్తే యూపీఐ లింక్ పంపడంతో డబ్బు చెల్లించాడు.
అయినప్పటికీ ఇంకా బకాయి ఉందంటూ ప్రదీప్‌ను ఫోన్ చేసి వేధించసాగారు..రాత్రి, పగలు తేడా లేకుండా రకరకాల ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్లు చేస్తు నరకం చూపిస్తున్నారని ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన తల్లి పాన్‌కార్డులోని ఫొటోను మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయాడు. అంతేగాక ఆయన ఫోన్‌లో నంబర్లు ఉన్న వారికి సదరు మహిళ మోసాలకు పాల్పడుతోందంటూ మెసెజ్‌లు పంపడం ప్రారంభించారు. ఈ విషయమై ప్రదీప్ చేసిన ఫిర్యాదుతో సోమవారం కేసు నమోదు చేసినట్లు మధిర టౌన్ ఎస్సై సంకీర్త్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment